ఖమ్మం జిల్లా ప్రతినిధి, జనవరి 25(నినాదం): బీఆర్ఎస్ పార్టీ ఖమ్మం పట్టణ అధ్యక్షుడు పగడాల నాగరాజును ఖమ్మం టూటౌన్ పోలీసులు గురువారం రాత్రి అరెస్టు చేశారు
ఖమ్మం జిల్లా ప్రతినిధి, జనవరి 25(నినాదం): బీఆర్ఎస్ పార్టీ ఖమ్మం పట్టణ అధ్యక్షుడు పగడాల నాగరాజును ఖమ్మం టూటౌన్ పోలీసులు గురువారం రాత్రి అరెస్టు చేశారు. ప్రభుత్వ స్థలాన్ని కబ్జా చేసి జీవో 59 ద్వారా క్రమబద్ధీకరించుకున్నారని పగడాల నాగరాజు భార్య, 53వ డివిజన్ కార్పొరేటరు పగడాల శ్రీవిద్య , పగడాల నాగరాజు పై డిసెంబరు 30న టూ టౌన్ పోలీసు స్టేషన్లో వీరిపై కేసు నమోదైంది. విచారణ నిమిత్తం పగడాల నాగరాజు ను ఖమ్మం ఏసీపీ కార్యాలయానికి పిలిపించారు. అనంతరం అరెస్ట్ చేసి టూ టౌన్ పోలీస్ స్టేషన్ కి తరలించారు. వెనువెంటనే జడ్జి ఎదుట నాగరాజు ను హాజరుపరిచారు. నాగరాజుకు జడ్జి 14 రోజుల రిమాండ్ విధించారు. ఇదే కేసులో ఏ-1 గా ఉన్న పగడాల నాగరాజు భార్య కార్పోరేటర్ శ్రీవిద్యకు ముందస్తు బెయిల్ మంజూరు అయ్యింది.
మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ కు ప్రధాన అనుచరుడు గా ఉన్న పగడాల నాగరాజు అరెస్టు విషయం తెలియడంతో బీఆర్ఎస్ శ్రేణులు పెద్ద సంఖ్యలో ఆయన ఇంటి వద్దకు తరలివచ్చారు. నాగరాజుపై కాంగ్రెస్ పార్టీ రాజకీయ కక్షసాధింపు చర్యలకు పాల్పడుతుందని మండిపడ్డారు . అక్కడి నుండి పెద్ద సంఖ్యలో టూ టౌన్ పోలీసు స్టేషన్ కు బీఆర్ఎస్ శ్రేణులు చేరుకోవడంతో స్వల్ప ఉద్రిక్తత చోటుచేసుకుంది. మొత్తం మీద పోలీసులు వారికి నచ్చజెప్పడంతో పరిస్థితి సద్దుమణిగింది.