HomeTelangana

ఖమ్మంలో బీఆర్ఎస్‌కు వరుస ఝలక్‌లు.. పార్టీ తరపున టికెట్ నిరాకరించిన గుమ్మడి నర్సయ్య కుమార్తె!

ఖమ్మంలో బీఆర్ఎస్‌కు వరుస ఝలక్‌లు.. పార్టీ తరపున టికెట్ నిరాకరించిన గుమ్మడి నర్సయ్య కుమార్తె!

అధికార బీఆర్ఎస్ పార్టీనే టికెట్ ఆఫర్ చేస్తే తప్పకుండా గుమ్మడి నర్సయ్య కుటుంబం వెంటనే ఒప్పుకుంటుందని అంచనా వేసుకున్నారు. కానీ బీఆర్ఎస్ పార్టీ అంచనాలు ఇప్పుడు తలక్రిందులయ్యాయి.

వచ్చే అసె‍ంబ్లీ ఎన్నికల్లో BRS అభ్యర్థులు: KCR ఫైనల్ చేసిన లిస్ట్ ఇదేనా?
BRSకు షాక్… GHMC మాజీ మేయర్ బొంతు రామ్మోహన్ కాంగ్రెస్ లోకి ?
ఎమ్మెల్యే సీతక్కను సెక్రటేరియట్ లోకి వెళ్ళకుండా అడ్డుకున్న పోలీసులు

బీఆర్ఎస్ పార్టీకి, సీఎం కేసీఆర్‌కు మొదటి నుంచి ఉమ్మడి ఖమ్మం జిల్లా కొరకరాని కొయ్యగానే ఉన్నది. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కమ్మూనిస్టుల ప్రాబల్యం చాలా ఎక్కువ. ఇక కాంగ్రెస్, టీడీపికి కూడా క్షేత్ర స్థాయిలో బలమైన ఓటు బ్యాంకు ఉన్నది. దీంతో 2014, 2018 అసెంబ్లీ ఎన్నికల్లో ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఉన్న మొత్తం 10 అసెంబ్లీ స్థానాలకు గాను గెలచుకున్నది ఒకటి మాత్రమే. 2014లో కొత్తగూడెం నుంచి టీఆర్ఎస్ అభ్యర్థి జలగం వెంకట్రావ్ గెలవగా.. 2018లో ఖమ్మం నుంచి మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ గెలుపొందారు. 2016లో జరిగిన పాలేరు ఉపఎన్నికలో తుమ్మల నాగేశ్వరారావు గెలిచినా.. 2018లో కాంగ్రెస్ అభ్యర్థి కందాల ఉపేందర్ రెడ్డిపై ఓడిపోయారు.

ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని కొన్ని నియోజకవర్గాల్లో ప్రభావం చూపించే సత్తా ఉన్న మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ సారి ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఒక్క బీఆర్ఎస్ అభ్యర్థి కూడా గెలవకుండా చేస్తానని పొంగులేటి ఛాలెంజ్ విసిరారు. దీంతో అప్రమత్తమైన బీఆర్ఎస్ అధిష్టానం, మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ సరికొత్త వ్యూహాలకు తెరతీస్తున్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పలు చోట్ల కొత్త అభ్యర్థులను బరిలోకి దింపడం ద్వారా లబ్ది పొందాలని బీఆర్ఎస్ భావిస్తోంది.

ఈ క్రమంలో మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ఇటీవల సీపీఐ ఎంఎల్ పార్టీ మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య వద్దకు రాయబారం పంపినట్లు తెలుస్తున్నది. గుమ్మడి నర్సయ్య కూతురు ప్రొఫెసర్ అనురాధను బీఆర్ఎస్ తరపున ఇల్లెందు నుంచి పోటీ చేయించాలని కోరారు. ఈ ప్రతిపాదనకు గుమ్మడి సమ్మతించలేదని.. రాబోయే ఎన్నికల్లో తానే స్వయంగా ఎంఎల్ పార్టీ నుంచి పోటీ చేస్తున్నానని.. బీఆర్ఎస్‌ను మద్దతు ఇవ్వాలని కోరినట్లు తెలుస్తోంది. దీంతో ఖంగుతిన్ని బీఆర్ఎస్ నాయకులు, మంత్రి పువ్వాడ విషయాన్ని అధిష్టానానికి చేరవేసినట్లు సమాచారం.

సిట్టింగ్ ఎమ్మెల్యే హరిప్రియపై ఇల్లెందు నియోజకవర్గంలో తీవ్రమైన వ్యతిరేకత ఉన్నట్లు పలు సర్వేల్లో తేలింది. కాంగ్రెస్ టికెట్‌పైన గెలిచిన హరిప్రియ.. తర్వాత బీఆర్ఎస్‌లోకి జంప్ అయ్యారు. ఆమెకు ఈ సారి గులాబీ క్యాంప్ నుంచి టికెట్ లభించే అవకాశాలు లేనట్లు తెలుస్తున్నది. ఇక కాంగ్రెస్ నుంచి కోరం కనకయ్యకు టికెట్ దక్కే అవకాశం ఉంది. అక్కడ బలమైన అభ్యర్థి అంటే గుమ్మడి నర్సయ్యే. అయితే ఆయన పార్టీ మారే ప్రసక్తే ఉండదు. అందుకే నర్సయ్య కూతురు అనురాధను బరిలోకి దింపాలని బీఆర్ఎస్ ప్రయత్నించింది. కానీ, ఆ ప్రతిపాదనను నర్సయ్య మొదట్లోనే తిరస్కరించడంతో బీఆర్ఎస్‌కు ఝలక్ తగిలినట్లు అయ్యింది.

అధికార బీఆర్ఎస్ పార్టీనే టికెట్ ఆఫర్ చేస్తే తప్పకుండా గుమ్మడి నర్సయ్య కుటుంబం వెంటనే ఒప్పుకుంటుందని అంచనా వేసుకున్నారు. కానీ బీఆర్ఎస్ పార్టీ అంచనాలు ఇప్పుడు తలక్రిందులయ్యాయి. దీంతో ప్రత్యామ్నాయ మార్గాలను ఖమ్మం పార్టీ నాయకుల అన్వేషిస్తున్నారు. మరోవైపు బలమైన అభ్యర్థులను వెదికే పనిలో కూడా ఉన్నది. ఒక వేళ కమ్యూనిస్టులతో బీఆర్ఎస్ పొత్తు పెట్టుకుంటే మాత్రం.. ఇల్లెందులో ఎంఎల్ పార్టీకి మద్దతు ఇచ్చే అవకాశం కూడా ఉన్నట్లు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతున్నది.