గౌలిదొడ్డిలోని కేశవ్ నగర్ ప్రభుత్వ పాఠశాలను దత్తత తీసుకొని అక్కడ మౌలిక వసతుల కోసం సొంతగా రూ.40 లక్షలు ఖర్చు చేశారు. ఇవి తాతనో, తండ్రినో అడిగి కాకుండా.. స్నేహితులతో కలిసి ఈవెంట్స్ చేసి సంపాదించినట్లు స్వయంగా హిమాన్షు చెప్పారు.
తెలంగాణ రాజకీయాల్లో కల్వకుంట్ల ఫ్యామిలీకి ఒక ప్రత్యేక పేజీ ఉంటుంది. ప్రస్తుతం దేశంలో బలమైన రాజకీయ కుటుంబాల్లో కేసీఆర్ ఫ్యామిలీ కూడా ఒకటి. ఉద్యమ నాయకుడిగా దేశమంతా పరిచయం అయిన కేసీఆర్.. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన దగ్గర నుంచి సీఎంగా ఉన్నారు. ఇక ఆయన కుటుంబంలోని కేటీఆర్, కవిత, హరీశ్ రావు, సంతోశ్ రావు ఏదో ఒక పదవిలో కొనసాగుతున్నారు. తెలంగాణకు కేటీఆర్ కాబోయే ముఖ్యమంత్రి అని బీఆర్ఎస్ కార్యకర్తలే చెబుతుంటారు. ఒక విధంగా ఆయన ప్రస్తుతం షాడో ముఖ్యమంత్రిగా వ్యవహరిస్తున్నారు. బీఆర్ఎస్ పార్టీకి వర్కింగ్ ప్రెసిడెంట్‌గా… ప్రభుత్వంలో కీలక శాఖలకు మంత్రిగా కేటీఆర్ ఉన్నారు. కవిత ఎమ్మెల్సీగా ఉండగా.. హరీశ్ రావు మంత్రిగా పని చేస్తున్నారు. కేసీఆర్‌ను ఎప్పుడూ వెన్నంటి ఉండే సంతోశ్ రావు ప్రస్తుతం రాజ్యసభ సభ్యుడిగా ఉన్నారు. ఇక ఇప్పుడు కల్వకుంట్ల ఫ్యామిలీలో మూడో తరం కూడా ప్రజల్లోకి వచ్చేసింది.
కేసీఆర్ మనుమడు, కేటీఆర్ తనకుడు హిమాన్షురావు తొలి సారిగా ప్రజల్లోకి వచ్చి, పబ్లిక్ స్పీచ్ ఇచ్చారు. కేసీఆర్ ఫ్యామిలీలో మొదటి నుంచి హిమాన్షు వార్తల్లో ఉంటూ వస్తున్నారు. సచివాలయంలోకి ఫ్రెండ్స్‌తో కలిసి వెళ్లినప్పుడు.. భద్రాచలం రామయ్యకు పట్టు వస్త్రాలు ఇవ్వడానికి వెళ్లిన సమయంలో.. హిమాన్షుపై అనేక విమర్శలు వచ్చాయి. అయినా సరే తాత కేసీఆర్, తండ్రి కేటీఆర్ ఆ రెండు సందర్భాల్లో హిమాన్షును వెనుకేసుకొని వచ్చారు. అంతే కాకుండా అప్పటి నుంచి లైమ్ లైట్‌లో లేకుండా చూసుకున్నారు.
ఇటీవలే ఆక్రిడ్జ్ స్కూల్‌లో చదవు పూర్తి చేసుకున్న హిమాన్షు.. ఉన్నత చదవుల కోసం సిద్ధ పడుతున్నారు. ఈ మధ్య సంగీతంలో కూడా తన టాలెంట్ ద్వారా అందరి మనసులను గెలుచుకున్నారు. తాజాగా సామాజిక సేవలోకి హిమాన్షు అడుగు పెట్టారు. గౌలిదొడ్డిలోని కేశవ్ నగర్ ప్రభుత్వ పాఠశాలను దత్తత తీసుకొని అక్కడ మౌలిక వసతుల కోసం సొంతగా రూ.40 లక్షలు ఖర్చు చేశారు. ఇవి తాతనో, తండ్రినో అడిగి కాకుండా.. స్నేహితులతో కలిసి ఈవెంట్స్ చేసి సంపాదించినట్లు స్వయంగా హిమాన్షు చెప్పారు. అంతే కాకుండా సీఎస్ఆర్ కింద మరి కొంత అమౌంట్‌ను సమకూర్చుకొని.. గౌలిదొడ్డి పాఠశాలలో వసతులు మెరుగుపరిచారు.
బుధవారం దీనికి సంబంధించిన ప్రారంభోత్సవ కార్యక్రమం నిర్వహించారు. మంత్రి సబిత ఇంద్రారెడ్డితో కలిసి హిమాన్షు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. తాను తొలి సారి పబ్లిక్ మీటింగ్‌లో మాట్లాడుతున్నట్లు చెప్పుకొచ్చారు. తండ్రి, తాతలాగానే ఏ మాత్రం తడబడకుండా పూర్తి కాన్ఫిడెంట్‌గా మాట్లాడారు. రాబోయే రోజుల్లో రాజకీయాల్లోకి వచ్చే అవకాశాలు మెండుగా ఉన్నట్లు కనపడుతోంది. ఉన్నత చదవులు పూర్తి చేసుకున్న తర్వాత తప్పకుండా బీఆర్ఎస్‌లో కీలక పాత్ర పోషిస్తాడని సన్నిహితులు చెబుతున్నారు.
కేసీఆర్ తర్వాత వారసుడిగా కేటీఆర్ రాజకీయాల్లో విజయం సాధించారు. వరుసగా ఎమ్మెల్యేగా గెలుస్తూనే.. తనకంటూ ప్రత్యేక ఇమేజీని ఏర్పరచుకున్నారు. ఇప్పుడు హిమాన్షు కూడా తండ్రి బాటలోనే నడుస్తున్నట్లు కనపడుతున్నది. ముందుగా సామాజిక కార్యక్రమాలతో హిమాన్షు తన పయనాన్ని ప్రారంభించినట్లు తెలుస్తున్నది. చదువులో ర్యాంకులు తగ్గినా.. వంద మందికి సాయం చేయడంలో మాత్రం ముందు ఉండాలని తండ్రి కేటీఆర్ చెప్పిన మాటలను గుర్తుంచుకుంటానని హిమాన్షు చెప్పారు. ప్రస్తుతానికి కేసీఆర్ కుటుంబానికి మూడో తరం సేవలు అవసరం లేదు. కానీ రాబోయే రోజుల్లో హిమాన్షు ఆ కుటుంబ రాజకీయ వారసత్వాన్ని అందుకుంటాడనటంలో ఎలాంటి అతిశయోక్తి, అనుమానాలు లేవు.