తెలంగాణలో భారతీయ జనతా పార్టీ (బిజెపి) పరిస్థితి అయోమయంగా తయారయ్యింది. ఆ పార్టీ సీనియర్ నాయకులే పదేపదే పార్టీ నాయకత్వంపై బాణాలు వేస్తుండటం ఆపార్టీ అగ్
తెలంగాణలో భారతీయ జనతా పార్టీ (బిజెపి) పరిస్థితి అయోమయంగా తయారయ్యింది. ఆ పార్టీ సీనియర్ నాయకులే పదేపదే పార్టీ నాయకత్వంపై బాణాలు వేస్తుండటం ఆపార్టీ అగ్రనాయకత్వానికి మింగుడుపడటం లేదు. రాష్ట్ర నాయకత్వంలో ఒక వర్గం తిరుగుబాటు కారణంగా బండి సంజయ్‌ను పదవి నుండి తప్పించి, అతని స్థానంలో జి కిషన్ రెడ్డిని నియమించాలని జాతీయ నాయకత్వం నిర్ణయించిన తర్వాత, ఆ పార్టీ సీనియర్ నాయకులు ఎం రఘునందన్ రావు, ఎపి జితేందర్ రెడ్డిల ఆడియో, వీడియో క్లిప్‌లు పార్టీని మళ్లీ దిగజార్చాయి.
మొదటిది దుబ్బాక ఎమ్మెల్యే ఎం. రఘునందన్‌రావు ఇటీవల ఢిల్లీ పర్యటనకు వెళ్ళినప్పటి ఆడియో క్లిప్. మునుగోడు ఉప ఎన్నిక కోసం పార్టీ రూ. 100 కోట్లకు పైగా ఖర్చు చేసిందని, అయితే ఎన్నికల్లో ఓడిపోయిందని మీడియా ప్రతినిధులతో ఇంటరాక్షన్ సందర్భంగా రఘునందన్ వెల్లడించారు. ఆయన ఈ వార్తను ఖండించినప్పటికీ, ఆడియో క్లిప్ మాత్రం వైరల్‌గా మారింది.
”రూ.100 కోట్లు ఖర్చు చేసినా మునుగోడు ఉప ఎన్నికలో పార్టీ విజయం సాధించలేకపోయింది. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రాజీనామా చేసి ఎన్నికలకు వెళ్లాలని అమిత్ షా కోరారు. అమిత్ షా ‘చాణక్య’ నైపుణ్యం ఎక్కడ పోయింది? ఆయన దుబ్బాకకు రాలేదు. నేను సొంతంగా పోల్‌లో గెలిచాను, ”అని రఘునందన్ రావు మాట్లాడిన మాటల ఆడియో క్లిప్ బీజేపీ నాయకౌలకు నిద్రపట్టనివ్వడంలేదు.
మరోవైపు, పలువురు బీజేపీ నాయకులను గేదెలతో పోలుస్తూ, వాళ్ళను ఓ వీడియోతో యజమాని తన్నినట్టుగా తన్నాలని జితేందర్ రెడ్డి సోషల్ మీడియాలో చేసిన పోస్ట్ ఆ పార్టీలో తుఫానును సృష్టించింది. ఆయన అక్కడితో ఆగలేదు. ఒక తెలుగు న్యూస్ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో బీజేపీ, ప్రజాప్రతినిధులను కొనుగోలు, అమ్మకాల గురించి మాట్లాడారు. 2021లో హుజూరాబాద్ ఉప ఎన్నిక సందర్భంగా ఈటల రాజేందర్ అందరు సర్పంచ్‌లు, మండల పరిషత్ ప్రాదేశిక నియోజకవర్గం (ఎంపీటీసీ), జిల్లా ప్రజాపరిషత్ ప్రాదేశిక నియోజకవర్గాల (జెడ్పీటీసీ) సభ్యులందరినీ కొనుగోలు చేసి ఢిల్లీకి తరలించారని రెడ్డి వెల్లడించారు. అయితే అందులో ఎన్నికల నాటికి ఒక్కరు కూడా మిగలలేదని జితేందర్ రెడ్డి అన్నారు.
‘‘నేను హుజూరాబాద్ ఎన్నికల ఇన్‌చార్జిని అయ్యే సమయానికి ఈటల కొన్న సర్పంచ్‌లు, ఎంపీటీసీ, జెడ్పీటీసీ సభ్యులందరూ మరో పార్టీలోకి జంప్ అయ్యారు. నియోజకవర్గంలో ఒక్కరు కూడా మిగలలేదు’’ అని అన్నారు.
సోషల్ మీడియా నెట్‌వర్క్‌లలో విస్తృతంగా షేర్ అవుతున్న ఈ రెండు క్లిప్‌లు కాషాయ పార్టీకి చాలా ఇబ్బందికరంగా మారాయి. బీజేపీ దళితులపై వివక్ష చూపిస్తోందని ఆరోపణలు కూడా వస్తున్నాయి.బీజేపీకి చెందిన మరో సీనియర్ నాయకుడు ఎ. చంద్రశేఖర్ , శనివారం వరంగల్‌లో ప్రధాని నరేంద్ర మోదీ బహిరంగ సభకు తనకు పాస్ కూడా ఇవ్వలేదని ఆరోపించారు. అంతే కాదు ఆయన ఏకంగా తన విమర్శలను ప్రధాని మోడీపైకే ఎక్కుపెట్టారు. బీఆరెస్ అవినీతి ఆరోపణలు చేసిన మోడీ మరి చర్యలు ఎందుకు తీసుకోవడం లేదని ప్రశ్నించారు. ఈ విధంగా చంద్రశేఖర్ ఒక్కసారి స్వంత పార్టీపై విరుచుకపడటంతో ఆయనను కలిసి బుజ్జగించడానికి ఈటల రాజేందర్ చంద్రశేఖర్ ఇంటికి పరిగెత్తారు. డ్యామేజ్ కంట్రోల్ చేయడానికి ఆయన ప్రయత్నించారు. అయితే, ఈటల మిషన్ విఫలమైందని సమాచారం. చంద్రశేఖర్ త్వరలో బిజెపిని విడిచిపెట్టి కాంగ్రెస్‌లోకి వెళ్లబోతున్నట్టు తెలుస్తోంది.
మరో వైపు బీజేపీ ఒకరిపై ఒకరు చేసుకున్న ఆరోపణలు ఇతర పక్షాలకు ఆయుధాలుగా మారాయి. “ఒక తెలంగాణ బీజేపీ ఎమ్మెల్యే తన పార్టీ ఉప ఎన్నికల్లో రూ.100 కోట్లు ఖర్చు చేసిందని బహిరంగంగా చెబుతున్నప్పుడు ఈసీ, ఈడీ, ఐటీ ఎక్కడ ఉన్నాయి? బీజేపీకి నోటీసులు జారీ చేస్తారా లేదా విచారణ చేస్తారా?” అని మంత్రి కేటీఆర్ ప్రశ్నించారు.