ఉత్తరప్రదేశ్, హమీర్‌పూర్ జిల్లాలోని కురారాలో సెప్టెంబర్ 17న సంఘ సంస్కర్త, ద్రవిడ సిద్దాంతకర్త 'తాంథై' పెరియార్ జయంతి జరిపి, పెరియార్ రచనలు చదివినందు
ఉత్తరప్రదేశ్, హమీర్‌పూర్ జిల్లాలోని కురారాలో సెప్టెంబర్ 17న సంఘ సంస్కర్త, ద్రవిడ సిద్దాంతకర్త ‘తాంథై’ పెరియార్ జయంతి జరిపి, పెరియార్ రచనలు చదివినందుకు నలుగురు దళితలపై పోలీసులు కేసు నమోదు చేశారు.
అమర్ సింగ్, డాక్టర్ సురేష్, అవధేష్, అశోక్ విద్యార్థి అనే నలుగురిపై సెప్టెంబర్ 19న ఎఫ్ఐఆర్ దాఖలైంది.”దేవుని సృష్టించినవాడు మూర్ఖుడు . దేవుడిని ప్రచారం చేసేవాడు ‘దుష్టుడు’. దేవుడిని ఆరాధించేవాడు అంతకన్నా పెద్ద మూర్ఖుడు. ఇది నిజం .” అని పెరియార్ చెప్పిన మాటలను ఆ సభలో చెప్పినందుకు వారిపై కేసు నమోదయ్యింది.
“ఒక VHP నాయకుడు చేసిన ఫిర్యాదు ఆధారంగా వారిపై ఇండియన్ పీనల్ కోడ్ సెక్షన్ 295 మరియు 153A కింద అభియోగాలు మోపాము.” అని ఓ పోలీసు అధికారి తెలిపారు.
సెక్షన్ 295 (ఒక వ్యక్తి యొక్క మతాన్ని అవమానించే ఉద్దేశ్యంతో ప్రార్థనా స్థలం/పవిత్రమైన వస్తువును ధ్వంసం చేయడం) సెక్షన్ 153A (మతం, జాతి, పుట్టిన ప్రదేశం, భాష ఆధారంగా వివిధ సమూహాల మధ్య శత్రుత్వాన్ని ప్రోత్సహించడం ) కింద కేసులు నమోదు చేశారు.
అయితే వారు పెరియార్ రాసిన పంక్తులను మాత్రమే చదివారని నిందితుడి సోదరుడు అన్నాడు.
నిందితులు BSP లేదా భీమ్ ఆర్మీతో సంబంధం కలిగి ఉన్నారని ఫిర్యాదుదారు, వీహెచ్ పీ నాయకుడు పేర్కొన్నప్పటికీ, ప్రధాన నిందితుడి సోదరుడు హర్దౌల్ సింగ్, వారు దళితులని, వారు సామాజిక కార్యకర్తలు ఏ పార్టీకి చెందినవారు కాదని చెప్పారు.
అతను మాట్లాడుతూ, “వారు చేసినదంతా పెరియార్ చేసిన పని గురించి మాట్లాడటం. అతని పుస్తకంలోని పంక్తులు చదవడం. వారు ఏ వ్యక్తిని లేదా వారి మతపరమైన మనోభావాలను దెబ్బతీయలేదు.” అన్నారు.
“ఇప్పుడు వైరల్‌గా మారిన వీడియోలో వారు హిందూ దేవుళ్లను అవమానించారు. వీడియోలోని ఈ వ్యక్తి పిల్లలతో సహా ప్రజల ముందు తన ప్రసంగంలో హిందూ దేవుళ్ళను, దేవతలను అవమానించారు.” అని పోలీసులు తమ ఎఫ్‌ఐఆర్ లో పేర్కొన్నారు
ఎఫ్‌ఐఆర్‌లో ఫిర్యాదుదారు విశ్వహిందూ పరిషత్‌కు చెందిన అమిత్ రాజావత్ మాట్లాడుతూ, “వారు తమ పూర్వీకుల కోసం తొమ్మిది రోజులు పూజలు చేసేవారికి వ్యతిరేకంగా కూడా మాట్లాడారు” అని చెప్పారు.
అయితే పెరియార్ రచనలు నిషేధించలేదని, అలాంటప్పుడు ఆ రచనలను బహిరంగంగా చదివితే కేసులు ఎలా నమోదు చేస్తారని సోషల్ మీడియాలో పలువురు ప్రశ్నిస్తున్నారు.