ఉమ్మడి వరంగల్ జిల్లాలో మంత్రి కొండా సురేఖ చుట్టూ వివాదాలు ముసురుకున్నాయి. ఆమెను మంత్రి పదవినుంచి తొలగించాలనే డిమాండ్ తో ఆ జిల్లా కాంగ్రెస్ ఎమ్మెల్యేల
ఉమ్మడి వరంగల్ జిల్లాలో మంత్రి కొండా సురేఖ చుట్టూ వివాదాలు ముసురుకున్నాయి. ఆమెను మంత్రి పదవినుంచి తొలగించాలనే డిమాండ్ తో ఆ జిల్లా కాంగ్రెస్ ఎమ్మెల్యేలంతా ఏకమయ్యారు. ఇప్పటికే పార్టీ తెలంగాణ ఇంచార్జ్ దీపాదాస్ మున్షీ, పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిలకు సురేఖపై పిర్యాదులు చేసిన ఎమ్మెల్యేలు. ఇప్పుడు ఏకంగా ఢిల్లీ పెద్దల వద్దకు వెళ్ళేందుకు సిద్దమవుతున్నారు.
కొన్ని రోజుల క్రితం సమంత , నాగార్జునలపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసి వివాదం సృష్టించిన కొండా సురేఖపై అన్ని వైపుల నుండి విమర్శలు వచ్చాయి. పార్టీలో కూడా ఆమెపై వ్యతిరేకత రావడమే కాకుండా మంత్రి పదవి నుండి తొలగించాలని డిమాండ్లు వచ్చాయి. సురేఖపై నాగార్జున, కేటీఆర్ లు హైకోర్టులో పరువు నష్టం కేసులు కూడా వేశారు.
ఈ వివాదం చల్లారకముందే సురేఖ దసరా పండుగ రోజు తన స్వంత పార్టీ ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా పోలీస్ స్టేషన్‌లో చేసిన రచ్చ వరంగల్ జిల్లా పార్టీ నేతల్లో ఆగ్రహానికి కారణమయ్యింది. జిల్లాలోని ఎమ్మెల్యేలపై కొండా సురేఖ అజమాయిషీ చేస్తున్నారని, వారు ప్రాతినిథ్యం వహిస్తున్న నియోజకవర్గాల్లో జోక్యం చేసుకుని స్థానిక ఎమ్మెల్యేలకు వ్యతిరేకంగా కార్యకర్తలను కూడగడుతున్నారని అక్కడి నేతలు ఆరోపిస్తున్నారు. పార్టీ పరంగా పైచేయి సాధించేందుకు కావాలనే సొంత పార్టీ ఎమ్మెల్యేలను ఇబ్బంది పెడుతున్నారని వారు మండిపోతున్నారు. ఇప్పటికే కొందరు నాయకులు సురేఖ వ్యవహారాన్నిపార్టీ జాతీయ నాయకుడు కేసీ వేణుగోపాల్ దృష్టికి తీసుకెళ్లారు. అయినప్పటికీ సమస్య పరిష్కారం కాకపోవడంతో ఇప్పుడు ఎమ్మెల్యేలంతా ఢిల్లీకి వెళ్ళాలని నిర్ణయించుకున్నారట. ఇప్పటి వరకు ఎన్ని వివాదాలొచ్చినా సురేఖకు మద్దతుగా నిలబడ్డ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా చేతులెత్తేసినట్టు సమాచారం. దీంతో ఇక ఆమె మంత్రి పదవి ఊడటం ఖాయమని కాంగ్రెస్ వర్గాల్లో చర్చ నడుస్తోంది.