నామినేషన్లకు రేపే చివరి తేదీ కావడంతో అనేక చర్చోపచర్చల తర్వాత కాంగ్రెస్ పార్టీ కొద్దిసేపటి క్రితం తుది జాబితా విడుదల చేసింది. సూర్యాపేటలో రాంరెడ్డి దా
నామినేషన్లకు రేపే చివరి తేదీ కావడంతో అనేక చర్చోపచర్చల తర్వాత కాంగ్రెస్ పార్టీ కొద్దిసేపటి క్రితం తుది జాబితా విడుదల చేసింది. సూర్యాపేటలో రాంరెడ్డి దామోదర్ రెడ్డి ని, తుంగతుర్తి శామ్యుల్, మిర్యాల గూడ బి.లక్ష్మా రెడ్డి,పటాన్ చెరు కాట శ్రీనివాస్ గౌడ్, చార్మినార్ ముజీబుల్లా షరీఫ్ లను కాంగ్రెస్ అభ్యర్థులుగా ప్రకటించింది.
పటాన్ చెరువు అభ్యర్థిగా ముందుగా బీజేపీ నుంచి కాంగ్రెస్ లో చేరిన నీలం మధును ప్రకటించిన కాంగ్రెస్ అధిష్టానం అక్కడ వచ్చిన వ్యతిరేకతతో అక్కడ నీలం మధును మార్చి కాటం శ్రీనివాస్ గౌడ్ ను తన అభ్యర్థిగా ప్రకటించింది. వీరిద్దరికి సంబంధించి నీలం మధుకు కాంగ్రెస్ సీనియర్ నేత జగ్గారెడ్డి మద్దతు ఉండగా, కాటం శ్రీనివాస్ గౌడ్ కు దామోదర రాజనర్సింహ మద్దతు ఉంది.
చివరి నిమిషం వరకూ పటాన్ చెరు అభ్యర్థి విషయంలో అధిష్టానం మల్లగుల్లాలు పడినట్లుగా తెలుస్తోంది. నీలం మధును మార్చాల్సిందేనని మాజీ డిప్యూటీ సీఎం దామోదర రాజనర్సింహా పట్టుబట్టడం, మారిస్తే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని, తన దారి తాను చూసుకుంటానని జగ్గారెడ్డి హెచ్చరికలు జారీ చేయడంతో పెద్ద పంచాయితీగా మారింది. అయితే చివరికి అభ్యర్థిని మార్చేయడంతో దామోదర పంతం నెగ్గించుకున్నట్టయ్యింది. మరి జగ్గారెడ్డి ఏం చేస్తారన్నది చూడాలి.
ఇక మొదటి నుంచి తుంగతుర్తి టికట్ కోసం ప్రయత్నిస్తున్న అద్దంకి దయాకర్ కు కాంగ్రెస్ షాక్ ఇచ్చింది. రేవంత్ మనిషిగా ముద్రపడ్డ దయాకర్ కు టికట్ రాకుండా చివరి వరకు కోమటి రెడ్డి బ్రదర్స్ ప్రయత్నించారనే ఆరోపణలున్నాయి. దాంతో రేవంత్ పై కోమటి రెడ్డిదే పైచేయి అయ్యింది.