1970లో తొలిసారి పూతుపల్లి నుంచి 1970లో అసెంబ్లీకి ఎన్నికయ్యారు. అదే నియోజకవర్గం నుంచి 12 సార్లు ఎమ్మెల్యేగా విజయం సాధించారు.
సీనియర్ కాంగ్రెస్ నాయకుడు, కేరళ మాజీ సీఎం ఊమెన్ చాందీ మంగళవారం తెల్లవారుజామున మృతి చెందారు. కొంత కాలంగా ఆయన గొంతు క్యాన్సర్‌తో బాధపడుతున్నారు. దీనికి సంబంధించి కేరళలో చికిత్స కూడా తీసుకున్నారు. అయితే మెరుగైన వైద్యం కోసం కొన్నాళ్లుగా బెంగళూరులోని ఒక ప్రైవేటు ఆసుపత్రిలో చేరారు. కాగా, పరిస్థితి విషమించడంతో మంగళవారం తెల్లవారుజామున ఊమెన్ చాందీ మృతి చెందారు. ఈ విషయాన్ని ఆయన కుమారుడు చాందీ ఊమెన్ తన ఫేస్‌బుక్ అకౌంట్ ద్వారా తెలియజేశారు.
ఊమెన్ చాందీ మృతి పట్ల కేరళ కాంగ్రెస్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. కేరళ పీసీసీ అధ్యక్షుడు సుధాకరన్.. సంతాపం వ్యక్తం చేశారు. చాందీ మరణం కాంగ్రెస్ పార్టీకి తీరని లోటని పేర్కొన్నారు. పార్టీ ఒక గొప్ప నాయకుడిని కోల్పోయిందని తెలిపారు. ఈ మేరకు ట్వీట్ చేశారు. కేరళ సీఎం పినరయ్ విజయన్ కూడా ఊమెన్ చాందీ మరణం పట్ల విచారం వ్యక్తం చేశారు. వారి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు. తామిద్దరం విద్యార్థి దశ నుంచే వేర్వేరు పార్టీలో ఉద్యమాలు చేశాము. కానీ, ఇద్దరి మధ్య మంచి స్నేహం ఉండేదని తెలిపారు. ఇద్దరం ఒకేసారి అసెంబ్లీకి ఎన్నికైన విషయాన్ని గుర్తు చేశారు. ప్రజలకు దగ్గరగా ఉండే నాయకుల్లో ఊమెన్ చాందీ ఒకరని పేర్కొన్నారు.
ఊమెన్ చాందీ 1943 అక్టోబర్ 31న కొట్టాయం జిల్లాలోని కుమరకోమ్ గ్రామంలో జన్మించారు. విద్యార్థి దశలోనే కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఒక నిబద్ధత కలిగిన కార్యకర్తగా అంచెలంచెలుగా ఎదిగారు. ఊమెన్ చాందీ పని తీరే ఆయనను పార్టీ అధినాయకత్వానికి దగ్గర చేసింది. యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఉన్నప్పుడే అసెంబ్లీ టికెట్ ఇచ్చింది. 1970లో తొలిసారి పూతుపల్లి నుంచి 1970లో అసెంబ్లీకి ఎన్నికయ్యారు. అదే నియోజకవర్గం నుంచి 12 సార్లు ఎమ్మెల్యేగా విజయం సాధించారు. తన జీవితంలో ఏనాడూ ఆయన కాంగ్రెస్ పార్టీని వీడలేదు.
1977లో కే.కరుణాకరన్ కేబినెట్‌లో తొలిసారి మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. కేరళ ఆర్థిక మంత్రిగా ఊమెన్ చాందీకి మంచి పేరు వచ్చింది. ఇక 2004-06, 2011-16 వరకు రెండు దఫాలుగా కేరళకు సీఎంగా పని చేశారు. ఊమెన్ చాందీకి భార్య మరియమ్మ, పిల్లలు మరియా ఊమెన్, చాందీ ఊమెన్, అచ్చు ఊమెన్ ఉన్నారు.