''కాంగ్రెస్ పార్టీ వాళ్ళను మనవాళ్ళు ఏమీ అనొద్దు…. వాళ్ళు మనోళ్ళే…మనమే వాళ్ళ్ను ఆ పార్టీలోకి పంపాం…గెలిచాక వాళ్ళు మన పార్టీలో చేరుతారు…'' అని బీఆరెస్
”కాంగ్రెస్ పార్టీ వాళ్ళను మనవాళ్ళు ఏమీ అనొద్దు…. వాళ్ళు మనోళ్ళే…మనమే వాళ్ళ్ను ఆ పార్టీలోకి పంపాం…గెలిచాక వాళ్ళు మన పార్టీలో చేరుతారు…” అని బీఆరెస్ నాయకుడు, చెన్నూరు ఎమ్మెల్యే బాల్కసుమన్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీయే తమకు ప్రధాన ప్రత్యర్హిగా భావిస్తోన్న అధికార బీఆరెస్ ఆ పార్టీని అన్ని రకాలుగా దెబ్బతీయడానికి ప్రయత్నిస్తోంది. ఒకవైపు అగ్రనేతలు కేసీఆర్, కేటీఆర్ లు కాంగ్రెస్ పార్టీపై విరుచుకపడుతుండగా బాల్క సుమన్ మాత్రం కాంగ్రెస్ నాయకులను ఏమనొద్దని, వాళ్ళు తమవాళ్ళేనని తన కార్యకర్తలకు సూచించడం ఆ పార్టీ వ్యూహాన్ని సూచిస్తోంది.
గత ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి గెలిచిన అనేక మంది ఎమ్మెల్యేలు బీఆరెస్ లో చేరడంతో సుమన్ మాటలకు విలువ ఏర్పడింది.
అసలు బాల్కసుమన్ ఎక్కడ ఈ విధంగా మాట్లాడారంటే… పార్టీ అధిష్ఠానం తనకు చెన్నూరు టికెట్ కేటాయించిన నేపథ్యంలో నియోజకవర్గంలో ఏర్పాటు చేసిన ర్యాలీలో ఆయన మాట్లాడుతూ,కాంగ్రెస్ పార్టీ(congress party) అభ్యర్థులను ఏమి అనొద్దని కార్యకర్తలు, ప్రజలకు సూచించారు. వాళ్ళు కూడా మనోళ్ళే, వారిని మనమే అటువైపు పంపాం. గెలిచాక వాళ్ళు మనపార్టీలోకే వస్తారు. గత ఎన్నికల్లో నాపై పోటీ చేసిన పెద్దపల్లి ఎంపీ వెంకటేశ్ బీఆర్ఎస్‌లోకి వచ్చారనే విషయాన్ని మర్చిపోవద్దు.” అని ఆయన అన్నారు.
సుమన్ మాటలను ఎలా ఎదుర్కోవాలో తెలియక కాంగ్రెస్ నాయకులు మల్లగుల్లాలు పడుతుండగా, బీజేపీకి మాత్రం బాలమైన ఆయుధం లభించినట్టైంది. బీఆరెస్, కాంగ్రెస్ రెండూ ఒకటేనని తాము ఎప్పటినుంచో చెప్తున్నామని , బాల్క సుమన్ మాటలతో అది రుజువయ్యిందని బీజేపీ నేతలు అంటున్నారు. దాదాపు 30 మంది కాంగ్రెస్ అభ్యర్థులకు ఎన్నికల ఖర్చులు కేసీఆరె ఇస్తున్నారని వారు గెలవగానే బీఆరెస్ లోకి వస్తారని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ అన్నారు.