HomeTelanganaPolitics

కొయ్యూర్‌ ఎన్‌కౌంటర్‌కు పాతికేళ్లు…నేలరాలిన విప్లవ ధృవ తారలు..పీఎల్​జీఏ ఆవిర్భావం…2 నుంచి 9 వరకు వారోత్సవాలు

కొయ్యూర్‌ ఎన్‌కౌంటర్‌కు పాతికేళ్లు…నేలరాలిన విప్లవ ధృవ తారలు..పీఎల్​జీఏ ఆవిర్భావం…2 నుంచి 9 వరకు వారోత్సవాలు

కొయ్యూర్‌ ఎన్‌కౌంటర్‌కు పాతికేళ్లు… నేలరాలిన విప్లవ ధృవ తారలు అగ్రనేతల స్మారకంగా పీఎల్​జీఏ ఆవిర్భావం డిసెంబర్‌ 2 నుంచి 9 వరకు వారోత్సవాలు

పిఎల్ జి ఏ వార్షికోత్సవాలను విప్లవోత్సాహం తో జరుపుకుందాం..ప్రజలకు మావోయిస్టు పార్టీ పిలుపు
నాన్న ఆశయాలు కొనసాగిద్దాం -అమరుడు సాయిబాబా కూతురు మంజీరా
తెలంగాణ: ఏడుగురు మావోయిస్టు సానుభూతిపరుల అరెస్ట్

కొయ్యూర్‌ ఎన్‌కౌంటర్‌కు పాతికేళ్లు…

  • నేలరాలిన విప్లవ ధృవ తారలు
  • అగ్రనేతల స్మారకంగా పీఎల్​జీఏ ఆవిర్భావం
  • డిసెంబర్‌ 2 నుంచి 9 వరకు వారోత్సవాలు
  • అటవీ గ్రామాల్లో అలజడి
  • సరిహద్దుల్లో హై అలర్ట్

జయశంకర్‌ భూపాలపల్లి బ్యూరో (నినాదం):

భూమి, భుక్తి, తాడిత, పీడిత ప్రజల విముక్తి కోసం, సమ సమాజ స్థాపన కోసం ఆయుధం ఎత్తి అడవి బాట పట్టిన ఆ ముగ్గురు నేతలు నేలకొరిగి రెపటికి పాతికేళ్లు. అప్పటి పీపుల్స్​వార్ పార్టీలో అన్ని తామై పని చేసిన కేంద్ర కమిటీ సభ్యులు నల్లా ఆదిరెడ్డి అలియాస్ శ్యామ్, ఎర్రంరెడ్డి సంతోష్ రెడ్డి అలియాస్ మహేష్, ఉత్తర తెలంగాణ కార్యదర్శి శీలం నరేష్ 1999 డిసెంబర్ 2న ఉమ్మడి కరీంనగర్ జిల్లా (ప్రస్తుత జయశంకర్ భూపాలపల్లి జిల్లా) మంథని నియోజకవర్గంలోని మల్హర్ మండలం కొయ్యూరు అటవీ ప్రాంతంలో జరిగిన భారీ ఎన్​కౌంటర్​లో మరణించారు. ఈ ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. మావోయిస్టు పార్టీకి చెందిన ముగ్గురు నేతలు ఓకే ఘటనలో నేలకొరగడం ఆ పార్టీని తీవ్రంగా కుంగదీసింది. సీపీఐ మావోయిస్టు పార్టీ ఈ సంఘటనతో తీరని నష్టాన్ని చవిచూసింది. అయితే కొయ్యూరు మృతవీరుల పోరాటానికి చిహ్నంగా ఏర్పాటు చేసిన పీఎల్​జీఏ (పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీ) విప్లవోద్యమానికి రక్షణ కవచంగా నిలుస్తోంది.

విప్లవోద్యమ చరిత్రలో ఆ ముగ్గురు..
దేశ విప్లవోద్యమ చరిత్రలో సాయుధ కమ్యూనిస్టు పోరాట సిద్దాంతాన్ని ఆ ముగ్గురు నేతలు అగ్రభాగాన నిలిపారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలం కొత్తగట్టు కు చెందిన నల్లా ఆదిరెడ్డి విద్యార్థి దశ నుంచే విప్లవ రాజకీయాలకు ఆకర్షితుడై ఎమర్జెన్సీలో జైలుశిక్షను సైతం అనుభవించి బయటకు వచ్చిన తర్వాత అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. ఒక దశలో కేంద్ర కమిటీ కార్యదర్శి గణపతి స్థానానికి ఎదిగారు. ఉమ్మడి వరంగల్ జిల్లా దేవరుప్పుల మండలం కడవెండికి చెందిన ఎర్రంరెడ్డి సంతోష్ రెడ్డి ఎంటెక్ చదువుతూ విప్లవాల పోరు బాట పట్టి కేంద్ర కమిటీ సభ్యులుగా ఎదిగారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లా జగిత్యాలకు చెందిన శీలం నరేష్ పాలిటెక్నిక్ చదువుతూ పీపుల్స్ వార్ లో చేరారు. కొయ్యూరు వద్ద జరిగిన ఎన్​కౌంటర్​లో మరణించిన ముగ్గురు నేతలు కూడా పార్టీ నిర్మాణంలో కీలకంగా పని చేసిన వారే. గెరిల్లా దాడులు, ప్రజాస్వామ్య ఉద్యమ నిర్మాణంలో వీరి పాత్ర అత్యంత కీలకం అని చెప్పాలి. విముక్తి ప్రాంతంగా ప్రకటించే విధానాన్ని ఆదిరెడ్డి ప్రారంభించినట్లు ప్రచారంలో ఉంది.

అగ్రనేతల స్మారకంగా పీఎల్​జీఏ ఆవిర్భావం..
కొయ్యూరు ఎన్​కౌంటర్ జరిగిన తర్వాత ప్రతి ఏటా డిసెంబర్ 2 నుంచి వారం రోజుల పాటు మావోయిస్టు పార్టీ అమరవీరుల పీఎల్​జీఏ( పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ గెరిల్లా) వారోత్సవాల నిర్వహిస్తోంది. అగ్రనేతల మరణానంతరం 2000లో డిసెంబర్ 2 నుంచి వీరి ప్రాణత్యాగాలు కీర్తిస్తూ పీఎల్​జీఏ ఆర్మీని కూడా ఏర్పాటు చేశారు. వీరి త్యాగాన్ని గుర్తించిన పార్టీ వీరి స్మృత్యర్థం పెద్దపల్లి జిల్లా కమాన్‌పూర్ మండలం బేగంపేటలో 2004 నవంబర్ 13న మావోయిస్టులు స్మారక స్థూపాన్ని నిర్మించి కుటుంబ సభ్యుల చేతుల మీదుగా ఆవిష్కరించారు. దీంతో అమరవీరుల త్యాగాలు ఇక్కడ చిరస్మరణీయంగా నిలిచాయి.

మావోల కదలికలపై అప్రమత్తం..
తెలంగాణ–చత్తీస్​గఢ్ రాష్ట్ర సరిహద్దుల్లో మావోల కదలికలు కనిపిస్తున్న దృష్ట్యా సరిహద్దు ప్రాంతాల్లో పోలీసులు అప్రమత్తమయ్యారు. గత కొన్నేళ్లుగా ఈ ప్రాంతంతో మావోల కార్యకలాపాలు తగ్గిపోవడంతో అడవుల్లో వారోత్సవాలు జరగడం లేదు. గత పదేళ్ల కాలంలో ఎక్కడా మావోయిస్టుల కదలికలు కన్పించకపోగా ఇటీవలి కాలంలో రాష్ట్ర సరిహద్దు ప్రాంతాల్లో కదలికలు ఉండడంతో పోలీసులు అప్రమత్తమై జాగ్రత్త చర్యలు చేపడుతున్నారు. దీంతో సరిహద్దు ప్రాంతాలపై గట్టి నిఘా పెట్టి మావోయిస్టులు తెలంగాణలోకి అడుగుపెట్టకుండా చర్యలు చేపట్టారు. జయశంకర్​ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల సరిహద్దు అటవీ ప్రాంతంలో భారీ కూంబింగ్​ చేపట్టారు.

తెలంగాణాను షెల్టర్‌ జోన్‌గా..
గత కొన్నేండ్లుగా చత్తీస్​గఢ్​లో తమ కార్యకలాపాలను నిర్వహిస్తున్న మావోయిస్టు పార్టీ ఇటీవల అక్కడ నిర్బంధం పెరుగడంతో తెలంగాణాను షెల్టర్‌ జోన్‌గా మార్చుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. గత ఏడాది కాలంగా తెలంగాణాలోకి అడుగుపెట్టాలనే మావోయిస్టు ప్రయత్నాలను పోలీసులు భగ్నం చేస్తూనే ఉన్నారు. అయితే ములుగు జిల్లా వాజేడు మండలం పెనుగోలు కాలనీలో నవంబర్​ 22న అర్ధరాత్రి పోలీస్ ఇన్ఫార్మర్ల నెపంతో ఉయిక రమేష్​, ఉయిక అర్జున్ అనే ఇద్దరు అన్నదమ్ములైన గిరిజనులను మావోయిస్టులు గొడ్డళ్ళతో అతి కిరాతకంగా నరికి చంపారు. మావోయిస్టుల ఘాతకంతో ఏజెన్సీ ప్రాంతం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. వాజేడు మండల కేంద్రంలో ఒకే రోజు ఇద్దరు వ్యక్తులను మావోయిస్టులు హతమార్చడంతో ఏజెన్సీ ప్రాంతవాసులు భయభ్రాంతులకు గురవుతున్నారు.

వారోత్సవాలపై పోలీసుల అప్రమత్తం..
డిసెంబర్ 2 నుంచి 9వరకు కొయ్యూర్‌ ఎన్‌కౌంటర్‌లో మృతి చెందిన అగ్రనేతల త్యాగాన్ని స్మరిస్తూ నిర్వహించే వారోత్సవాలు ఘనంగా నిర్వహించాలని మావోయిస్టు పార్టీ పిలుపుతో తెలంగాణ పోలీసులు అప్రమత్తమయ్యారు. ఇప్పటికే జయశంకర్‌ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో మావోయిస్టు కదలికలు ఉన్నట్లు సమాచారం ఉండటంతో పోలీసులు అవసరమైన చర్యలు చేపట్టారు. ఈసారి తెలంగాణాలో పీఎల్‌జీఏ వారోత్సవాలు నిర్వహించే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు తెలియడంతో పోలీసులు అప్రమత్తమై ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా తగు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ప్రభావిత ప్రాంతంలోని రాష్ట్ర సరిహద్దు పోలీసు స్టేషన్లకు భారీ భద్రత కల్పించారు

అటవీ గ్రామాల్లో హై అలర్ట్..
పీఎల్‌జీఏ వారోత్సవాలు నేపథ్యంలో పోలీసులు అటవీ గ్రామాల్లో హై అలర్ట్ ప్రకటించినట్లు తెలుస్తోంది. మావోయిస్టులు ప్రతీకార చర్యలకు పాల్పడే అవకాశం ఉన్నట్లు ఇంటలిజెన్స్ వర్గాలు హెచ్చరించడంతో పోలీసులు ముందు జాగ్రత్త చర్యలు చేపట్టారు. గ్రామాల్లో వాహనాల తనిఖీలు ముమ్మరం చేశారు. కొత్త వ్యక్తులు కనబడితే అదుపులోకి తీసుకొని విచారించి వదిలేస్తున్నారు. ముఖ్యంగా చత్తీస్​గఢ్ నుంచి వలస వచ్చి నివాసముంటున్న గుత్తికోయలపై ఓ కన్ను పెట్టారు. గూడేలను తనిఖీలు చేస్తూ అప్రమత్తం చేశారు. యువత విప్లవోద్యమం వైపు మళ్లకుండా ప్రతి పోలీస్ స్టేషన్ పరిదిలోని యువకులకు అవగాహన కల్పిస్తున్నారు. రాష్ట్ర సరిహద్దుల్లోని గ్రామాలపై నిఘా పెట్టారు. వారోత్సవాల నేపథ్యంలో టార్గెట్లను అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

సరిహద్దు గ్రామాల్లో అలజడి..

మావోయిస్టు వారోత్సవాల నేపధ్యంలో సరిహద్దు గ్రామాల్లో అలజడి మొదలైంది. ఓ వైపు వారోత్సవాలు ఘనంగా నిర్వహించాలని మావోయిస్టులు వాల్‌ పోస్టర్లు, బ్యానర్లు, కరపత్రాలు వేస్తుంటే మరోవైపు మావోయిస్టులకు వ్యతిరేకంగా ఆదివాసీ యువజన సంఘం పేరుతో వాల్‌ పోస్టర్లు వెలువడంతో అటవీ గ్రామాల్లో భయానక వాతావరణం నెలకొంది. ములుగు జిల్లా వాజేడులో మావోయిస్టులకు వ్యతిరేకంగా వాల్‌పోస్టర్లు వెలువగా, భద్రాద్రి కొత్తగూడెంలో మావోయిస్టులు బ్యానర్లు ఏర్పాట్లు చేసి వారోత్సవాలను ఘనంగా నిర్వహించుకోవాలని పిలుపునివ్వడం సంచలనంగా మారింది. ఏక్షణాన ఏం జరుగుతుందోననే ఆందోళన అటవీ గ్రామాల ప్రజల్లో నెలకొంది.