ఎన్నికలు దగ్గర అవుతున్న సమయంలో మరోసారి తెలంగాణ సెంటిమెంట్‌ను తెరపైకి తీసుకొని రావడంతో బీఆర్ఎస్ సక్సెస్ అయ్యిందనే చెప్పుకోచ్చు.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల దగ్గర పడుతుండటంతో అన్ని రాజకీయ పార్టీలు తమ వ్యూహాలకు పదును పెడుతున్నాయి. కాంగ్రెస్, బీజేపీ పార్టీలు గత 9 ఏళ్లుగా అధికార బీఆర్ఎస్ అవినీతిని ఎండగడుతున్నాయి. అలాగే అధికారంలోకి వస్తే సంక్షేమంపై మరింత ఖర్చు చేస్తామని కాంగ్రెస్ చెబుతోంది. ప్రభుత్వ శాఖల్లో ఉన్న ఖాళీలను పూర్తి స్థాయిలో భర్తీ చేస్తామని బీజేపీ చెబుతున్నది. దీంతో బీఆర్ఎస్ పార్టీ ఎలాంటి స్ట్రాటజీని ఎంచుకుంటుందనే ఆసక్తి ఏర్పడింది. రాజకీయాల్లో అపర చాణుక్యుడిగా పేరున్న కేసీఆర్.. తప్పకుండా ప్రతిపక్షాల ఎదురు దాటికి సరైన వ్యూహాన్ని సిద్ధం చేస్తారని అంచనా వేశారు.
కాగా, కేసీఆర్ అనూహ్యంగా మళ్లీ తెలంగాణా సెంటిమెంట్‌నే నమ్ముకున్నట్లు తెలుస్తున్నది. ఎన్నికలు రాగానే తెలంగాణ సెంటిమెంట్‌ను తెరపైకి తేవడం కేసీఆర్‌కు కొత్తేమీ కాదు. కానీ రాష్ట్రం ఏర్పడి 9 ఏళ్లు గడిచిపోయినా.. ఇంకా అదే సెంటిమెంటుపై ఆధారపడటంపై బీఆర్ఎస్‌లోనే ఒక వర్గం వ్యతిరేకిస్తున్నట్లు తెలుస్తున్నది. ఇటీవల టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి టార్గెట్‌గా గులాబీ పార్టీ పలు విమర్శలు చేసింది. వీరిద్దరూ పక్కా సమైక్యవాదులంటూ బీఆర్ఎస్ నాయకులు విమర్శలు ఎక్కుపెట్టారు. సీఎం కేసీఆర్ నుంచి అందిన సూచనతోనే బీఆర్ఎస్ నాయకులు మళ్లీ తెలంగాణ సెంటిమెంట్‌ను తెరపైకి తెచ్చినట్లు చర్చ జరుగుతోంది.
రేవంత్ రెడ్డికి చంద్రబాబు గురువైతే.. కిషన్ రెడ్డికి కిరణ్ కుమార్ రెడ్డి మార్గదర్శి అంటూ విమర్శలు చేశారు. దొరికిందే ఛాన్స్ అనుకొని కాంగ్రెస్, బీజేపీ అధ్యక్షులపై సమైక్యవాదుల ముద్ర వేసేందుకు ప్రయత్నిస్తున్నారు. కాంగ్రెస్, బీజేపీలో ఏది గెలిచినా.. తెలంగాణ తిరిగి సమైక్యవాదుల చేతుల్లోకి వెళ్తుందంటూ జోరుగా ప్రచారం చేస్తున్నారు. ఏకంగా మంత్రి హరీశ్ రావే ఈ ప్రచారాన్ని మొదలు పెట్టడంతో దానికి బీఆర్ఎస్ నాయకులు గళం కలిపారు. ఎక్కడికక్కడ సమైక్యవాద ప్రచారాన్ని తెరపైకి తెస్తున్నారు. తెలంగాణ తిరిగి ఆంధ్ర పాలకుల చేతుల్లోకి వెళ్తుందంటూ ప్రజలను భయపెట్టే ప్రయత్నం చేస్తున్నారు.
కాంగ్రెస్, బీజేపీ కుటిలయత్నాలకు చెక్ పెట్టాలంటే ఇలాంటి సెంటిమెంటే వర్కవుట్ అవుతుందని బీఆర్ఎస్ అధిష్టానం కూడా భావిస్తోంది. రాబోయే ఎన్నికల్లో ఈ రెండు పార్టీలకు గట్టి కౌంటర్ తెలంగాణ సెంటిమెంటే అని డిసైడ్ అయ్యింది. అయితే, తెలంగాణ ఇచ్చిందే కాంగ్రెస్ అని ఆ పార్టీ నాయకులు అంటున్నారు. సోనియా గాంధీనే లేకపోతే తెలంగాణ వచ్చేదా అని ప్రశ్నిస్తున్నారు. తెలంగాణ ప్రజల ఆకాంక్షలను నెరవేర్చింది కాంగ్రెస్ మాత్రమే అని.. ఏపీలో పార్టీ నాశనం అవుతుందని తెలిసినా.. ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు చేసిందని గుర్తు చేస్తున్నారు.
ఇక బీజేపీ కూడా తాము తెలంగాణ ఏర్పాటుకు మద్దతు ఇచ్చినట్లు చెబుతున్నారు. ఒక ఓటు రెండు రాష్ట్రాలు అనే నినాదంతో కాకినాడ డిక్లరేషన్ కూడా చేసినట్లు గుర్తు చేస్తున్నారు. బీజేపీ ఆనాడు తెలంగాణకు అనుకూలంగా పార్లమెంటులో ఓటు వేసిన విషయాన్ని ప్రస్తావిస్తున్నారు. మొత్తానికి ఎన్నికలు దగ్గర అవుతున్న సమయంలో మరోసారి తెలంగాణ సెంటిమెంట్‌ను తెరపైకి తీసుకొని రావడంతో బీఆర్ఎస్ సక్సెస్ అయ్యిందనే చెప్పుకోచ్చు.