రాష్ట్ర దశాబ్ది వేడుకల సందర్భంగా ప్రకటించిన కుల వృత్తుల ఆర్థిక సాయం ఇంకా అందనే లేదు. నిధుల కొరత కారణంగానే లబ్దిదారులకు పంపిణీ చేయడంలో ఆలస్యం అవుతోందని చెబుతున్నారు.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు మరి కొన్ని వారాలే సమయం ఉండటంతో అధికార బీఆర్ఎస్ పార్టీ అన్ని వర్గాలను ఆకట్టుకోవడానికి మనీ ట్రాన్స్‌ఫర్ పథకాలకు తెరలేపింది. ఇప్పటికే దళితుల కోసం దళిత బంధు, బీసీ కుల వృత్తుల వారి కోసం ఆర్థిక సాయం చేస్తూ వచ్చింది. తాజాగా మైనార్టీలకు రూ.1లక్ష ఆర్థిక సాయం చేయాలని నిర్ణయం తీసుకున్నది. కర్ణాటక ఎన్నికల తర్వాత క్రిస్టియన్లు, ముస్లింలు, ఇతర మైనార్టీలు కాంగ్రెస్ వైపు మొగ్గు చూపుతున్నారని అంచనా వేసిన సీఎం కేసీఆర్.. ఈ సరికొత్త పథకానికి తెరతీసినట్లు చర్చ జరుగుతున్నది.
మైనార్టీలకు రూ.1 లక్ష ఆర్థిక సాయం అని ప్రకటించగానే ఆయా వర్గాల నుంచి సానుకూల స్పందన వచ్చింది. అందరి లాగే తమకు కూడా ఏవైనా చిరు వ్యాపారాలు పెట్టుకోవడానికి ఆర్థిక సాయం పనికి వస్తుందని అంచనా వేసుకున్నారు. కానీ తెలంగాణ ప్రభుత్వం ఆదిలోనే పెద్ద మెలిక పెట్టింది. రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఏడాది కేవలం 27 వేల మందికి మాత్రమే ఈ ఆర్థిక సాయం అందిస్తామని స్పష్టం చేసింది. ఈ ఆర్థిక సంవత్సరానికి రూ.270 కోట్ల బడ్జెట్ రిలీజ్ చేసింది. అంత వరకు మాత్రమే లబ్దిదారులను ఎంపిక చేయాలని అధికారులకు కూడా ఆదేశాలు ఇచ్చింది. మిగిలిన వారికి వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి దశల వారీగా ఈ పథకం అమలు చేస్తామని చెబుతోంది.
కాగా, దీనిపై మైనార్టీ వర్గాలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. కేవలం ఎన్నికల్లో లబ్ది పొందడానికే ఆర్భాటంగా ఈ పథకాన్ని ప్రకటించారని.. కొంత మందికి ఇచ్చి పథకం అమలు చేస్తున్నట్లు ప్రకటించుకోవడానికి ఇలా చేస్తున్నారని విమర్శిస్తున్నారు. దళిత బంధు విషయంలో కూడా ఇదే జరిగిందని వారు గుర్తు చేస్తున్నారు. తొలి విడత దళిత బంధు తర్వాత.. ఇప్పటి వరకు రెండో విడత ఎవరికీ అందించలేదనే విషయాన్ని వారు ప్రస్తావిస్తున్నారు.
మరోవైపు రాష్ట్ర దశాబ్ది వేడుకల సందర్భంగా ప్రకటించిన కుల వృత్తుల ఆర్థిక సాయం ఇంకా అందనే లేదు. నిధుల కొరత కారణంగానే లబ్దిదారులకు పంపిణీ చేయడంలో ఆలస్యం అవుతోందని చెబుతున్నారు. ప్రభుత్వం వద్ద నిధులు లేకపోతే.. మరి కొత్తగా మైనార్టీలకు ఆర్థిక సాయం అంటూ ప్రకటించడం ఎందుకని ప్రశ్నిస్తున్నారు. మొత్తానికి సీఎం కేసీఆర్ ఇటీవల పలు పథకాలను ఆర్భాటంగా ప్రకటిస్తున్నా.. వాటి అమలు మాత్రం సక్రమంగా లేదని..లబ్దిదారులు వాటిపై ఆశలు పెట్టుకొని ఎదురు చూసినా ఫలితం లేకుండా పోతోందనే విమర్శలు వస్తున్నాయి.