HomeTelanganaPolitics

ప్రియాంకా గాంధీ తెలంగాణకు వచ్చే రోజే ఆ ముగ్గురు కాంగ్రెస్ కీలక నేతలు బీఆరెస్ లో చేరనున్నారా ?

ప్రియాంకా గాంధీ తెలంగాణకు వచ్చే రోజే ఆ ముగ్గురు కాంగ్రెస్ కీలక నేతలు బీఆరెస్ లో చేరనున్నారా ?

తెలంగాణ‌ పాలక భారత రాష్ట్ర సమితి (BRS) కాంగ్రెస్ జోరును తగ్గించాలని చూస్తోంది. కాంగ్రెస్ కీలక‌ నాయకులను కొందరిని జూలై 30న ప్రియాంక గాంధీ బహిరంగ సభ జర

వెంటనే పార్లమెంటు ఎన్నికలు జరిగితే తెలంగాణలో BRS, ఏపీలో YSRCP స్వీప్..టైమ్స్ నౌ సర్వే
గంగారెడ్డి హత్యతో నాకు సంబంధం లేదు -BRS ఎమ్మెల్యే సంజయ్
‘అరే హౌలే..ఎవడ్రా వాడు….’ ప్రజలపై కేసీఆర్ అసహనం

తెలంగాణ‌ పాలక భారత రాష్ట్ర సమితి (BRS) కాంగ్రెస్ జోరును తగ్గించాలని చూస్తోంది. కాంగ్రెస్ కీలక‌ నాయకులను కొందరిని జూలై 30న ప్రియాంక గాంధీ బహిరంగ సభ జరిగే రోజునే బీఆరెస్ లో చేర్చుకోవాలని చూస్తోంది.

నల్గొండ లోక్‌సభ ఎంపీ, తెలంగాణ కాంగ్రెస్ ప్రదేశ్ కమిటీ (టీపీసీసీ) మాజీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి, మాజీ ఉపముఖ్యమంత్రి (ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం) దామోదర్ రాజనరసింహ, మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్… ఈ ముగ్గురూ బీఆరెస్ టచ్ లో ఉన్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. పీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డితో ఉన్న విభేదాలే వీరిని బీఆరెస్ వైపు చూసేలా చేస్తున్నాయనే వాదనలు వినిపిస్తున్నాయి.

ఈ విధమైన పుకార్లు హల్ చల్ చేస్తున్నప్పటికీ, ఉత్తమ్ వంటి నేతలు కాంగ్రెస్‌ను వీడే అవకాశం లేదని కాంగ్రెస్‌కు చెందిన ఒక అగ్రశ్రేణి నాయకుడు అన్నారు. అయితే, ప్రస్తుత నాయకులు ప్రజల‌ వ్యతిరేకతను ఎదుర్కొంటున్న జిల్లాల్లో నాయకత్వ లోపాలను భర్తీ చేయడానికి కాంగ్రెస్ నుండి నాయకులను తీసుకోవడం చాలా కీలకమని BRS నాయకులు అంటున్నారు. సరైన సమయంలో ఆ కీలక నేతలను తీసుకువస్తామని వారు పేర్కొన్నారు.

కొల్లాపూర్‌లో జరగనున్న ప్రియాంక గాంధీ సమావేశం కాంగ్రెస్ కు ముఖ్యమైనది, ఎందుకంటే ఆమె ‘మహిళల డిక్లరేషన్’ని ఆవిష్కరించి, ఆ రోజు కొన్ని ప్రధాన ప్రకటనలు చేసే అవకాశం ఉంది. అదే రోజు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ నుండి కొందరు ముఖ్యమైన నాయకులు తమ పార్టీలో చేరడం ఖాయం అని BRS ముఖ్య నాయకుడు ఓ వెబ్ సైట్ ప్రతినిధితో చెప్పారు.

“కాంగ్రెస్‌కు పట్టు పెరుగుతోందని, ఎన్నికల్లో విజయం సాధిస్తుందనే అభిప్రాయం ఉంది. కానీ అది కేవలం నీటి బుడగ మాత్రమే, ఈ రకమైన చర్చ త్వరలో ముగియాలని మేము కోరుకుంటున్నాము, ”అని BRS నాయకుడు అన్నారు. BRS తమ‌ నాయకులకు అనేక ఆశలను చూపిస్తోందని కాంగ్రెస్ నాయకులు చెప్తున్నారు. “అయినా, ఉత్తమ్ స్థాయి నాయకులు కాంగ్రెస్ ను వదిలి వెళ్తారన్నది అర్ధం లేనిది. BRS లోని అగ్ర స్థానాలు ఆ ముగ్గురికే ఉంటాయి. ఆ పార్టీలోకి ఫిరాయించిన కాంగ్రెస్ నేతలు ఎలాంటి పాత్ర పోషిస్తారు? బీఆర్‌ఎస్ గెలిస్తే చాలా మంది లాగానే వారు కూడా మంత్రి కావచ్చు. అంతే.” అని ఓ కాంగ్రెస్ నాయకుడు అన్నారు.

ఇటీవల బీఆర్‌ఎస్‌ నుంచి కొందరు నేతలు కాంగ్రెస్ లోకి వెళ్ళడం రాజకీయ హల్ చల్ కు కారణమైంది. బీఆర్‌ఎస్‌కు చెందిన మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, జూపల్లి కృష్ణారావు, తీగల కృష్ణారెడ్డి కాంగ్రెస్ వైపు వెళ్లారు. శ్రీనివాస్ రెడ్డి ఈ నెల మొదట్లో అధికారికంగా పార్టీలో చేరగా, ప్రియాంక గాంధీ సమక్షంలో జూపల్లి చేర‌నున్నారు.

ఉత్తమ్ కుమార్ BRSలో చేరే అవకాశం ఉందా అని బీఆరెస్ కు చెందిన కీలక నేతను ప్రముఖ మీడియా సంస్థ ప్రతినిధి అడిగినప్పుడు

‘‘ఎన్నికల్లో గెలుపే మాకు ముఖ్యం. కర్ణాటకలో గెలిచినందున ఇక్కడ కూడా గెలవ వచ్చని కాంగ్రెస్ భావిస్తోంది. మా ఎమ్మెల్యేల్లో కొందరు ప్రజా వ్యతిరేకతను ఎదుర్కొంటున్న మాట వాస్తవమే. అయితే కాంగ్రెస్ నుండి కొంతమంది కీలక నాయకులు మా పార్టీలో చేరబోతున్నారు. జూలై 30న మేము ఆ విషయాన్ని ప్రకటిస్తాము. అందరూ ఇప్పుడే చేరడం లేదు, ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ జోరును దెబ్బతీసేందుకు కొంతమందిని తరువాత చేర్చుకుంటాము ” అన్నారు.

కాంగ్రెస్ పార్టీ నుండి కీలక నేతలు BRS లో చేరిన తర్వాత, ఇతరులతో కూడా చర్చలు ప్రారంభమవుతాయని ఆయన అన్నారు. తెలంగాణలో దాదాపు నవంబర్‌లో అసెంబ్లీ ఎన్నికలు జరిగే అవకాశం ఉంది. మునుపటి 2018 రాష్ట్ర ఎన్నికలలో, BRS 119 సీట్లలో 88 గెలుచుకుని భారీ మెజారిటీని సాధించింది. చిరకాల శత్రువైన తెలుగుదేశం పార్టీ (టీడీపీ)తో పాటు ఇతరుల‌తో పొత్తు పెట్టుకున్న కాంగ్రెస్ కేవలం 19 సీట్లు మాత్రమే గెలుచుకుంది. నెలరోజుల్లోనే 12 మంది ఎమ్మెల్యేలు బీఆర్‌ఎస్‌కు ఫిరాయించారు.

కాగా, బీఆరెస్ యాదాద్రి భువనగిరి జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు అనిల్‌కుమార్‌రెడ్డి ఈ మధ్య బీఆరెస్ లో చేరడం కాంగ్రెస్ కు ఊహించని షాక్ ఇచ్చింది. మరో వైపు రెడ్డి సామాజిక వర్గాన్ని దగ్గర చేసుకోవడానికి బీఆరెస్ చేస్తున్న ప్రయత్నాలను బహిర్గతం చేసింది.

సిట్టింగ్ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డితో విభేదాల కారణంగా అనిల్ కుమార్ కాంగ్రెస్ నుండి నిష్క్రమించారు. దాంతో జిల్లాలో కాంగ్రెస్‌కు బలమైన ముఖం లేకుండా పోయింది.

కాంగ్రెస్ పార్టీ నుంచి బలమైన రెడ్డి నాయకత్వాన్ని తనవైపుకు తీసుకురావాలని కేసీఆర్ చూస్తున్నారని రాజకీయ విశ్లేషకులు పాల్వాయి రాఘవేంద్రరెడ్డి ఓ మీడియా సంస్థతో అన్నారు.

అనిల్‌కుమార్‌ రెడ్డి పార్టీని వీడడం వల్ల ఎలాంటి ప్రభావం ఉండదని కాంగ్రెస్‌ అధికార ప్రతినిధి సయ్యద్‌ నిజాముద్దీన్‌ స్పష్టం చేశారు. “నాయకులు వెళ్తున్నారు, మా కేడర్ కాదు. పైగా కేసీఆర్‌కు డబ్బు ఎక్కువైందని, ఒక్కో ఎమ్మెల్యేకు లేదా ఒక్కో సీటుకు రూ.50 కోట్లు ఖర్చు చేస్తున్నారని మండిపడ్డారు.

మొత్తానికి అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా ఎక్కువ రోజులు లేని నేపథ్యంలో పార్టీలు మారే నేతలు పెరుగుతున్నారు. తమకు టికట్ రాదని, లేదని ప్రాధాన్యత లేదని భావించిన వాళ్ళు ఆయా పార్టీల నుంచి మరో పార్టీలోకి మారుతున్నారు. అయితే కాంగ్రెస్ లోనే పుట్టి , ఆ పార్టీలోనే పెరిగి, అక్కడే అనేక పదవులు అనుభవించిన ఉత్తమ్ కుమార్ రెడ్డి, దామోదర్ రాజనరసింహ, పొన్నం ప్రభాకర్ లు కాంగ్రెస్ పార్టీని వీడి బీఆరెస్ లో చేరతారా అనేదే ప్రస్తుతం తెలంగాణలో చర్చనీయాంశమైన ప్రశ్న.

తాజా సమాచారం: తెలంగాణలో పడుతున్న భారీ వర్షాల కారణంగా జూలై 30న కొల్హాపూర్ లో జరగాల్సిన ప్రియాంకా గాంధీ సభను వాయిదా వేసే ఆలోచనలో కాంగ్రెస్ ఉంది.