రాజ్యాంగం ప్రకారం ప్రధాని అయినా సామాన్యుడైనా ఒక్కటే…..ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేను కృష్ణ అభిమానిని.. ఇప్పుడు నేనే స్టార్.. తెలంగాణ బాధ్
రాజ్యాంగం ప్రకారం ప్రధాని అయినా సామాన్యుడైనా ఒక్కటే…..ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి
- నేను కృష్ణ అభిమానిని.. ఇప్పుడు నేనే స్టార్..
- తెలంగాణ బాధ్యత నాదే..
- అజ్‌తక్ చర్చా వేదికలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి
ఢిల్లీ:
భారత రత్న బాబా సాహెబ్ అంబేడ్కర్ అందించిన రాజ్యాంగం ప్రకారం దేశ ప్రధానమంత్రి అయినా… సామాన్యుడికైనా ఒకే చట్టమని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. పుష్ప – 2 బెన్‌ఫిట్ షోకు తమ ప్రభుత్వం అనుమతించిందని ఆయన తెలిపారు. ఢిల్లీలో అజ్‌తక్ వార్తా సంస్థ శుక్రవారం రాత్రి నిర్వహించిన చర్చావేదికలో సీఎం పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఒక ప్రశ్నకు సీఎం స్పందిస్తూ పుష్ప-2 సినిమా ప్రదర్శించిన థియేటర్ వద్ద ఎలాంటి ఏర్పాటు లేకుండానే… హీరో అల్లు అర్జున్ అక్కడికి వెళ్లడంతో తొక్కిసలాట జరిగి ఒక మహిళ చనిపోయిందని, ఆమె కొడుకు 13 రోజులుగా కోమాతో మృత్యువుతో పోరాడుతున్నారని సీఎం తెలిపారు. ఈ ఘటనలో క్రిమినల్ కేసులు నమోదు చేసిన తెలంగాణ పోలీసులు థియేటర్ యాజమాన్యం సహా పలువురిని అరెస్ట్ చేశారన్నారు. పది రోజు ల తర్వాత అల్లు అర్జున్ ఇంటికి పోలీసులు వెళ్లరని, ఆయన పోలీసులతో కలిసి పోలీస్ స్టేషన్ కు వెళ్లారని సీఎం తెలిపారు. అనంతరం పోలీసులు హీరోను కోర్టులో హాజరుపర్చితే కోర్టు బెయిల్ మంజూరు చేసిందన్నారు. హీరో అరెస్టు పై ప్రశ్నిస్తున్నారని ఈ ఘటనలో ఒక ప్రాణం పోయిందనే విషయం అంతా గుర్తించాలన్నారు. ఒక మహిళ మరణించిన తర్వాత కూడా కేసులు పెట్టకపోతే, ప్రజలు ఎలా స్వాగతిస్తారని ప్రశ్నించారు. తమ పాలనలో ‘సీనిమా హీరో కు ఒక రాజ్యాంగం, సామాన్యుడికి మరో రాజ్యాంగమా? ’ అనే చర్చ మొదలవుతుందన్నారు. క్రైం చేసింది ఎవరన్నదే తమకు ముఖ్యమని… ఆ నేరస్తులు సినీ స్టారా? పొలిటికల్ స్టార్ నా? అన్నది తమకు అవసరం లేదన్నారు. హీరో అల్లు అర్జున్ ఒక సామాన్యుడిలా కార్ లో వెళ్లి సినిమా చూసి వెళ్లిపోతే అసలు సమస్యే ఉండేది కాదన్నారు. అలా కాకుండా కారు ఎక్కి చేతులు ఊపి ఫ్యాన్స్ లో గందరగోళం సృష్టించడంతో పరిస్థితులు అదుపుతప్పి తొక్కిసలాట చోటుచేసుకుందన్నారు. ఈ కేసులో అల్లు అర్జున్ ను ఏ 11 గుర్తించినట్లు చెప్పారు. మరి మహిళ మరణానికి కారణం ఎవరు తీసుకుంటారని సీఎం ప్రశ్నించారు. బాధిత కుటుంబానికి ఎవరు సమాధానం ఇస్తారని, 9 ఏండ్ల బాబు చావుబతుకులతో పోరాడుతున్నాడని వివరించారు. ఇందులో ప్రభుత్వం, పోలీసుల బాధ్యత ఏదో మీరే చెప్పాలన్నారు. ‘సొంతగా అది అల్లు అర్జున్ చిత్రం. ఆయన కావాలంటే స్టూడియోలో స్పెషల్ షో కూడా చూడవచ్చు. ఇంట్లో హోం థియేటర్లో కూడా చూడవచ్చు.’ అని అన్నారు. అలా కాకుండా ప్రజల్లోకి వెళ్లి చూడాలంటే పోలీసులకు సమాచారం ఇవ్వాలని లేదా అక్కడ ఏర్పాటు చేసిన మేనేజ్‌మెంట్‌కు సహకరించాలని సూచించారు. ఎవరికి సమాచారం లేకుండా సీఎంగా తాను కూడా ఏదైనా కార్యక్రమానికి హాజరైతే తనపై కూడా కేసు నమోదు చేసే అవకాశం ఉంటుందని సీఎం తెలిపారు.
- అల్లు అర్జున్ తన పేరు మరిచిపోయినందుకు అరెస్ట్ చేశారనే వార్తల్లో నిజం లేదని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. అల్లు అర్జున్ చిన్నప్పటి (బచ్‌పన్) నుంచి తనుక తెలుసునన్నారు. మెగాస్టార్ చిరంజీవికి అల్లు అర్జున్ మేనల్లుడని… ఆ చిరంజీవి కాంగ్రెస్ పార్టీ నేత అని చెప్పారు. అల్లు అర్జున్ మామ చంద్ర శేఖర్ రెడ్డి కాంగ్రెస్ నేతేనన్నారు. చంద్ర శేఖర్ రెడ్డి తరపున అల్లు అర్జున్ తనకు బంధువు అవుతారన్నారు. చుట్టరికం, తెలుసనే బంధాలతో పట్టింపు లేదని, ఈ వ్యవహారంలో పోలీసులు చట్టాన్ని అనుసరించారని సీఎం తెలిపారు. సీఎంగా, హోం మంత్రిగా రాష్ట్రంలో శాంతి భద్రతల సమస్య వచ్చినప్పుడు నివేదికను పోలీస్ శాఖ నుంచి కోరడంలో తప్పేముందని ఆయన ప్రశ్నించారు. చట్ట ప్రకారం ఎవరైనా ఆందోళన చేయొచ్చని, అనుమతి లేకుండా ఆందోళనకు దిగితే జైలు వెళ్లాల్సిందే అని హెచ్చరించారు.
- ‘ఒక వ్యక్తిని అరెస్ట్ చేసినందుకు ఇంతలా ప్రశ్నిస్తోన్న మీరు… ఒక మహిళ ప్రాణం పోయిందని కనీసం ఒక్క ప్రశ్న అడగడం లేదేమిటని యాంకర్ రాహుల్‌ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. మరణించిన మహిళ కుటుంబ ఆర్థిక పరిస్థితి, 11 రోజులుగా కోమాలో ఉండి, చావు బతుకుల మధ్య ఉన్న ఆమె కొడుకు గురించి కనీసం ఆలోచించడం లేదన్నారు. ‘ఫిల్మ్ స్టార్ కు సినిమా ఒక బిజినెస్ అన్నారు. డబ్బులు పెట్టి, డబ్బులు సంపాదించుకుంటారని చెప్పారు. అలాగే రియల్ ఎస్టేట్ వ్యాపారులు వెంచర్లు వేసి, అమ్ముకొని డబ్బులు సంపాదిస్తారన్నారు. అంతేకానీ పాకిస్థాన్ బార్డర్ కు వెళ్లి… దేశం కోసం గెలిచి వచ్చారా?. సినిమా తీసారు. పైస సంపాదించారు.’ అని ప్రశ్నించారు. ఇందులో మీకు, మాకు ఏం వస్తుందని ప్రశ్నించారు. ఆ సమయంలో కార్యక్రమంలో పాల్గొన్న ఆహుతులు సీఎం కు మద్దతుగా చప్పట్లతో హర్షం తెలిపారు.
- తాను వ్యక్తిగతంగా సూపర్ స్టార్ కృష్ణ అభిమానినని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఓ ప్రశ్నకు సమాధానం ఇచ్చారు. అయితే ఆయన ఇప్పుడు లేరని తెలిపారు. ప్రస్తుతం ఎవరి అభిమాని అని యాంకర్ ప్రశ్నించగా ఏ స్టార్ లేరని, తానే సొంతగా స్టార్ గా ఎదిగానని సీఎం తెలిపారు. తనకు అభిమానులున్నారని తెలిపారు.
- హర్యానా, మహారాష్ట్ర ఎన్నికల్లో కాంగ్రెస్ ఓటమిపై ప్రశ్నలను ఆ రాష్ట్ర నేతలనే అడగాలని సీఎం సూచించారు. ఆ రాష్ట్రాల్లో ఎన్నికలను తాను దూరం నుంచి చూశానని చెప్పారు. తెలంగాణ రాష్ట్రానికి తాను బాధ్యత వహిస్తానని, దేశం మొత్తానికి తానెలా బాధ్యత తీసుకోగలని సీఎం ప్రశ్నించారు. మహారాష్ట్ర, హర్యానా గురించి తాను స్టడీ చేయలేదని, మరోసారి ఇలాంటి ప్రొగ్రాంకు పిలిస్తే స్టడీ చేసి వస్తానని సీఎం అనడంతో ఒక్కసారిగా అంతా నవ్వులు కురిపించారు. తాజా ఎన్నికల్లో ఓటమిపై పార్టీ అగ్రనేత రాహుల్ తో పోస్ట్ మార్టం చేస్తే బాగుంటుంది కానీ… ఆజ్ తక్ సీనియర్ జర్నలిస్ట్ రాహుల్ కన్వల్ తో పోస్ట్ మార్టం చేస్తే ఏం బాగుంటుందని యాంకర్‌పై వ్యంగ్యస్త్రాలు సంధించారు.
- దేశం, రైతులు, వివిధ వర్గాల అభివృద్ధి కోసం పాటుపడని బీజేపీ అసలు అజెండాను ప్రజల ముందు పెట్టాలన్నారు. బీజేపీ చెప్పేది ఒక్కటైతే, చేసేది మరొకటని సీఎం విమర్శించారు. ఈ తేడాను ప్రజలకు అర్థమయ్యేలా తీసుకెళ్లాలని పార్టీ శ్రేణులకు సూచిస్తానన్నారు. ఆ అంశమే తెలంగాణ, కర్ణాటకలో కాంగ్రెస్ విజయానికి సహకరించిందని వివరించారు. తనకన్నా ముందు తాను కూర్చొన్న సీట్లో గెస్ట్ గా కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ కుర్చున్నారని, ఆయన మూడు సార్లు మధ్య ప్రదేశ్ సీఎంగా ఉన్నారని గుర్తుచేశారు. మోదీ ప్రభుత్వం తెచ్చిన మూడు నల్ల చట్టాలకు వ్యతిరేకంగా ఢిల్లీ సరిహద్దుల్లో దాదాపు 16 నెలలు రైతులు ఆందోళన చేశారని సీఎం గుర్తు చేశారు. ఈ రైతు ఉద్యమం లో 750 మంది ప్రాణాలు అర్పించారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆ బాధిత కుటుంబాలను కలిసేందుకు కూడా మోదీ ఒక్క సారి ప్రయత్నం చేయలేదన్నారు. ఆ పనులేం చేయకుండా నల్ల చట్టాలను వెనక్కి తీసుకుంటున్నట్లు ప్రకటించి, క్షమాపణల పేరుతో ఓట్లు అడుకున్నారని సీఎం రేవంత్ రెడ్డి విమర్శించారు. కేంద్ర మంత్రి కొడుకు యూపీలో రైతులపై వాహనం ఎక్కించి చంపి హత్య చేసిన విషయం దేశ ప్రజలందరికీ తెలుసని సీఎం తెలిపారు. ప్రస్తుతం ఆ కేసు ఏమైందని సీఎం ప్రశ్నించారు. ఈ అసలైన బీజేపి రంగు, ముఖాన్ని ప్రజలకు తెలియజేస్తే చాలని… ప్రజలే ఆ పార్టీని ఓడిస్తారని, కాంగ్రెస్ ఓడించాల్సిన అవసరం లేదని సీఎం స్పష్టం చేశారు.
- స్విస్ బ్యాంక్ లోని నల్లధనం తెచ్చి ప్రతి పేద వాడి ఖాతాలో రూ.15 లక్షలు వేస్తానని 2013లో నరేంద్ర మోదీ ఇచ్చిన వాగ్దానం ఏమైందని సీఎం రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. అధికారంలోకి వచ్చి 11 ఏండ్లు పూర్తయినా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, బీజేపి సర్కార్ ఎందుకు నిలబెట్టుకోలేదని సీఎం నిలదీశారు. ఏడాది కాలంలో ఎంతో సమర్థంగా పాలిస్తున్న తమ ప్రభుత్వంపై మాత్రం ఇన్ని ప్రశ్నలు వేస్తున్నారని
యాంకర్‌కు చురకలు అంటించారు. 2022 వరకు దేశంలోని పేదలందరికీ పక్కా ఇళ్లు కట్టిస్తామని బీజేపీ చెప్పిందని, మరి ఎంత మంది పేదలకు కేంద్రం ఇళ్లు ఇచ్చిందో తెలపాలని సీఎం డిమాండ్ చేశారు. రైతుల ఆదాయం రెట్టింపు, ఏడాదిలో 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామన్న బీజేపీ హామీలు ఏమయ్యాయని సీఎం ప్రశ్నించారు. 11 ఏళ్లలో నరేంద్ర మోదీ ఒక్కసారి కాదు, మూడు సార్లు దేశ ప్రజలను మోసం చేశారని సీఎం విమర్శించారు. ప్రజాస్వామ్యాన్ని విశ్వసించే కాంగ్రెస్ ను ప్రశ్నించే గొంతులు, బీజేపీ హామీలపై గొంతు ఎందుకు విప్పవని సీఎం రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. - కేవలం తొలి పదినెలల్లో 25.35 లక్షల రైతు కుటుంబాలకు చెందిన రూ.21 వేల కోట్ల రుణాలను మాఫీ చేశామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. దేశంలోని బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఇలాంటి నిర్ణయం తీసుకుంటే చర్చకు రావాలని సీఎం సవాల్ విసిరారు. 75 ఏళ్ల స్వాతంత్య్ర దేశ చరిత్రలో ఇంత పెద్ద మొత్తంలో ఏ రాష్ట్ర ప్రభుత్వం, కేంద్రం ప్రభుత్వం కూడా రైతు రుణ మాఫీ చేయలేదని సీఎం అన్నారు. కనీస మద్దతు ధరతో పాటు ధాన్యానికి క్వింటాకు రూ. 500 ల బోనస్ ఇస్తున్నామని సీఎం తెలిపారు. ఏడాది కాలంలో తమ ప్రభుత్వం 55, 143 ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చిందని సీఎం చెప్పారు. ఏడాది కాలంలో రాష్ట్రంలోని మహిళల చేసిన ఉచిత బస్సు ప్రయాణాలకు గాను రాష్ట్ర ప్రభుత్వం ఆర్టీసీకి రూ. 4 వేల కోట్లు చెల్లించిందన్నారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంతో మెట్రో కు నష్టం వాటిల్లుతుందన్న విమర్శలను సీఎం ఖండించారు. హైదరాబాద్ సిటీలో కేవలం సెలెక్టెడ్ రూట్లలో 69 కి.మీటర్లు మెట్రో మార్గం ఉందన్నారు. మహిళలకు తెలంగాణవ్యాప్తంగా ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పించామన్నారు. ఇందులో ఎంతమంది మెట్రో లో వెళ్లకుండా ఆర్టీసీ లో ఉచిత ప్రయాణాలు చేస్తున్నారని ప్రశ్నించారు. ఈ విషయంలో మెట్రో చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ (సీఎఫ్ ఓ) రాజకీయ ప్రేరేపితులై ప్రకటన ఇచ్చారని సీఎం తెలిపారు. ఇతర పార్టీలతో కలిసి కాంగ్రెస్ ప్రభుత్వానికి చెడ్డపేరు వచ్చేలా వ్యవహరించారని, అందుకే ఆయనను అరెస్ట్ చేయాలని పోలీసులకు ఆదేశాలు ఇచ్చామన్నారు. దీంతో ఆయన ముంబయి వెళ్లిపోయాడని సీఎం తెలిపారు.
- రాహుల్, రేవంత్ ట్యాక్స్ (ఆర్ఆర్ ట్యాక్స్) పేరుతో ఆరోపణలు చేస్తోన్న నరేంద్ర మోదీ అందుకు ఒక్క ఆధారమైన చూపాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సవాల్ విసిరారు. బీజేపీ నేతగా ఆయన అలాంటి ఆరోపణలు చేస్తే బాగుండేది కానీ, దేశానికి ప్రధానమంత్రిగా ఉండి ఆ కామెంట్స్ చేయడం సరికాదని ముఖ్యమంత్రి అభిప్రాయపడ్డారు. ఎన్నికల టైంలో ఇలాంటి కామెంట్స్ తో ప్రజల్ని మభ్య పెట్టవద్దన్నారు. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ తనను హత్య చేసేందుకు పాకిస్తాన్, ఐఎస్ఐ ఉగ్రవాదులకు సుపారీ ఇచ్చారని వ్యాఖ్యానించడం మోదీ విజ్ఞతకే వదిలేస్తున్నట్లు సీఎం తెలిపారు. అది నిజమైతే దర్యాప్తు చేయాలే కానీ నిందలు వేయొద్దని సీఎం అన్నారు.