కోదాడ,నినాదం:మమ్మల్ని పట్టించుకోండి పూట గడవడం కష్టంగా ఉందంటూ ఆవేదన…ఆరు నెలలగా జీతాలు అందక ఇబ్బంది పడుతున్నామని ఆరోపిస్తూ కోదాడ మున్సిపల్ కార్మికులు శ
కోదాడ,నినాదం:
మమ్మల్ని పట్టించుకోండి పూట గడవడం కష్టంగా ఉందంటూ ఆవేదన…
ఆరు నెలలగా జీతాలు అందక ఇబ్బంది పడుతున్నామని ఆరోపిస్తూ కోదాడ మున్సిపల్ కార్మికులు శనివారం ఆందోళన బాట పట్టారు. మున్సిపల్ కార్యాలయం ఎదుట పెద్ద ఎత్తున నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా మున్సిపల్ కార్మికులు మాట్లాడుతూ…గత మూడు సంవత్సరాల నుండి కోదాడ మున్సిపాలిటీలో సుమారు 100 మంది కమాటీలు కొలువు చేసుకుంటూ జీవనం కొనసాగిస్తున్నామని తెలిపారు. తమతో అన్ని రకాలుగా పారిశుద్ధ్యం పనులు చేయించుకుని జీతం అడిగితే మాత్రం ఇవ్వటం లేదని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. సంబంధిత అధికారులకు విన్నవించుకున్నప్పటికీ ఎటువంటి ఫలితం లేక పోయిందన్నారు. ”కోదాడ పట్టణాన్ని పరిశుభ్రంగా ఉంచడానికి నిత్యం శ్రమిస్తున్నాము. అయినా సరే మా జీతాలు ఇవ్వడంలో సంబంధిత అధికారులు అలసత్వం వహిస్తున్నారు మాకు జీతాలు రాక కుటుంబ పోషణ భారం అయ్యింది.” అని కన్నీటి పర్యంతమయ్యారు. పిల్లలకు స్కూల్ ఫీజు కూడా కట్టలేని పరిస్థితుల్లో ఉన్నామన్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి సకాలంలో జీతాలు చెల్లించాలని ఈ సందర్భంగా వారు కోరారు.
ఆరు నెలలు కాదు మూడు నెలలు మాత్రమే ఇవ్వాల్సింది
-కోదాడ మున్సిపల్ కమిషనర్ రమాదేవి
”గత ఆరు నెలలుగా జీతాలు ఇవ్వాలని కార్మికులు చేస్తున్న అభియోగం సరైనది కాదు. జీతాలు ఇవ్వాల్సింది మూడు నెలలు మాత్రమే. ఆందోళన చేస్తున్న కార్మికులు అవుట్సోర్సింగ్ కార్మికుల కాదు. రోజువారి కూలి కార్మికులు. వారికి ముందే చెప్పాం బడ్జెట్ ఉన్నప్పుడు జీతాలు చెల్లిస్తామని, త్వరలోనే జీతాలు చెల్లిస్తాం” అని కమిషనర్ చెప్పారు.