HomeTelangana

కాంగ్రెస్ పార్టీకి సీఎం కేసీఆర్ మరో సారి ఝలక్ ఇవ్వబోతున్నారా?

కాంగ్రెస్ పార్టీకి సీఎం కేసీఆర్ మరో సారి ఝలక్ ఇవ్వబోతున్నారా?

మెదక్ జిల్లాకు చెందిన ఇద్దరు సీనియర్ నాయకులు కూడా బీఆర్ఎస్‌లో చేరేందుకు సుముఖత వ్యక్తం చేసినట్లు తెలుస్తున్నది.

సీఎం కేసీఆర్, బీఆర్ఎస్ పార్టీకి షాక్.. కోకాపేట స్థలం విషయంలో హైకోర్టు నోటీసులు
కేసీఆర్ తో భీం ఆర్మీ ఛీఫ్ ఆజాద్ భేటీ… తమ పార్టీ మహాసభలకు ఛీఫ్ గెస్ట్ గా రావాలని విజ్ఞప్తి
ఎమ్మెల్యే సీతక్కను సెక్రటేరియట్ లోకి వెళ్ళకుండా అడ్డుకున్న పోలీసులు

కర్ణాటక ఎన్నికల తర్వాత తెలంగాణ కాంగ్రెస్‌లో ఊపు వచ్చింది. మరో నాలుగు నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు రానున్న తరుణంలో కార్యకర్తల్లో ఉత్సాహాన్ని నింపడానికి పలు డిక్లరేషన్లను విడుదల చేస్తోంది. ఇప్పటికే రైతు డిక్లరేషన్, యూత్ డిక్లరేషన్ విడుదల చేశారు. వచ్చే నెలలో కొల్లాపూర్‌లో జరుగనున్న సభలో మహిళా డిక్లరేషన్ రిలీజ్ చేస్తామని కాంగ్రెస్ చెప్పింది. మరోవైపు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, జూపల్లి కృష్ణారావు వంటి సీనియర్లను పార్టీలో చేర్చుకోవడం ద్వారా మెరగైన ఫలితాలు వస్తాయని ఆశిస్తోంది. ఇదిలా ఉండగానే కాంగ్రెస్ పార్టీని బీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ సైలెంట్‌గా దెబ్బకొట్టారు.

భువనగిరికి చెందిన కంభం అనిల్ కుమార్‌ను పార్టీలోకి చేర్చుకోవడమే కాకుండా.. భువనగిరి టికెట్ ఇస్తామని కూడా హామీ ఇచ్చారు. దీంతో ఉమ్మడి నల్గొండ జిల్లాలో కాంగ్రెస్ ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ఒకవైపు తాము వేరే పార్టీ నాయకులను ఆకర్షించే పనిలో ఉండగానే.. కేసీఆర్ తన పని తాను చేసుకొని పోతున్నారు. కాంగ్రెస్ పార్టీలో చేరుతున్న వారిపై ఎలాంటి విమర్శలు చేయడం లేదు. కనీసం ఆ పార్టీని అసలు పట్టించుకున్నట్లు కూడా కనపడటం లేదు. కానీ, తెరవెనుక మాత్రం తన పని తాను చేసుకొని పోతున్నారు.

కాంగ్రెస్ పార్టీకి ఈ సారి ఉమ్మడి ఖమ్మం, నల్గొండ జిల్లాల్లో భారీగా సీట్లు వస్తాయని పలు సర్వేలు అంచనా వేశాయి. దీంతో ఆ రెండు జిల్లాల్లో కాంగ్రెస్‌ను దెబ్బకొట్టడానికి పలు వ్యూహాలు సిద్ధం చేస్తున్నారు. కేసీఆర్ ముందుగా నల్గొండ జిల్లాపై ఫోకస్ చేసినట్లు కనపడుతున్నది. కంభం అనిల్ కుమార్‌ను పార్టీలో చేర్చుకోవడం ద్వారా నేరుగా కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిని బలహీనపరిచినట్లు అయ్యింది. మరోవైపు అదే జిల్లాకు చెందిన మరో ముగ్గురు సీనియర్లతో కూడా గులాబీ బాస్ టచ్‌లో ఉన్నట్లు తెలుస్తున్నది. ఎప్పటి నుంచో కాంగ్రెస్ పార్టీకి అండగా ఉన్న ఆ నేతలను.. బీఆర్ఎస్‌లోకి రప్పించడానికి ప్రయత్నాలు తుది దశకు వచ్చినట్లు తెలుస్తున్నది.

మెదక్ జిల్లాకు చెందిన ఇద్దరు సీనియర్ నాయకులు కూడా బీఆర్ఎస్‌లో చేరేందుకు సుముఖత వ్యక్తం చేసినట్లు తెలుస్తున్నది. త్వరలోనే వారు కారెక్కబోతున్నట్లు సోషల్ మీడియాలో వార్తలు హల్ చల్ చేస్తున్నాయి. కాంగ్రెస్ రాష్ట్ర నాయకత్వం ఇప్పటికే వారిని బుజ్జగించే పనిలో పడిందని వార్తలు వస్తున్నాయి. అయితే, బీఆర్ఎస్‌లో వారికి మంచి పదవులు ఆఫర్ చేసినట్లు తెలుస్తున్నది. అందుకే కారెక్కేందుకే సిద్ధపడినట్లు సమాచారం.

కాంగ్రెస్ రాష్ట్ర నాయకత్వం ఒక వైపు నుంచి సీనియర్లను పార్టీలోకి తీసుకొని వస్తుంటే.. మరోవైపు నుంచి క్షేత్ర స్థాయిలో బలమైన నాయకులను బీఆర్ఎస్ ఆకర్షిస్తోంది. రాష్ట్రంలో రాబోయే ఎన్నికల్లో బీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్యే పోటీ ఉంటుందనే అంచనా మేరకు.. ఈ రెండు పార్టీల మధ్యే ఆపరేషన్ ఆకర్ష్ నడుస్తోంది. ఎన్నికల సమీపిస్తున్నందున.. తమ నాయకులను కాపాడుకునేందుకు కాంగ్రెస్ పార్టీ తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది. ముఖ్యంగా గెలిచే అవకాశం ఉన్న నాయకులు, క్షేత్ర స్థాయిలో పని చేసే వారిని వదులు కోవడానికి ఇష్టపడటం లేదు. ఇందుకోసం ఎలాంటి చర్యలు తీసుకోవాలనే విషయంపై ఇప్పటికే టీపీసీసీ రేవంత్ రెడ్డి అధిష్టానంతో చర్చించినట్లు సమాచారం. అవసరం అయితే పార్టీ మారేందుకు సిద్ధ పడుతున్న కీలక నాయకులు ఆపేందుకు వారి డిమాండ్లపై హామీ అయినా ఇవ్వాలని భావిస్తున్నారు. మరి కేసీఆర్ దెబ్బకు కాంగ్రెస్ మళ్లీ కకావికలం అవుతుందా.. లేదంటే తట్టుకొని నిలబడుతుందా అనేది వేచి చూడాలి.