HomeTelangana

భారీ వర్షాల నేపథ్యంలో విఫలమైన కమాండ్ కంట్రోల్ సెంటర్!

భారీ వర్షాల నేపథ్యంలో విఫలమైన కమాండ్ కంట్రోల్ సెంటర్!

కమాండ్ కంట్రోల్ సెంటర్ కేవలం చూసుకొని మురుసుకోవడానికి మాత్రమే ఉందని.. అసలైన సమయంలో ఎలాంటి ఉపయోగంలో లేకుండా పోయిందని పలువురు విమర్శలు గుప్పిస్తున్నారు.

అమిత్ షా ఒత్తిడితో చివరకు కాసినో కింగ్ చీకోటిని బీజేపీలో చేర్చుకున్నారు
హైదరాబాద్ సిటీ కమిషనర్ సంచలన నిర్ణయం – పంజాగుట్ట పీఎస్ సిబ్బంది మొత్తం ఒకేసారి ట్రాన్స్ ఫర్
‘హైదరాబాద్ ప్రజలు ఇళ్ళలోంచి బైటికి రాకండి’

తెలంగాణ ప్రభుత్వానికి ప్రచార యావ ఎక్కువనే విషయం మరో సారి రుజువయ్యింది. ఏ కార్యక్రమాన్ని అయినా, మౌలిక వసతులను అయినా ఆర్భాటంగా ప్రకటించినా.. వాస్తవ స్థితికి వచ్చే సరికి అసలు పనికి రాకుండా పోతుందనే ఆరోపణలు ఉన్నాయి. భారీ వర్షాల నేపథ్యంలో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన కమాండ్ కంట్రోల్ సెంటర్ పని తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పోలీస్ శాఖలోని వివిధ విభాగాలకు చెందిన ఉన్నతాధికారులు ఒకే చోట నుంచి క్రైమ్ మానిటరింగ్, కమాండ్ కంట్రోల్ చేసేందుకు వీలుగా ఈ అత్యాధునిక సెంటర్‌ను ఏర్పాటు చేశారు. తెలంగాణ వ్యాప్తంగా లా అండ్ ఆర్డర్, ట్రాఫిక్‌ను నేరుగా పర్యవేక్షించేందుకు ఇది ఉపయోగపడుతుందని అధికారులు వెల్లడించారు.

విపత్తుల సమయంలో కూడా అన్ని శాఖలను సమన్వయం చేసుకుంటూ సరైన రక్షణ, పునరావాస చర్యలు తీసుకునే వీలుంటుందని ప్రభుత్వం కూడా వెల్లడించింది. కానీ, గత మూడు రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాలు, వరదలు, ముంపు ప్రాంతాలను మానిటర్ చేయడంలో ఈ కమాండ్ కంట్రోల్ సెంటర్ విఫలం అయ్యింది. విపత్కర పరిస్థితుల్లో మానిటరింగ్ సెల్‌గా పని చేయాల్సిన ఈ కమాండ్ కంట్రోల్ సెంటర్.. దేనికీ పనికి రాకుండా పోయిందనే ఆరోపణలు వస్తున్నాయి.

రాష్ట్ర వ్యాప్తంగా ఏర్పాటు చేసిన నిఘా కెమేరాల ద్వారా ఏ మూలన ఏం జరుగుతుందో తెలిసిపోతుందని.. రియల్ టైంలో వీక్షించవచ్చని కూడా చెప్పింది డొల్లే అని తేలిపోయింది. బుధ, గురు వారాల్లో కమాండ్ కంట్రోల్ సెంటర్ పూర్తి స్థాయిలో పని చేయలేకపోయినట్లు తెలస్తున్నది. అక్కడ సరిపడ సిబ్బంది లేకపోవడంతో పాటు ఇతర శాఖలతో సమన్వయం చేసేందుకు కూడా ఎలాంటి ఆదేశాలు ఇవ్వలేదు. దీంతో కమాండ్ కంట్రోల్ సెంటర్ వరదల మానిటరింగ్‌కు ఉపయోగపడలేదని తెలుస్తున్నది.

సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు డీజీపీ రాష్ట్ర వ్యాప్తంగా పోలీస్ శాఖను తన కార్యాలయం నుంచే పర్యవేక్షించారు. మున్సిపల్ మంత్రి కేటీఆర్.. జీహెచ్ఎంసీ కార్యాలయంలో కూర్చొని పరిస్థితిని తెలుసుకున్నారు. ఇక అత్యవసర వైద్య సదుపాయాల కోసం ఆ శాఖ వేరేగా కమాండ్ కంట్రోల్ సెంటర్ ఏర్పాటు చేసుకున్నది. మంత్రి హరీవ్ రావు ఆదేశాల మేరకు జిల్లాల్లో కూడా కాల్ సెంటర్లు ఏర్పాటు చేసుకున్నారు. దీంతో రాష్ట్రంలో ఎక్కడ ఏం జరుగుతున్నదో.. శాఖల మధ్య సమన్వయం లేకుండా పోయింది.

ములుగు జిల్లాలో జంపన్న వాగు పొంగి నలుగురు కొట్టుకొని పోయారు. అలాగే ఆ జిల్లాలో కొన్ని ట్రక్కులు కూడా నీటిలో మునిగిపోయాయి. ఆ సమాచారాన్ని అధికారులకు అందినా.. ఎవరితో సమన్వయం చేయాలనే విషయం తెలియరాలేదు. ముంపు గ్రామాల ప్రజలను రక్షించడానికి హెలీకాప్టర్ల అవసరం ఏర్పడింది. దీనికి రాష్ట్ర స్థాయిలో ఆమోదం లభించాల్సి ఉన్నది. కానీ, శాఖల మధ్య సమన్వయం లేకపోవడంతో హెలీకాప్టర్ రావడం ఆలస్యం అయ్యింది. చివరకు న్యూస్ ఛానల్స్ ద్వారా విషయం తెలుసుకొని రాష్ట్ర అధికారులు హెలీకాప్టర్ పంపించారు. కానీ అప్పటికే కొంత ప్రాణనష్టం ఏర్పడింది.

వాస్తవానికి కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో డీజీపీ, సీఎంకు ప్రత్యేక ఛాంబర్లు ఏర్పాటు చేశారు. ఇలాంటి విపత్కర సమయంలో అక్కడి నుంచే అన్ని శాఖలను సమన్వయం చేసుకుంటూ మానిటరింగ్ చేసే అవకాశం ఉన్నది. ఇదే బిల్డింగ్‌లో జీహెచ్ఎంసీ అధికారులకు కూడా ఛాంబర్లు ఉన్నాయి. కానీ, ఎవరూ వీటిని ఉపయోగించలేదు. కమాండ్ కంట్రోల్ సెంటర్ కేవలం చూసుకొని మురుసుకోవడానికి మాత్రమే ఉందని.. అసలైన సమయంలో ఎలాంటి ఉపయోగంలో లేకుండా పోయిందని పలువురు విమర్శలు గుప్పిస్తున్నారు. కాగా, సీసీసీ పూర్తి స్థాయిలో సిద్ధం కాకపోవడం వల్లే అక్కడి నుంచి మానిటరింగ్ చేయలేకపోయామని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి.