HomeTelanganaUncategorized

బోనస్‌ ఇస్తే ప్రతిపక్షాలకు మింగుడుపడుతలేదు…. మంత్రి సీతక్క

బోనస్‌ ఇస్తే ప్రతిపక్షాలకు మింగుడుపడుతలేదు…. మంత్రి సీతక్క

బోనస్‌ ఇస్తే ప్రతిపక్షాలకు మింగుడుపడుతలేదు…. అభివృద్ది ఫలాలు ప్రతి ఇంటికి చేర్చాలన్నదే లక్ష్యం జనవరి నుంచి సన్న బియ్యం పంపిణీ రాష్ట్ర మంత్ర

కాంగ్రెస్, సీపీఐ పొత్తు పొడిచింది
మల్కాజీగిరి ఎంపీగా పోటి చేయడానికి పట్టుబడుతున్న ఎమ్మెల్యే మల్లారెడ్డి
ముందుకు సాగుతున్న కాంగ్రెస్ , సమాజ్ వాదీ పార్టీల్ అమధ్య పొత్తు చర్చలు

బోనస్‌ ఇస్తే ప్రతిపక్షాలకు మింగుడుపడుతలేదు….

  • అభివృద్ది ఫలాలు ప్రతి ఇంటికి చేర్చాలన్నదే లక్ష్యం
  • జనవరి నుంచి సన్న బియ్యం పంపిణీ
  • రాష్ట్ర మంత్రి డా. దనసరి అనసూయ సీతక్క
  • రెండు జిల్లాల్లో మంత్రి విస్తృత పర్యటన

జయశంకర్‌ భూపాలపల్లి బ్యూరో, (నినాదం):

ఇచ్చిన మాటకు కట్టుబడి రైతులు పండించిన పంటలో సన్నరకానికి రూ.500బోనస్‌ ఇస్తుంటే ప్రతిపక్షాలకు మింగుడుపడటం లేదని రాష్ట్ర పంచాయతి రాజ్, గ్రామీణాభివృద్ధి, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్‌ దనసరి అనసూయ సీతక్క అన్నారు. మంగళవారం జయశంకర్‌ భూపాలపల్లి, ములుగు జిల్లాల్లో ఆమె విస్తృత పర్యటన చేపట్టారు. రెండు జిల్లాల్లో జరిగిన ప్రజాపాలన విజయోత్సవ సభలో ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ, ఆయా జిల్లాల కలెక్టర్‌లు రాహుల్‌ శర్మ, దివాకర టీఎస్‌లతో కలిసి పాల్గొన్నారు. అలాగే ములుగు మండల కేంద్రంలో పలు అభివృద్ది పనులకు శంఖుస్థాపనలు చేశారు. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ దేశానికి అన్నం పెట్టే రైతన్నల సంక్షేమానికి కాంగ్రెస పార్టీ ప్రభుత్వం కట్టుబడి ఉందని, ఎన్నికల హమీల్లో రైతురుణ మాఫీ చేశామని, సన్నరకానికి బోనస్‌ ఇస్తున్నామని, రాబోయే రోజుల్లో రైతుభరోసా ఇస్తామని ఆమె తెలిపారు. వ్యవసాయ రంగానికి పెద్దపీట వేసి రైతుల సంక్షేమానికి పాటుపడుతుంటే ప్రతిపక్షాలు జీర్ణించుకోలేక, ప్రభుత్వంపై అసత్య ఆరోపణలు చేస్తున్నారని ఆమె విమర్శించారు. ముఖ్యంగా ప్రభుత్వం అమలు చేసే ప్రతి అభివృద్ది ఫలాలను ప్రతి ఇంటికి చేర్చాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని ఆమె తెలిపారు. అంతేకాకుండా రాష్ట్ర ప్రభుత్వం మహిళల కోసం అనేక సంక్షేమ పథకాలు చేపడుతున్నట్లు తెలిపారు. డిసెంబర్ 9 నుండి మహిళలు హైదరాబాద్ లోని శిల్పకళా వేదికలో వ్యాపారాలు చేసుకునేందుకు అవకాశాలు కల్పించినట్లు తెలిపారు. గత ప్రభుత్వం ఇంటికో ఉద్యోగం అని చెప్పి ఊరుకో ఉద్యోగం కూడా ఇవ్వలేదని, కానీ కాంగ్రెస్‌ పార్టీ ప్రభుత్వం ఏడాదిలోపే 53 వేల ఉద్యోగాలు కల్పించిందన్నారు. నిరుపేదలకు ఇండ్లు మంజూరు చేసేందుకు ఇందిరమ్మ కమిటీలు వేసి ఇల్లు లేని నిరుపేదలను గుర్తిస్తున్నామని, మొదటి ప్రాధాన్యతగా వారికి ఇండ్లు ఇస్తామని మంత్రి పేర్కొన్నారు. ప్రతి నియోజకవర్గంలో నాణ్యమైన విద్యను అందించేందుకు అంతర్జాతీయ ప్రమాణాలతో సమీకృత మోడల్ పాఠశాలలు నిర్మించనున్నామని అన్నారు. గత పాలకులు చేసిన అప్పులకు కోట్ల రూపాయలు వడ్డీ కడుతూనే ప్రజలకు ఇచ్చిన మాటను నిలబెట్టినందుకు ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తుందని ఆమె పేర్కొన్నారు.

మరో మూడు పథకాలను అమలు చేస్తాం..

రానున్న రోజుల్లో మరో మూడు పథకాలు అమలు చేస్తామని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా, మహిళా శిశు సంక్షేమ శాఖల మంత్రి దనసరి అనసూయ సీతక్క అన్నారు. ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలన్నిటిని అమలు చేసి తీరుతామని, మహిళలు ఆర్థికంగా ఎదగడానికి ముఖ్యమంత్రి అనేక పథకాలను ప్రవేశపెడుతున్నారని తెలిపారు. ఇచ్చిన హామీలలో పలు పథకాలను ఇప్పటికే అమలు చేస్తున్నామని, రానున్న రోజులలో రైతు బంధు,
రైతు భరోసా, మహిళలకు 2500లు, పింఛన్ పెంపు పథకాలను అమలు చేయనున్నట్లు తెలిపారు. ఆర్టీసీ బస్సులలో మహిళలు ఉచితంగా ప్రయాణం చేయడం కొందరికి నచ్చడం లేదని, పేద మహిళలు ఆర్థికంగా నష్టపోకుండా ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యాన్ని ప్రభుత్వం ప్రవేశపెట్టిందని అన్నారు. రాష్ట్రంలోని అర్హులైన పేదలందరికీ జనవరి నుండి సన్న బియ్యం పంపిణీ చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని, సన్న వడ్లు పండించిన రైతులకు 500 రూపాయల బోనస్ సైతం ప్రభుత్వం అందిస్తున్నదని అన్నారు. ఇప్పటికే 18 వేల కోట్ల రూపాయలను రైతు రుణమాఫీ పథకంలో పంపిణీ చేశామని, రానున్న రోజులలో మరో 10 వేల కోట్ల రూపాయలు కేటాయించి రుణమాఫీ కానీ రైతులకు అందిస్తామని అన్నారు. మహిళా సంఘాలకు ఆర్థికంగా ఎదగడానికి పలు రకాల వ్యాపారులు చేసుకోవడానికి ప్రభుత్వం ప్రోత్సహిస్తున్నదని, ఇటీవల కాలంలో 150 బస్సులను మహిళా సంఘాలకు కేటాయించడం జరిగిందని వివరించారు. గత పాలకులు చేసిన అప్పులకు వడ్డీలు కడుతూనే సంక్షేమ ఫలాలను అర్హులకు అందిస్తూ అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నామని తెలిపారు. రానున్న రోజులలో ప్రభుత్వ శాఖలలో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేస్తామని అన్నారు. రైతు భరోసా పథకంలో కూలి పనులు చేస్తున్న కూలీలకు సంవత్సరానికి 12 వేలు అందిస్తామని, ప్రతి ఇంట్లో మహిళలు బాగుంటేనే ఇల్లు, గ్రామము, దేశము బాగుంటుందని అన్నారు. రానున్న రోజులలో ఇంచర్ల గ్రామంలో ఐదు కోట్ల రూపాయలతో జిల్లా సమాఖ్య భవనాన్ని నిర్మిస్తామని, జిల్లా పర్యాటక ప్రాంతంగా పురోగతి చెందుతున్నదని దానికి అనుగుణంగా అభివృద్ధి పనులను చేపడుతున్నామని మంత్రి తెలిపారు.