అక్కడ ద్వేషం కరాళనృత్యం చేస్తున్నది… విభజన రాజకీయాలు విచ్చుకత్తులై నెత్తుర్లు పారిస్తున్నాయి….. తెగిపడుతున్న తలలు… మండి బూడిదైపోతున్న ఇళ్ళు… ప్రాణాలు
అక్కడ ద్వేషం కరాళనృత్యం చేస్తున్నది… విభజన రాజకీయాలు విచ్చుకత్తులై నెత్తుర్లు పారిస్తున్నాయి….. తెగిపడుతున్న తలలు… మండి బూడిదైపోతున్న ఇళ్ళు… ప్రాణాలు దక్కించుకోవడాని పారిపోతున్న ప్రజలు…. అక్కడ పట్టణాలు, పల్లెలు స్మశానాలై కాలి బూడిదై కమురు వాసన వేస్తున్నాయి…. స్త్రీని దేవతగా పూజిస్తామని డంబాలు కొట్టే చోట నగ్నపు ఆటబొమ్మను చేసి సామూహిక అత్యాచారాలు, హత్యలు చేస్తున్నారు…… ఇప్పుడు ఎటు చూసినా ఎర్రటి నెత్తిర్లు పారుతున్నాయి….నిన్నటి దాకా అమ్మా, అక్కా, అన్నా , తమ్మీ అనిపిలుచుకున్న వాళ్ళు ఒకరి గొంతులు ఒకరు కోసుకుంటున్నారు. ఇది మణిపూర్ లో ఎవరు పెట్టిన మంట ?
అల్లకల్లోలంగా హింస సాగుతున్న మణిపూర్ లో కొద్ది రోజుల క్రితం జరిగిన దుర్మార్గమైన సంఘటన ఇప్పుడు వెలుగులోకి వచ్చింది. ఆ సంఘటన తాలూకూ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ ఆయ్యింది.
మణిపూర్‌లో కుకీజో జాతికి చెందిన ఇద్దరు యువతులను మైతీలకు చెందిన గుంపు రోడ్డుపై నగ్నంగా ఊరేగించిన భయానక వీడియోలు సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రసారం అవుతున్నాయి. ఆపై వారిద్దరిపై సామూహిక అత్యాచారం చేసి హత్య చేశారు.
మే 4న నగ్నంగా ఊరేగించిన తర్వాత ఇద్దరు మహిళలను వరి పొలంలో సామూహిక అత్యాచారం చేశారని, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదివాసీ గిరిజన నాయకుల ఫోరం (ఐటీఎల్‌ఎఫ్) డిమాండ్ చేసింది. కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రా, టిప్రా మోతా పార్టీ (టిఎంపి) అధినేత ప్రద్యోత్ బిక్రమ్ మాణిక్య దేబ్ బర్మాన్‌తో సహా పలువురు రాజకీయ నాయకులు ఈ ఘటనను తీవ్రంగా ఖండించారు. కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
ఈ సంఘటనపై స్పందిస్తూ, మణిపూర్ పోలీసులు, ఒక ట్వీట్ చేశారు: “ఇద్దరు మహిళలను నగ్నంగా ఊరేగించిన వైరల్ వీడియోకు సంబంధించి దోషులను అరెస్టు చేయడానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నాము. ఇద్దరు మహిళలు నగ్నంగా ఊరేగించిన వైరల్ వీడియోకు సంబంధించి 4 మే 2023న గుర్తుతెలియని సాయుధ దుండగులచే, అపహరణ, సామూహిక అత్యాచారం మరియు హత్య మొదలైన వాటిపై నోంగ్‌పోక్ సెక్మై PS (తౌబల్ జిల్లా)లో గుర్తు తెలియని సాయుధ దుండగులపై కేసు నమోదు చేయబడింది మరియు దర్యాప్తు ప్రారంభించబడింది. నిందితులను వీలైనంత త్వరగా పట్టుకునేందుకు రాష్ట్ర పోలీసులు అన్ని విధాలా ప్రయత్నిస్తున్నారు.
మణిపూర్‌లో జాతి వివాదానికి రెండున్నర నెలలు కావస్తున్నా, కుకీ-జో ఆదివాసీలపై జరిగిన అకృత్యాలకు సంబంధించిన సాక్ష్యాలు బయటపడుతూనే ఉన్నాయని ఐటిఎల్‌ఎఫ్ తీవ్ర పదజాలంతో కూడిన ప్రకటనలో పేర్కొంది.
కుకీలు నివసించే బి. ఫైనోమ్ గ్రామంపై మైతీల గుంపు దాడి చేసి గ్రామాన్ని తగలబెట్టారు.ముగ్గురు యువకులను. ఒక మధ్య వయస్కుడిని దారుణంగా కొట్టి చంపారు. ఆసమయంలో ముగ్గురు యువతులు పారిపోయి పక్కనే ఉన్న అడవిలో తలదాచుకోగా వారిని పోలీసులు రక్షించి పోలీసు స్టేషన్ లో ఉంచగా స్టేషన్ పై దాడి చేసిన మైతీల గుంపు ఆముగ్గురిని కిడ్నాప్ చేసి ఎత్తుకపోయారని సమాచారం. ఆ ముగ్గురు యువతుల్లో ఇద్దరిని నగ్నంగా ఊరేగించి అత్యాచారం చేసి హత్య చేశారు. అయితే మరో యువతి ఆచూకి తెలియడం లేదు. ఆమెను కూడా హత్య చేసి ఉంటారని భావిస్తున్నారు.
మే 4న కాంగ్‌పోక్పి జిల్లాలో జరిగిన ఈ దుర్మార్గమైన దృశ్యంలో పురుషులు నిస్సహాయులైన మహిళలను వేధిస్తున్నారని, మహిళలు తమను బంధించిన వారితో ఏడుస్తూ, వేడుకుంటారని ఐటిఎల్‌ఎఫ్ ప్రతినిధి గింజా వుల్‌జాంగ్ ఒక ప్రకటనలో తెలిపారు.
ఈ మొత్తం సంఘటనను వీడియో తీసి సోషల్ మీడియాలో నిందితులే ప్రచారం చేశారు.
ఈ దుర్మార్గపు చర్యను తీవ్రంగా ఖండిస్తున్నామని, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, జాతీయ మహిళా కమిషన్, షెడ్యూల్డ్ తెగల జాతీయ కమిషన్ ఈ నేరాన్ని గుర్తించి దోషులకు న్యాయం చేసేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని ఐటిఎల్‌ఎఫ్ డిమాండ్ చేసింది.
ఈ ఘటనను తీవ్రంగా ఖండిస్తూ ప్రియాంక గాంధీ వాద్రా ట్వీట్ చేశారు: ”మణిపూర్ లో మహిళలపై లైంగిక హింసకు సంబంధించిన వీడియోలు హృదయాన్ని కదిలించాయి. మహిళలపై జరిగిన ఈ దారుణమైన హింసాకాండను ఖండించిన వారి సంఖ్య తక్కువే. స్త్రీలు, పిల్లలు సమాజంలో హింసను అతి ఎక్కువగా భరించవలసి వస్తోంది. మనమందరం మణిపూర్‌లో శాంతి కోసం ప్రయత్నాలను కొనసాగిస్తూ హింసను ఒకే గొంతుతో ఖండించాలి.
మణిపూర్‌లో హింసాత్మక ఘటనలపై కేంద్ర ప్రభుత్వం, ప్రధాని ఎందుకు కళ్లు మూసుకుని కూర్చున్నారు? అలాంటి చిత్రాలు మరియు హింసాత్మక సంఘటనలు వారిని కలవరపెట్టలేదా?” అని ఆమె ట్వీట్ లో ప్రశ్నించారు.
కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ కూడా ట్వీట్ చేశారు: ”ప్రధానమంత్రి మౌనం, నిష్క్రియాత్మకత మణిపూర్ అరాచకానికి దారితీసింది. మణిపూర్‌లో భారత్ ఆలోచనపై దాడి జరుగుతుంటే భారత్ మౌనం వహించదు. మణిపూర్ ప్రజలకు మేం అండగా ఉంటాం. శాంతి ఒక్కటే ముందున్న మార్గం.” అని ఆయన వ్యాఖ్యానించారు.
TMP చీఫ్ దేబ్ బర్మాన్ తన ట్వీట్ లో: ”మణిపూర్ నుండి ఒక నిర్దిష్ట వర్గానికి చెందిన మహిళలను ఓగుంపు నగ్నంగా ఊరేగించే వీడియోలు కలతపెడుతున్నాయి. అక్కడ రెండు వర్గాల మధ్య సంబంధాలు పూర్తిగా దెబ్బతిన్నాయి. మణిపూర్‌లో ద్వేషం గెలిచింది.” అని అన్నారు.