మావోయిస్టులను తరిమికొడతాం.. గిరిజన ఐక్యవేదిక పేరిట పోస్టర్లు మంగపేట, నవంబర్ 30 ( నినాదం న్యూస్ ) : ములుగు జిల్లా మంగపేట మండలంలో మావోయిస్టులకు
మావోయిస్టులను తరిమికొడతాం.. గిరిజన ఐక్యవేదిక పేరిట పోస్టర్లు
మంగపేట, నవంబర్ 30 ( నినాదం న్యూస్ ) : ములుగు జిల్లా మంగపేట మండలంలో మావోయిస్టులకు వ్యతిరేకంగా శనివారం వెలసిన పోస్టర్లు కలకలం రేపుతున్నాయి. మంగపేట తహసీల్ కార్యాలయం, మంగపేట మండల పరిషత్ కార్యాలయం ప్రహరీ గోడలతో పాటు పలు చోట్ల వెలసిన ఈ పోస్టర్లు మావోయిస్టుల తీరుకు నిరసనగా, మావోయిస్టుల విధానాలను ప్రశ్నిస్తూ కనిపిస్తున్నాయి. ఎక్కువ శాతం మావోయిస్టులు మాత్రమే పోస్టర్లను అంటించి వారి ఉద్దేశాలను తెలుపుతుంటారు. అయితే శనివారం మంగపేట మండలంలో వెలసిన పోస్టర్లు మావోయిస్టులకు వ్యతిరేకంగా ఉండటం గమనార్హం. మావోయిస్టుల విధానాలను ఆదివాసి ఐక్య వేదిక ప్రశ్నిస్తున్నట్లుగా పోస్టర్లలో ఉంది . మావోయిస్టులకు ఆదివాసుల ప్రాణాలంటే లేక్కలేదా ? ఇన్ ఫార్మర్ నెపంతో ఇంకా ఎన్ని కాలాలు అమాయక ఆదివాసుల బలిదానాలు, ఆదివాసుల ఉనికిని నాశనం చేసి, అడవిని ఆక్రమించి, ఆదివాసులను అడవులలో తిరగొద్దని, ఇన్ ఫార్మర్ నెపంతో గొడ్డళ్ళతో ఖతం చేసుడు ఏందీ ? మీ ఉనికి కోసం మా అమాయక జీవితాలు బలి కావాల్సిందేనా ? మా ఆదివాసీలపై ఇంకెన్నాళ్లు మీ అరాచకాలు ? అని మావోయిస్టులను ప్రశ్నిస్తూ పోస్టర్లలో ఉంది. ఇటీవల పోలీస్ ఇన్ ఫార్మర్లు అంటూ ములుగు జిల్లా వాజేడు మండలం పెనుగోలు గ్రామానికి చెందిన పంచాయతీ కార్యదర్శి ఉయికె రమేష్, ఉయికె అర్జున్ లను మావోయిస్టులు గొడ్డళ్ళతో నరికి హత్య గావించబడ్డ ఫోటోలను ఆ పోస్టర్లలో ముద్రించారు. మావోయిస్టులను తరిమికొడదాం, అడవిని రక్షించుకుందాం, ఆదివాసీ ప్రజలారా ఇప్పటికైనా మేల్కొందాం అంటూ ఆ పోస్టర్లలో ముద్రించారు. ఆదివాసి ఐక్య వేదిక అనే పేరుతో ఈ పోస్టర్లను ఎవరు అతికించారు అనే విషయం ఇంకా తెలియరాలేదు. కాగా డిసెంబర్ 2 వ తేది నుండి డిసెంబర్ 8 వ తేది వరకు మావోయిస్టుల పీఎల్‌జీఏ వారోత్సవాల నేపథ్యంలో మండలంలో ఈ పోస్టర్లు వెలవడం కలకలం లేపడమే కాకుండా చర్చనీయాంశమైంది.