తమిళనాడు హీరోలు పార్టీలు పెట్టడం కొత్తకాదు. ఎంజీఆర్ నుండి మొదలుకొంటే ఇప్పటి విజయ్ దాకా అనేక మంది సినీ రంగానికి చెందిన వాళ్ళు రాజకీయ పార్టీలు పెట్టారు
తమిళనాడు హీరోలు పార్టీలు పెట్టడం కొత్తకాదు. ఎంజీఆర్ నుండి మొదలుకొంటే ఇప్పటి విజయ్ దాకా అనేక మంది సినీ రంగానికి చెందిన వాళ్ళు రాజకీయ పార్టీలు పెట్టారు. అయితే రాజకీయాల్లో కరుణా నిధి, ఎంజీఆర్, జయలలిత తప్ప మరెవ్వరూ సక్సెస్ కాలేదు. కానీ ప్రస్తుతం తమిళనాడులో ఉన్న రాజకీయ ఖాళీ విజయ్ ను సక్సెస్ చేస్తుందని ఆయన నమ్ముతున్నాడు. జయలలిత మరణం తర్వాత అన్నాడీఎంకే బలం బాగా దిగజారింది. ఆ పార్టీలో ప్రజలను ఆకర్శించగల నేతలే లేకుండా పోయారు. అందువల్ల ఇప్పుడు డీఎంకేదే రాజ్యమయ్యింది. డీఎంకేను ఓడించి తమిళనాడులో ఎలాగైనా కాలుమోపాలని చూస్తున్న బీజేపీకి విజయ్ వరంలా కనిపించాడు. జయలలిత మరణం తర్వాత అన్నాడీఎంకేను తన చెప్పుచేతుల్లో పెట్టుకోవాలనుకున్న బీజేపీ ఆ పార్టీని సర్వనాశనం చేసింది. ఆ పార్టీకి బలమైన నాయకుడు లేకుండా చేయడంలో బీజేపీదే కీలకపాత్ర. ఇప్పుడు తమిళ రాజకీయాల్లో అన్నాడీఎంకే పాత్ర పరిమితమైపోయింది. ఈ నేపథ్యంలో తమిళనాట పాపులర్ అయిన హీరో విజయ్ పార్టీ పెట్టడం బీజేపీకి అందివచ్చిన అవకాశం.
విజయ్ తాజాగా నిర్వహించిన బహిరంగసభలో డీఎంకే తన రాజకీయ శతృవని, బీజేపీ తన సైద్దాంతిక శతృవని ప్రకటించాడు. కానీ నిజానికి విజయ్ టార్గెట్ డీఎంకే అన్నది జగమెరిగిన సత్యం. తమిళనాట ద్రవిడ రాజకీయాలు, పెరియార్ గురించి మాట్లాడకుంటే ప్రజల మద్దతు రాదు కాబట్టి విజయ్ వాటి గురించి మాట్లాడాడు కానీ విజయ్ కి ద్రవిడ రాజకీయాలపట్ల నిబద్దత కానీ పెరియార్ పట్ల ప్రేమ కానీ ఏ మాత్రం లేదు. ఆయన ఉపన్యాసంలోనే అది స్పష్టమైంది. పెరియార్ ద్రవిడ రాజకీయాల్లో అత్యంత ముఖ్యమైనది హేతువాదం. పెరియార్ గుళ్ళలోని విగ్రహాలను బైటికి తెచ్చి పగలగొట్టిన విషయాలను ఇప్పటికీ తమిళనాడులో కథలు కథలుగా చెప్పుకుంటారు. దేవుడు లేడు మనిషే దేవుడిని సృష్టించాడన్న పెరియార్ మాటలను ప్రజలు ఇప్పటికీ నమ్ముతారు. అలాంటిది విజయ్ పెరియార్ ను సమర్దిస్తాను కానీ దేవుణ్ణి నమ్ముతానని చెప్పడం, తాను పెరియార్ ముఖ్యమైన సిద్దాంతాన్ని అనుసరించబోనని ప్రకటించడం ఆయనకు ద్రవిడ రాజకీయాలపట్ల, పెరియార్ పట్ల ఎంత ప్రేముందో తెలియజేస్తుంది.
ఈ నేపథ్యంలో విజయ్ వెనక ఆర్థిక, రాజకీయ, నైతిక శక్తిగా నిలబడ్డది బీజేపీయేననే చర్చనడుస్తోంది. పార్టీ పెట్టడం విషయంలో కొన్నేళ్ళుగా తటపటాయిస్తున్న విజయ్ కి ధైర్యానిచ్చి ముందుకు నడిపిస్తున్నది బీజేపీ అగ్రనాయకత్వమే అన్నది ప్రస్తుతం తమిళనాట టాక్. బీజేపీకి ఏపీలో తోకగా పనిచేస్తున్న పవన్ కళ్యాణ్ కూడా విజయ్ పార్టీపెట్టినందుకు అభినందనలు తెలపడం బీజేపీ వ్యూహంలో భాగమే.