కాంగ్రెస్ విడుదల చేసిన రెండో జాబితా తర్వాత పార్టీలో అసంతృప్తుల సంఖ్య పెరిగిపోతోంది. పార్టీ టికెట్ ఆశించి భంగపడ్డ నేతలు అధిష్ఠానంపై భగ్గుమంటున్నారు. ఎ
కాంగ్రెస్ విడుదల చేసిన రెండో జాబితా తర్వాత పార్టీలో అసంతృప్తుల సంఖ్య పెరిగిపోతోంది. పార్టీ టికెట్ ఆశించి భంగపడ్డ నేతలు అధిష్ఠానంపై భగ్గుమంటున్నారు. ఎలాగైనా పోటీ చేసితీరతామని చెబుతున్నారు. ఇంతకాలం పార్టీ కోసం కష్టపడ్డ తమకు టికెట్ ఇవ్వకపోవడాన్ని ఎలా అర్థం చేసుకోవాలని ప్రశ్నిస్తున్నారు. తాజాగా జూబ్లీహిల్స్ టికెట్ తనకే వస్తుందని చివరి వరకూ ఆశపడ్డ పీజేఆర్ కొడుకు విష్ణువర్ధన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేయడానికి రెడీ అయ్యారు.
మరో వైపు ఆయన అనుచరులు హైదరాబాద్ నాంపల్లిలోని గాంధీ భవన్ వద్ద ఆందోళనకు దిగారు. కాంగ్రెస్ పార్టీ విడుదల చేసిన రెండో జాబితాలో విష్ణువర్ధన్ రెడ్డికి టికట్ దక్కలేదు. ఆయన జూబ్లీహిల్స్ టిక్కెట్‌పై ఆశలు పెట్టుకున్నప్పటికీ ఈ స్థానం నుంచి కాంగ్రెస్ అజారుద్దీన్ పేరును ప్రకటించింది. దీంతో విష్ణువర్ధన్ రెడ్డి తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. ఆయన అనుచరులతో భేటీ అనంతరం తన నిర్ణయం ప్రకటిస్తానని వెల్లడించారు.
ఈ క్రమంలో విష్ణు అనుచరులు గాంధీ భవన్ వద్ద నేడు ఆందోళన నిర్వహించారు. గాంధీ భవన్ లోనికి వెళ్లకుండా ప్రధాన ద్వారానికి తాళం వేసి ఉంది. దీంతో ఇటుకలతో తాళం పగులగొట్టేందుకు వారు ప్రయత్నించారు. రేవంత్ బొమ్మను పగులగొట్టారు. కాంగ్రెస్ కండువాలు దగ్ధం చేశారు. విష్ణువర్ధన్ రెడ్డికి అనుకూలంగా నినాదాలు చేశారు. దీంతో గాంధీ భవన్ వద్ద కాసేపు ఉద్రిక్తత నెలకొంది.
నియోజకవర్గంలో కాంగ్రెస్ ను బలోపేతం చేయడానికి ఎంతో కష్టపడ్డ తనకు టికెట్ ఇవ్వకుండా అజారుద్దీన్ కు కేటాయించడాన్ని ఆయన తప్పుబట్టారు. కొన్నిచోట్ల హాఫ్ టికెట్ గాళ్లకు కూడా టికెట్ ఇచ్చారంటూ పార్టీ అధిష్ఠానంపై మండిపడ్డారు. ఈవీఎంలలో తన పేరు ఉండాల్సిందేనని, ఇండిపెండెంట్ గా అయినా బరిలోకి దిగుతానని విష్ణువర్ధన్ రెడ్డి స్పష్టం చేశారు. అనుచరులు, అభిమానులతో చర్చించాక భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తానని తెలిపారు.
అజారుద్దీన్ గురించి ఎక్కువగా చెప్పవద్దని, అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం సోదరుడి లాంటివాడు అజారుద్దీన్ అని విమర్శలు గుప్పించారు. అలాంటి వ్యక్తికి కాంగ్రెస్ టిక్కెట్ ఇచ్చిందన్నారు. హెచ్‌సీఏలో ఎలా అవకతవకలకు పాల్పడ్డారో జూబ్లీహిల్స్‌లో గెలిపిస్తే కూడా అలాగే చేస్తారన్నారు.
కూకట్‌పల్లి స్థానం నుంచి టిక్కెట్ ఆశించిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత గొట్టిముక్కల వెంగళరావు శనివారం ఆ పార్టీకి రాజీనామా చేశారు. ఆయన కూకట్‌పల్లి టిక్కెట్ కోసం ప్రయత్నాలు చేశారు. కానీ నిన్నటి జాబితాలో శేరిలింగంపల్లికి చెందిన బండి రమేశ్‌కు కూకట్‌పల్లి టిక్కెట్ దక్కింది. దీంతో గొట్టిముక్కల ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ సందర్భంగా గొట్టిముక్కల మాట్లాడుతూ… పార్టీని వీడాలంటే బాధగా ఉందని కంటతడి పెట్టారు. కాంగ్రెస్ పార్టీ కోసం 40 ఏళ్లుగా కష్టపడ్డానన్నారు.
ఎల్లారెడ్డి అసెంబ్లీ నియోజకవర్గం టిక్కెట్ ఆశించి భంగపడిన వడ్డేపల్లి సుభాష్‌రెడ్డి శనివారం కన్నీరుమున్నీరయ్యారు. ఎల్లారెడ్డి టిక్కెట్‌ను కాంగ్రెస్ అధిష్ఠానం మదన్ మోహన్‌కు ఇచ్చింది. దీంతో సుభాష్ రెడ్డి ఈ రోజు తన అనుచరులతో భేటీ అయ్యారు. వారితో మాట్లాడుతూ… ఒక్కసారిగా భోరుమన్నారు. కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు తెలిపారు.
వరంగల్ పశ్చిమ నియోజకవర్గం టిక్కెట్ దక్కుతుందని భావించిన జంగా రాఘవరెడ్డికి కూడా నిరాశ ఎదురైంది. ఈ టిక్కెట్ నాయిని రాజేందర్ రెడ్డికి దక్కింది. జంగా రాఘవరెడ్డి మొదట జనగామ అసెంబ్లీ నియోజకవర్గంలో పని చేశారు. ఆ తర్వాత పార్టీ పెద్దల సూచన మేరకు వరంగల్ పశ్చిమకు వెళ్లారు. కానీ టిక్కెట్ రాలేదు. దీంతో ఆయన కూడా తన అనుచరుల వద్ద కంటతడి పెట్టారు.
కాంగ్రెస్ పార్టీ కోసం కోట్లాది రూపాయలు ఖర్చు చేసిన తనకు టిక్కెట్ ఇవ్వలేదని, కానీ కొత్తగా వచ్చిన వారికి ఇచ్చారని జంగా రాఘవరెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు.
కొత్తగా వచ్చిన రేవూరికి, నాగరాజుకు, యశస్వికి టిక్కెట్లు ఇచ్చారని, మొదటి నుంచి పార్టీ కోసం పని చేసిన తనకు ఇవ్వలేదన్నారు. పార్టీ సమావేశాలకు కోట్ల రూపాయలు ఖర్చు చేశానన్నారు. తమ పార్టీ అధిష్ఠానం టిక్కెట్ దక్కించుకున్న నాయిని రాజేందర్ ఒక బ్రోకర్… అసమర్థుడు అని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కేయూ భూములు అమ్ముకున్న నాయినికి టిక్కెట్ ఇచ్చారన్నారు. కాంగ్రెస్‌కు ఓటు వేసేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నప్పటికీ, నాయకులు ఆ ఓటు వేయించుకోవడానికి సిద్ధంగా లేరన్నారు. తనపై కుట్ర చేసి అసమర్థుడికి టిక్కెట్ ఇచ్చారన్నారు. ఆరు నియోజకవర్గాల్లో తన అభ్యర్థులను నిలబెడతామని, అవసరమైతే ఏదో ఒక పార్టీ మద్దతు తీసుకుంటానన్నారు. వరంగల్ పశ్చిమలో వినయ్ భాస్కర్‌కు, తనకు మధ్యే పోటీ అన్నారు. ఎల్లుండి భవిష్యత్తు కార్యాచరణ ప్రకటిస్తానన్నారు.
కోమటిరెడ్డి వెంకటరెడ్డి రాత్రికి రాత్రి తన తమ్ముడు రాజగోపాల్ రెడ్డిని కాంగ్రెస్‌లోకి తీసుకువచ్చి బీఫామ్ ఇప్పించుకున్నాడని, అయినా తాను మునుగోడు ఎన్నికల బరిలో పక్కాగా ఉంటానని చలమల కృష్ణారెడ్డి అన్నారు. తనకు మునుగోడు టిక్కెట్ రాకపోవడంతో తన అనుచరులతో ఆయన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… కాంగ్రెస్ మారింది.. ముసలివాళ్ల రాజ్యం నడవదని భావించానని, కానీ ఇప్పటికీ వారిదే నడుస్తోందన్నారు. సర్వే ఆధారంగా టిక్కెట్ వస్తుందనుకుంటే, తనకే వస్తుందని భావించానన్నారు. కాంగ్రెస్‌లో జోకిన వాడికే టిక్కెట్ ఇస్తారని మరోసారి తేలిందన్నారు. తనకు కాంగ్రెస్ గుణపాఠం చెప్పిందన్నారు.
కాంగ్రెస్ పార్టీలో టిక్కెట్ రావాలంటే మూడు క్వాలిటీలు ఉండాలని తనకు ఈ రోజు అర్థమైందని, ఒకటి… పొద్దున లేస్తే లీడర్ల వద్దకు వెళ్లి సలాం కొట్టాలని, రెండు… గాంధీ భవన్లో ప్రెస్ మీట్లు పెట్టాలని, మూడోది… ఢిల్లీకి వెళ్లి పైరవీలు చేయాలన్నారు. ఈ మూడు క్వాలిటీలు ఉంటే కాంగ్రెస్‌లో టిక్కెట్ వస్తుందన్నారు.
కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, పాల్వాయి స్రవంతిలు తనకు టిక్కెట్ రాకుండా అడ్డుకున్నారన్నారు. అసలు ఉమ్మడి నల్గొండ జిల్లాకు ఉత్తమ్ కుమార్ ఏం చేశారు? అని ప్రశ్నించారు. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గత ఉప ఎన్నికల్లో గెలిచి ఉంటే వెంకటరెడ్డి కూడా బీజేపీలోకి వెళ్లి ఉండేవారు కాదా? అని నిలదీశారు.
తనపై వారికి ఉన్న కోపానికి కారణం ఒకటేనని, అది తాను రేవంత్ రెడ్డి వర్గం కావడమన్నారు. ఎక్కడా రేవంత్ వర్గం నాయకులు గెలవకూడదని వారు కోరుకుంటున్నారన్నారు. అందుకే తమను బలిపశువులను చేస్తున్నారన్నారు. కోమటిరెడ్డి సోదరులు, ఉత్తమ్ వంటి వారు మళ్లీ గెలిస్తే కాంగ్రెస్‌లో కుమ్ములాటలు తిరిగి ప్రారంభమవుతాయన్నారు. వీరు గెలిచాక కాంగ్రెస్ నుంచి అయ్యే సీఎంకు మనశ్శాంతి ఉండదన్నారు
నాగర్ కర్నూల్ టికట్ తనకు దక్కక పోవడం నాగం జనార్దన్ రెడ్డి మండి పోతున్నారు. పార్టీ మార్పుపై కార్యకర్తలదే తుది నిర్ణయమని ఆయన అన్నారు. శనివారం నాడు తన నివాసంలో మీడియాతో మాట్లాడుతూ…‘‘నాగర్‌కర్నూల్‌లో కాంగ్రెస్‌ను ఎంతగానో బలోపేతం చేశాను. నాకు టికెట్ ఇవ్వకపోవడం బాధాకరంగా ఉంది. బోగస్ సర్వేల పేరుతో ప్రజలు, నేతలను మోసం చేస్తున్నారు’’ నాగం జనార్దన్‌రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
కాంగ్రెస్ పార్టీ ( Congress Party ) RSS చెప్పు చేతుల్లో ఉందని తెలంగాణ కాంగ్రెస్ మైనార్టీ సెల్ చైర్మన్ షేక్ అబ్దుల్లా సోహెల్ ( Sheikh Abdullah Sohail ) తీవ్ర విమర్శలు గుప్పించారు. శనివారం నాడు కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు తెలిపారు. ఖర్గేకు తన రాజీనామా లెటర్‌ను పంపినట్లు చెప్పారు. సోమజిగూడా ప్రెస్ క్లబ్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో అబ్దుల్లా సోహెల్ మాట్లాడుతూ…‘‘34 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ కోసం ఎంతో కృషి చేశాను. కాంగ్రెస్ పార్టీలో టికెట్ల పంపకాల్లో గందరగోళంపై పోను పోను హై కమాండ్‌కు తెలుస్తుంది. ఎవరికి అయితే పార్టీ టికెట్స్ కట్టబెట్టిర్రో అందులో 20 శాతం మంది కాంగ్రెస్ పార్టీ నేతలు కాదు. కాంగ్రెస్ పార్టీ టికెట్లు అమ్ముకుంటుంది ఒకటి రెండు కాదు అన్ని టికెట్లు అమ్ముకుంది. పార్టీ కోసం ఎలాంటి ధర్నాలు, జెండా మోయలేని నేతలు టికెట్స్ పొందారు. RSS నుంచి ABVP నుంచి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చిన నేతలు కాంగ్రెస్ పార్టీని నాశనం చేస్తున్నారు’’ అని షేక్ అబ్దుల్లా సోహెల్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.