HomeTelanganaPolitics

ఖేలో ఇండియా గేమ్స్ కు వేదికగా హైదరాబాద్

ఖేలో ఇండియా గేమ్స్ కు వేదికగా హైదరాబాద్

ఖేలో ఇండియా గేమ్స్ కు వేదికగా హైదరాబాద్ 2026లో నిర్వహించేందుకు కేంద్ర ప్రభుత్వం సుముఖం తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి విజ్ఞప్తి మేరకు ఖేలో ఇ

కాంగ్రెస్ పార్టీలో మా కోవర్టులున్నారు… బాల్కసుమన్ సంచలన వ్యాఖ్యలు
తెలంగాణ, ఏపీల్లో 62 మంది ప్రజా సంఘాల నేతల ఇళ్ళపై ఎన్ ఐ ఏ దాడులు… మండిపడ్డ వివిధ సంఘాలు
షాకింగ్ సర్వే బాంబు పేల్చిన రేవంత్ రెడ్డి… కేసీఆర్ కూడా ఓడిపోతున్నారా ?

ఖేలో ఇండియా గేమ్స్ కు వేదికగా హైదరాబాద్

2026లో నిర్వహించేందుకు కేంద్ర ప్రభుత్వం సుముఖం

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి విజ్ఞప్తి మేరకు ఖేలో ఇండియా – 2026 పోటీలను హైదరాబాద్‌లో నిర్వహించేందుకు కేంద్ర ప్రభుత్వం సానుకూలంగా సానుకూలంగా స్పందించింది. వచ్చే ఏడాది నిర్వహించేలా ముఖ్యమంత్రి విజ్ఞప్తి చేసినా 2025లో బిహార్‌లో నిర్వహించేలా ఇప్పటికే నిర్ణయం జరగడంతో 2026లో హైదరాబాద్‌లో నిర్వహించేందుకు కేంద్ర క్రీడల శాఖ మంత్రి మన్‌సుఖ్ సింగ్ మాండవీయ సానుకూలంగా స్పందించి సూత్రప్రాయంగా నిర్ణయం తీసుకున్నట్లు రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి జితేందర్‌రెడ్డికి హామీ ఇచ్చారు. రాతపూర్వక విజ్ఞప్తిని జితేందర్‌రెడ్డి గురువారం (నవంబరు 28) కేంద్ర మంత్రికి అందజేసి వివరించగా పై స్పష్టత లభించింది.

హైదరాబాద్ నగరంలో 32వ జాతీయ క్రీడలు (2002లో), ఆఫ్రో ఆషియన్ గేమ్స్, 7వ మిలిటరీ గేమ్స్ సహా అనేక జాతీయ స్థాయి పోటీలు జరిగాయని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆ లేఖలో ప్రస్తావించారు. క్రీడా రంగానికి గత పదేండ్ల పాలనతో పోలిస్తే ప్రస్తుత ప్రభుత్వం ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నదని, జాతీయ స్థాయి పోటీలను నిర్వహించడానికి అవసరమైన అన్ని రకాల సౌకర్యాలు ఉన్నాయని ఆ లేఖలో సీఎం రేవంత్‌రెడ్డి గుర్తుచేశారు.

గచ్చిబౌలిలోని స్పోర్ట్స్ కాంప్లెక్సుల అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన ఇండోర్ స్టేడియం, స్విమ్మింగ్ పూల్, సింథటిక్ అథ్లెటిక్ ట్రాక్, హాకీ టర్ఫ్, షూటింగ్ రేంజ్, సరూర్‌నగర్‌లో మల్టీపర్పస్ ఇండోర్ స్టేడియం (ఎయిర్ కండిషన్డ్), సింథటిక్ టెన్నిస్ కోర్ట్, స్కేటింగ్ ట్రాక్, ఔట్ డోర్ స్టేడియం, ఎల్బీ స్టేడియంలో ఇండోర్ స్టేడియంతో పాటు టెన్నక్ కాంప్లెక్స్, ఫుట్ బాల్ గ్రౌండ్, కేవీబీఆర్ ఇండోర్ స్టేడియం, హుస్సేన్ సాగర్‌లో వాటర్ స్పోర్ట్స్ నిర్వహించే సౌకర్యం, ఉస్మానియా క్యాంపస్‌లో సైక్లింగ్ వెల్‌డ్రోమ్, సింథటిక్ అథ్లెటిక్ ట్రాక్, స్విమ్మింగ్ పూల్, స్కేటింగ్ ట్రాక్, జింఖానా-2 గ్రౌండ్‌లో ఫుట్ బాల్ గ్రౌండ్‌తో పాటు ఔట్ డోర్ గేమ్స్ నిర్వహించే వసతులు ఉన్నాయని ఆ లేఖలో సీఎం రేవంత్ గుర్తుచేశారు.

క్రీడాభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం తగిన ప్రాధాన్యత ఇస్తూ ప్రతి ఏటా ఖేలో ఇండియా యూత్ గేమ్స్, వింటర్ గేమ్స్, పారా గేమ్స్, యూనివర్శిటీ గేమ్స్ తదితరాలను 2018 నుంచి క్రమం తప్పకుండా నిర్వహిస్తున్నదని సీఎం రేవంత్ గుర్తుచేశారు. గతేడాదితో పోలిస్తే ఈసారి బడ్జెట్‌లో రాష్ట్ర ప్రభుత్వం పది రెట్ల మేర క్రీడల కోసం కేటాయింపులను పెంచినట్లు సీఎం రేవంత్ గుర్తుచేశారు. కేవలం క్రీడల నిర్వహణకు అవసరమైన మౌలిక సదుపాయాలు మాత్రమే కాకుండా క్రీడాకారులు చేరుకునేలా రైలు, విమాన సౌకర్యాలు కూడా ఉన్నాయని, పేరెన్నికగన్న స్టార్ హోటళ్ళు, ఇతర వసతి సౌకర్యాలు కూడా ఉన్నాయని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం క్రీడలకు ప్రాధాన్యత ఇవ్వడం మాత్రమే కాకుండా యువతను ప్రోత్సహించేలా ప్రత్యేక పాలసీని కూడా రూపొందిస్తున్నదని, ఆ శాఖను స్వయంగా ముఖ్యమంత్రే నిర్వహిస్తున్నట్లు కూడా ఆ లేఖలో పేర్కొన్నారు.

ముఖ్యమంత్రి రేవంత్ విజ్ఞప్తిని కేంద్ర మంత్రికి వివరించిన రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి జితేందర్ రెడ్డి…. అంతర్జాతీయ స్థాయిలో మన దేశానికి క్రీడారంగంలో గుర్తింపు, పేరు ప్రఖ్యాతులు వచ్చేలా రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు కలిసి పనిచేయాల్సిన అవసరాన్ని వివరించారు. క్రీడాకారులను ప్రోత్సహిస్తున్నందుకు కేంద్ర మంత్రికి కృతజ్ఞతలు తెలిపారు. తెలంగాణ ఒక రాష్ట్రంగా ఏర్పడిన తర్వాత ఆర్థికంగా మాత్రమే కాక అనేక రంగాల్లో ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ప్రత్యేక గుర్తింపు సాధించిందని, ఇకపైన క్రీడా పోటీల నిర్వహణతో పాటు భవిష్యత్తులో ఉత్తమ క్రీడాకారులను తీర్చిదిద్దేందుకు రాష్ట్ర ప్రభుత్వం స్పష్టమైన అవగాహనతో ఉన్నదని జితేందర్ రెడ్డి గుర్తుచేశారు.

కేంద్ర మంత్రితో జరిగిన ఈ సమావేశంలో జితేందర్ రెడ్డితో పాటు ఎంపీలు డాక్టర్ మల్లు రవి, అనిల్ కుమార్ యాదవ్, చామల కిరణ్ కుమార్ రెడ్డి, రామసహాయం రఘురామ్‌రెడ్డి తదితరులు కూడా పాల్గొన్నారు.