HomeTelanganaPolitics

దక్షిణాది రాష్ట్రాల‌పై కేంద్ర ప్ర‌భుత్వ‌ కుట్ర‌ను తిప్పికొడ‌తాం:ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి

దక్షిణాది రాష్ట్రాల‌పై కేంద్ర ప్ర‌భుత్వ‌ కుట్ర‌ను తిప్పికొడ‌తాం:ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి

దక్షిణాది రాష్ట్రాల‌పై కేంద్ర ప్ర‌భుత్వ‌ కుట్ర‌ను తిప్పికొడ‌తాం నియోజ‌క‌వ‌ర్గాల పున‌ర్విభ‌జ‌న కాదు ద‌క్షిణాది ప్రాధాన్య‌త‌ను కుదించే ప్ర‌య‌త్నం…

I.N.D.I.A కూట‌మి కీలక నిర్ణయాలు
స్పీకర్ పదవికి వన్నెతెచ్చిన శ్రీపాదరావు… మంత్రి శ్రీధర్ బాబు
మూడవ జాబితా విడుదల చేసిన కాంగ్రెస్, రెండు చోట్ల నుంచి రేవంత్ పోటీ

దక్షిణాది రాష్ట్రాల‌పై కేంద్ర ప్ర‌భుత్వ‌ కుట్ర‌ను తిప్పికొడ‌తాం

  • నియోజ‌క‌వ‌ర్గాల పున‌ర్విభ‌జ‌న కాదు ద‌క్షిణాది ప్రాధాన్య‌త‌ను కుదించే ప్ర‌య‌త్నం…
  • ద‌క్షిణాది రాష్ట్రాల‌పై ప్ర‌తీకారం తీర్చుకుంటున్న బీజేపీ
  • ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి
  • నియోజ‌క‌వ‌ర్గాల పున‌ర్విభ‌జ‌న‌పై చ‌ర్చ‌కు రావాల‌ని ముఖ్య‌మంత్రికి త‌మిళ‌నాడు సీఎం స్టాలిన్ ఆహ్వానం
  • సీఎంను క‌లిసి ఆహ్వానించిన డీఎంకే ప్ర‌తినిధి బృందం..

ఢిల్లీ: నియోజ‌క‌వ‌ర్గాల పున‌ర్విభ‌జ‌నతో ద‌క్షిణాది రాష్ట్రాల‌పై కేంద్ర ప్ర‌భుత్వం చేస్తున్న కుట్ర‌ను తిప్పికొట్టే కార్యాచ‌ర‌ణ చేప‌డ‌తామ‌ని ముఖ్య‌మంత్రి ఏ.రేవంత్ రెడ్డి స్ప‌ష్టం చేశారు. అది నియోజ‌క‌వ‌ర్గాల పున‌ర్విభ‌జ‌న కాద‌ని ద‌క్షిణాది రాష్ట్రాల ప్రాధాన్య‌త‌ను కుదించే ప్ర‌య‌త్నమ‌ని సీఎం అన్నారు. నియోజ‌క‌వ‌ర్గాల పున‌ర్విభ‌జ‌న‌తో ద‌క్షిణాది రాష్ట్రాల‌కు క‌లిగే న‌ష్టాలు.. చేప‌ట్టాల్సిన కార్యాచ‌ర‌ణ‌పై చ‌ర్చించేందుకు చెన్నైలో ఈ నెల 22న జ‌రిగే సమావేశానికి హాజ‌రుకావాలంటూ గౌర‌వ ముఖ్య‌మంత్రి ఏ.రేవంత్ రెడ్డిని త‌మిళ‌నాడు గౌర‌వ ముఖ్య‌మంత్రి స్టాలిన్ ఆహ్వానించారు. ఈ మేర‌కు త‌మిళ‌నాడు సీఎం రాసిన లేఖ‌ను ఆ రాష్ట్ర పుర‌పాల‌క శాఖ మంత్రి కె.ఎన్‌.నెహ్రూ ఆధ్వ‌ర్యంలోని డీఎంకే ప్ర‌తినిధి బృందం ఢిల్లీలో గౌర‌వ ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డికి గురువారం అంద‌జేసింది. 2026 త‌ర్వాత చేప‌ట్టే జ‌న గ‌ణ‌న వ‌ర‌కు నియోజ‌క‌వ‌ర్గాల పున‌ర్విభ‌జ‌న చేప‌ట్ట‌కూడ‌ద‌ని నిబంధ‌న‌లున్నా కేంద్ర ప్ర‌భుత్వం మాత్రం అంత‌కుముందు గానే ఈ ప్ర‌క్రియ‌ను తెర‌పైకి తెచ్చింద‌ని త‌మిళ‌నాడు సీఎం స్టాలిన్ త‌న లేఖ‌లో పేర్కొన్నారు. నియోజ‌క‌వ‌ర్గాల పున‌ర్విభ‌జ‌న‌పై త‌మ రాష్ట్రంలో ఇప్ప‌టికే అఖిల‌ప‌క్ష స‌మావేశం ఏర్పాటు చేశామ‌ని లేఖ‌లో వెల్ల‌డించారు. ఈ విష‌యంలో త‌మిళ‌నాడు, కేర‌ళ‌, ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, తెలంగాణ‌, క‌ర్ణాట‌క‌, ప‌శ్చిమ బెంగాల్‌, ఒడిశా, పంజాబ్ రాష్ట్రాల‌తో కూడిన ఐక్య కార్యాచ‌ర‌ణ క‌మిటీలో (జేఏపీ) చేరేందుకు అంగీకారం తెల‌పాల‌ని
స్టాలిన్ లేఖ‌లో కోరారు. భ‌విష్య‌త్ కార్యాచ‌ర‌ణ చేప‌ట్టేందుకు జేఏసీలోకి తెలంగాణ కాంగ్రెస్ పార్టీ త‌ర‌ఫున ఒక ప్ర‌తినిధిని నియ‌మించాల‌ని లేఖ‌లో సూచించారు. గౌర‌వ ముఖ్య‌మంత్రిని క‌లిసిన డీఎంకే ప్ర‌తినిధి బృందంలో ప్ర‌త్యేక ప్ర‌తినిధి ఏకేఎస్ విజ‌య‌న్‌, డీఎంకే పార్ల‌మెంట‌రీ పార్టీ నేత క‌నిమొళి, డీఎంకే ఎంపీలు ఏ.రాజా, ఎన్‌.ఆర్‌. ఇళంగో, క‌ళానిధి వీర‌స్వామి, అరుణ్ నెహ్రూ ఉన్నారు. డీఎంకే ప్ర‌తినిధుల బృందం క‌లిసిన త‌ర్వాత ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి విలేక‌రుల‌తో మాట్లాడారు. ద‌క్షిణాది రాష్ట్రాల ప్రాధాన్య‌త‌ను త‌గ్గించే ప్ర‌య‌త్నాన్ని ఏర‌కంగానూ తాము స‌హించ‌బోమ‌ని గౌర‌వ ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి హెచ్చ‌రించారు. మేం (ద‌క్షిణాది రాష్ట్రాలు) దేశానికి ఎంతో సేవ చేశామ‌ని సీఎం తెలిపారు. ద‌క్షిణాది రాష్ట్రాల నుంచి బీజేపీకి పెద్ద‌గా ప్రాతినిధ్యం లేద‌ని… ద‌క్షిణాది రాష్ట్రాల్లో ఓట‌మితో ఈ రాష్ట్రాల‌పై ప్ర‌తీకారం తీర్చుకోవాల‌ని బీజేపీ భావిస్తోంద‌ని సీఎం అన్నారు. ద‌క్షిణాది రాష్ట్రాల‌పై బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్ర‌భుత్వం చేస్తున్న కుట్ర‌ల‌ను అడ్డుకుంటామ‌ని గౌర‌వ ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. కేంద్ర ప్ర‌భుత్వ కుట్ర‌ల‌ను ఎదుర్కోవాల‌ని కాంగ్రెస్ పార్టీ సూత్ర‌ప్రాయంగా ఇప్ప‌టికే నిర్ణ‌యించింద‌ని సీఎం వెల్ల‌డించారు. కాంగ్రెస్ పార్టీ అధిష్టానం అనుమ‌తి తీసుకొని తాను చెన్నై స‌మావేశానికి హాజ‌ర‌వుతాన‌ని గౌర‌వ ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. నియోజ‌క‌వ‌ర్గాల పున‌ర్విభ‌జ‌న‌పై తెలంగాణ రాష్ట్రంలోనూ చ‌ర్చ‌లు జ‌రిపేందుకు అఖిల‌ప‌క్ష స‌మావేశం ఏర్పాటు చేయాల‌ని తాము నిర్ణ‌యించుకున్న‌ట్లు గౌర‌వ ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. ఈ మేర‌కు అన్ని పార్టీల నేత‌ల‌ను అఖిల‌ప‌క్ష స‌మావేశానికి ఆహ్వానించాల‌ని ఉప ముఖ్య‌మంత్రి శ్రీ మ‌ల్లు భ‌ట్టి విక్ర‌మార్క‌, మాజీ మంత్రి జానా రెడ్డిల‌కు సూచించిన‌ట్లు సీఎం తెలిపారు. తాము నిర్వ‌హించే స‌మావేశానికి బీజేపీ రాష్ట్ర అధ్య‌క్షునిగా ఉన్న కేంద్ర మంత్రి కిష‌న్ రెడ్డిని ఆహ్వానిస్తున్నామ‌ని… ఆయ‌న స‌మావేశంలో పాల్గొని అక్క‌డ వెల్ల‌డైన అభిప్రాయాల‌ను కేంద్ర క్యాబినెట్ దృష్టికి తీసుకెళ్లాల‌ని సీఎం అన్నారు. మా హ‌క్కుల ర‌క్ష‌ణ‌కు తెలంగాణ నుంచి కేంద్ర మంత్రిగా ఉన్న కిష‌న్ రెడ్డి పాటుప‌డాల్సి ఉన్నందున ఆయ‌న‌ను పిలుస్తామ‌ని, ఆయ‌న దీనికి స‌మాధానం చెప్పాల్సి ఉంటుంద‌ని గౌర‌వ ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. రాజ‌కీయ పార్టీల‌కు అతీతంగా ద‌క్షిణాది రాష్ట్రాల హ‌క్కుల ప‌రిర‌క్ష‌ణ‌కు అంతా పాటుప‌డాల‌ని గౌర‌వ ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి విజ్ఞ‌ప్తి చేశారు. 22న చెన్నైలో నిర్వ‌హించే స‌మావేశంలో నియోజ‌క‌వ‌ర్గాల పున‌ర్విభ‌జ‌న‌తో క‌లిగే న‌ష్టాలు.. వాటిని అధిగ‌మించేందుకు తీసుకోవాల్సిన చ‌ర్య‌ల‌పై కార్యాచ‌ర‌ణ‌ను రూపొందిస్తామ‌ని సీఎం స్ప‌ష్టం చేశారు. అన్ని పార్టీలు, పౌర సంఘాల అభిప్రాయాలు సేక‌రించేందుకు త‌మిళ‌నాడు గౌరవ‌ ముఖ్య‌మంత్రి స్టాలిన్ అఖిల‌ప‌క్ష స‌మావేశం ఏర్పాటు చేశార‌ని సీఎం అన్నారు. నియోజ‌క‌వ‌ర్గాల పున‌ర్విభ‌జ‌న‌కు సంబంధించి ఏవిధంగా వ్య‌వ‌హ‌రించాల‌నే అంశంపై త‌మిళ‌నాడు గౌర‌వ ముఖ్య‌మంత్రి ఎం.కె.స్టాలిన్ కీల‌క పాత్ర పోషిస్తున్నార‌ని, ఆయ‌న‌ను ప్రోత్స‌హిస్తామ‌ని సీఎం తెలిపారు.