డాక్టర్లు, ఇంజనీర్లు అవ్వడానికి కోచింగ్ ఇచ్చే సెంటర్లకు పేరెన్నికగల రాజస్థాన్ లోని కోటా పట్టణం విద్యార్థుల ఆత్మహత్యలకు కూడా పేరు పొందింది. విద్యార్థ
డాక్టర్లు, ఇంజనీర్లు అవ్వడానికి కోచింగ్ ఇచ్చే సెంటర్లకు పేరెన్నికగల రాజస్థాన్ లోని కోటా పట్టణం విద్యార్థుల ఆత్మహత్యలకు కూడా పేరు పొందింది. విద్యార్థులు ఒత్తిడి తట్టుకోలేక ఆత్మహత్యలు చేసుకోవడం అక్కడ సర్వసాధారణమై పోయింది. ఒక్క కరోనా సమయంలో పిల్లలు ఇళ్ళల్లో ఉన్నప్పుడు తప్ప అక్కడ విద్యార్థుల ఆత్మహత్యలు జరగని సంవత్సరం లేదు.
విద్యార్థులు తమ రూం లలోని ఫ్యాన్లకు ఉరి వేసుకొని చనిపోతున్నారు కాబట్టి. అలా జరగకుండా పాత ఫ్యాన్లను మార్చేసి సాగే గుణం గల స్ప్రింగ్ ఫ్యాన్లను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం ఆదెశించింది. ఇప్పుడు అక్కడ విద్యార్థుల గదుల్లో స్ప్రింగ్ ఫ్యాన్లను అమర్చారు.
రోగమొకటైతే మందు మరొకటి వేస్తే ఏమవుతుందో కోటాలో కూడా అదే జరిగింది. ఆదివారం నాడు మళ్ళీ ఇద్దరు పిల్లలు ఆత్మహత్య చేసుకున్నారు. 17 ఏళ్ళ మహారాష్ట్రకు చెందిన అవిష్కర్ శంబాజీ కస్లే తన కోచింగ్ ఇన్‌స్టిట్యూట్ భవనంలోని ఆరో అంతస్తు నుంచి ఆత్మహత్య చేసుకోగా, 18 ఏళ్ళ బీహార్‌కు చెందిన ఆదర్శ్ రాజ్ తన అద్దె అపార్ట్‌మెంట్‌లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.
ఈ ఇద్దరి మరణంతో ఈ సంవత్సరం ఈ 8 నెలల్లో 23 మంది విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకొని చనిపోయారు. 2022లో 15 మంది ఆత్మహత్యలు చేసుకున్నారు. డిసెంబర్ 2022 అత్యంత ఘోరమైన నెల, ఒకే రోజులో ముగ్గురు విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకున్నారు. COVID-19 మహమ్మారి తర్వాత ఆత్మహత్యల సంఖ్య 60% పెరిగిందని డేటా చూపిస్తుంది. అయితే, కోవిడ్ మహమ్మారి సమయంలో 2019 , 2020లో విద్యార్థులు తమ ఇళ్ళ దగ్గరే ఉండటంతో ఒక్క ఆత్మహత్య కూడా జరగలేదు.
2018లో 12 మంది, 2021లో తొమ్మిది మందితో పోలిస్తే 2017లో 10 మంది విద్యార్థులు తమ జీవితాలను ముగించారు.
కోటా మెడికల్ కాలేజీలోని సైకియాట్రీ విభాగం అధిపతి డాక్టర్ భరత్ సింగ్ షెకావత్ మాట్లాడుతూ, విద్యార్థుల మరణాలను అరికట్టడానికి కోచింగ్ ఇన్‌స్టిట్యూట్లు, తల్లిదండ్రులు ఆలోచించే విధానంలో సమగ్ర మార్పు రావాలని అన్నారు.
“కోటాలో విద్యార్థుల ఆత్మహత్యల సంఖ్య ఈ సంవత్సరం అత్యధికం. మేము 20 సంవత్సరాలుగా రాజస్థాన్ ప్రభుత్వానికి సూచనలు అందిస్తున్నాము, కానీ ఎటువంటి చర్యలు తీసుకోలేదు” అని డాక్టర్ షెకావత్ చెప్పారు.
“COVID-19 లాక్‌డౌన్ సమయంలో, విద్యార్థులు వారి కుటుంబాలతో కలిసి ఉన్నారు. ఇంట్లో ఉన్నందున వారిపై ఎటువంటి ఒత్తిడి లేదు. అయితే, లాక్‌డౌన్ తర్వాత ఆ ఒత్తిడి తిరిగి ప్రారంభమైంది.” అన్నారాయన
“15 లేదా 16 సంవత్సరాల వయస్సులో కోచింగ్ ఇన్‌స్టిట్యూట్‌లలో చేరిన విద్యార్థులు చాలా చిన్నవారు. వారు పాఠ్యేతర కార్యకలాపాలు, స్నేహం వంటి ప్రయోజనాలను కోల్పోతారు. కఠినమైన కోచింగ్ షెడ్యూల్ కారణంగా వారు చాలా ఒత్తిడికి గురవుతారు. ” అని షెకావత్ విశ్లేషించారు.
“కోచింగ్ ఇన్‌స్టిట్యూట్లు, కోచింగ్ పరిశ్రమను కూడా నియంత్రించాలి. ఇన్‌స్టిట్యూట్‌లు విద్యార్థులకు ఆరోగ్యకరమైన, సహాయక వాతావరణాన్ని అందించేలా చూసుకోవాలి” అని ఆయన అన్నారు.
ప్రతి సంవత్సరం, JEE , NEET వంటి పోటీ పరీక్షలకు సిద్ధం కావడానికి 2 లక్షల మంది విద్యార్థులు కోటకు తరలివెళుతున్నారు. ఇటీవల విద్యార్థుల ఆత్మహత్యలు పెరగడంతో, రాబోయే రెండు నెలల పాటు సాధారణ పరీక్షలను నిలిపివేయాలని అధికారులు కోచింగ్ ఇన్‌స్టిట్యూట్‌లను కోరారు.
పెరుగుతున్న ఆత్మహత్యల సంఖ్యను ఎదుర్కొనే ప్రయత్నంలో, కోటలోని అన్ని హాస్టళ్లలో మరియు పేయింగ్ గెస్ట్ (PG) వసతి గృహాలలో స్ప్రింగ్-లోడెడ్ ఫ్యాన్‌లను ఏర్పాటు చేశారు. హాస్టళ్లలోని బాల్కనీలు, లాబీల్లో విద్యార్థులు దూకి చనిపోకుండా ఉండేందుకు “యాంటీ సూసైడ్ నెట్స్” కూడా అమర్చుతున్నారు.
హాస్టల్ యాజమాన్యాలు తమ ప్రాంగణాన్ని ‘ఆత్మహత్యకు తావులేకుండా’ చేయాలనే లక్ష్యంతో నెట్‌లు, స్ప్రింగ్‌లోడెడ్ ఫ్యాన్‌లను అమర్చేందుకు కసరత్తు చేస్తున్నట్లు తెలిపారు.
విద్యార్థులు పై అంతస్తుల నుంచి దూకితే వారిని అడ్డుకునేందుకు అన్ని లాబీలు, బాల్కనీల్లో భారీ వలలు ఏర్పాటు చేశాం. ఈ వలలు 150 కిలోల వరకు బరువును కలిగి ఉంటాయి. విద్యార్థులు గాయపడకుండా చూసుకుంటాయి., అని హాస్టల్ యజమాని ఒకరు తెలిపారు.
అయితే స్ప్రింగ్ ఫ్యాన్లను ఏర్పాటు చేయడం, నెట్ లను ఏర్పర్చడం సమస్యకు పరిష్కారమా ? అసలు విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితులు లేకుండా చేయడం వైపు అటు ప్రభుత్వాలుకానీ, ఇటు కోచింగ్ సెంటర్లు కానీ ఎందుకు ఆలోచించడం లేదు.
ఇది ఒక్క కోటా సమస్యనే కాదు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లలో కూడా నారాయణ, చైతన్య లాంటి కాలేజీలలో పిల్లలు ఆత్మహత్యలు చేసుకోవడం సర్వసాధారణంగా మారింది. ఒత్తిడి లేని, భయం లేని చదువులు మన దేశంలో సాధ్యం కాదా ?