10 నెలల్లో 50 వేల ఉద్యోగాలు *ఆర్థిక క్రమశిక్షణతొ గ్యారెంటీ పథకాల అమలు *మంథనిలో నిర్వహించిన ప్రజాపాలన విజయోత్సవాల్లో పాల్గొన్న మంత్రి శ్రీధర్ బా
10 నెలల్లో 50 వేల ఉద్యోగాలు
*ఆర్థిక క్రమశిక్షణతొ గ్యారెంటీ పథకాల అమలు
*మంథనిలో నిర్వహించిన ప్రజాపాలన విజయోత్సవాల్లో పాల్గొన్న మంత్రి శ్రీధర్ బాబు
*అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన మంత్రి
పెద్దపల్లి ప్రతినిధి,మంథని టౌన్, నవంబర్ 26
( నినాదం)
కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన పది నెలల్లో 50 వేల ఉద్యోగాలు ఇచ్చినట్లు ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు చెప్పారు. పదేళ్లుగా ఉద్యోగ అవకాశాలు లేక దిగాలు పడ్డ నిరుద్యోగ యువతకు ఆశలు నెరవేర్చమన్నారు.
మంగళవారం పెద్దపల్లి జిల్లా మంథని మండలంలో శ్రీధర్ బాబు పర్యటించారు. పిడబ్ల్యుడి రోడ్ నుంచి ఖానాపూర్ మీదుగా ఎల్ మడుగు వరకు రూ.7 కోట్లతో నిర్మించనున్న రహదారి,నాగారంలో రూ.20 లక్షలతో చేపట్టనున్న హెల్త్ సబ్ సెంటర్ నిర్మాణ పనులకు జిల్లా కలెక్టర్ శ్రీహర్ష తో కలిసి మంత్రి శ్రీధర్ బాబు శంకుస్థాపన చేశారు. మంథని శివ కిరణ్ గార్డెన్స్ లో నిర్వహించిన ప్రజాపాలన విజయోత్సవాల కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ
రాష్ట్రంలో ప్రజా ప్రభుత్వం ఏడాది కాలంలో సాధించిన విజయాలను చాటి చెప్పేం దుకు విజయోత్సవాలను నిర్వహిస్తున్నామన్నారు. ఎన్నికల సమయంలో హామీ ఇచ్చిన గ్యారెంటీలను ఆర్థిక క్రమశిక్షణతో అమలు చేస్తున్నామన్నారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనారిటీ విద్యార్థులు ఒకే చోట చదువుకునే విధంగా అడవి సోమనపల్లి ప్రాంతంలో 25 ఎకరాల విస్తీర్ణంలో యంగ్ ఇండియా సమీకృత గురుకుల నిర్మాణ పనులు చేపట్టామని మంత్రి గుర్తు చేశారు. రెండు లక్షల వరకు రుణాలున్న 22 లక్షల రైతులకు రూ. 18 వేల కోట్ల రుణ మాఫీ పూర్తి చేశామని, సన్న వడ్లకు 500 రూపాయల బోనస్ అందిస్తున్నామన్నారు. పెద్దపల్లి జిల్లాలో 500బోనస్ కింద ఇప్పటివరకు 20 కోట్ల పైగా నిధులు రైతుల ఖాతాలలో జమ చేశామ న్నారు. పెద్దపల్లి జిల్లాలో ఇప్పటి వరకు 17,000 మంది రైతుల నుంచి ధాన్యం కొనుగోలు చేసి రూ.236 కోట్ల నిధులు వారి ఖాతాలలో జమ చేశామన్నారు. అసలైన రైతులకు, కౌలు రైతులకు లబ్ధి చేకూర్చేలా త్వరలో రైతు భరోసా పథకం అమలు చేస్తామని మంత్రి తెలిపారు.
ప్రజా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మంథని లో స్పష్టమైన మార్పు కనిపించే విధంగా రాబోయే నాలుగు సంవత్సరాలు పని
చేస్తానన్నారు. మంథని -మంచిర్యాలను కలుపుతూ గోదావరి నది పై బ్రిడ్జి నిర్మాణానికి రూ.120 కోట్లు మంజూరు చేశామన్నారు. . మంథని పట్టణానికి బైపాస్ రోడ్డు,13 వార్డుల్లో సిమెంట్ రోడ్లు, డ్రైనేజీ సౌకర్యాలు కల్పిస్తున్నామని అన్నారు.
మంథని పట్టణంలో 40 మంది యువకులకు ఉపాధి కల్పిస్తూ చిన్న సాఫ్ట్వేర్ కంపెనీ ప్రారంభించామని, భవిష్యత్తులో మరిన్ని కంపెనీలు తీసుకువచ్చేందుకు కృషి చేస్తామన్నారు. రామగిరి క్షేత్రాన్ని 5 కోట్లతో అభివృద్ధి చేస్తామన్నారు. మంథని గౌతమి తీరంలో గోదావరి పుష్కరాల నిర్వహణకు
రూ. రెండు కోట్లతో అభివృద్ధి పనులు చేయనున్నట్లు తెలిపారు. మంథని ప్రాంతంలో 150 మంది మహిళ సంఘాలను పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దేందుకు ఇండస్ట్రియల్ పార్క్ ఏర్పాటు చేస్తామన్నారు.
బహుళ జాతి కంపెనీలకు అవసరమైన నైపుణ్యాలు మంథని ప్రాంత యువతకు అందించే దిశగా నైపుణ్య కేంద్రాన్ని త్వరలోనే ఏర్పాటు చేస్తామన్నారు. మంథని పట్టణంలో అంగన్వాడీ కేంద్రాలకు పక్కా భవనాలను నిర్మిస్తామన్నారు. త్వరలోనే ఇందిరమ్మ పథకం ద్వారా పేదలకు ఇస్తామన్నారు.
ఈ కార్యక్రమంలో అధికారులు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.