HomeTelanganaPolitics

బీజేపీ కేంద్రప్రభుత్వ నియంతృత్వ పోకడలను ప్రతిఘటించండి.

బీజేపీ కేంద్రప్రభుత్వ నియంతృత్వ పోకడలను ప్రతిఘటించండి.

బీజేపీ కేంద్రప్రభుత్వ నియంతృత్వ పోకడలను ప్రతిఘటించండి. దక్షిణాది రాష్ట్రాలపై, బలవంతంగా హిందీని రుద్దుతున్న కేంద్రం యూజీసీ నూతన నిబంధనల రద్దు కో

కొయ్యూర్‌ ఎన్‌కౌంటర్‌కు పాతికేళ్లు…నేలరాలిన విప్లవ ధృవ తారలు..పీఎల్​జీఏ ఆవిర్భావం…2 నుంచి 9 వరకు వారోత్సవాలు
మావోయిస్టుల దాడిలో చనిపోయిన పోలీసులు 35 మంది కాదు నలుగురే – అధికారుల ప్రకటన‌
ఇద్దరు ఇన్ఫార్మర్లను చంపేసిన మావోయిస్టులు

బీజేపీ కేంద్రప్రభుత్వ నియంతృత్వ పోకడలను ప్రతిఘటించండి.

దక్షిణాది రాష్ట్రాలపై, బలవంతంగా హిందీని రుద్దుతున్న కేంద్రం

యూజీసీ నూతన నిబంధనల రద్దు కోసం పోరాడండి.

‘హిందూరాష్ట్ర’ (హిందూదేశం) ఏర్పాటుకు వ్యతిరేకంగా విశాల ప్రజా ఉద్యమాన్ని నిర్మించండి.

       మావోయిస్టు పార్టీ పిలుపు

జాతీయ విద్యావిధానం-2020ని అమలు చేయాలనే పేరుతో బ్రాహ్మణీయ హిందుత్వ ఫాసిస్టు ఆర్ఎస్ఎస్-బీజేపీ కేంద్ర ప్రభుత్వం హిందీయేతర రాష్ట్రాల్లో ముఖ్యంగా దక్షిణాది రాష్ట్రాల్లో హిందీని బలవంతంగా రుద్దడానికి పూనుకుందని,జాతీయ విద్యావిధానంలో భాగంగా త్రిభాషా సూత్రాన్ని అమలుచేసే పేరుతో హిందీయేతర రాష్ట్రాలపై ముఖ్యంగా దక్షిణాది రాష్ట్రాల్లో పాఠశాల విద్యలో మూడోభాషగా హిందీని తప్పనిసరిగా బోధించాలని కేంద్రప్రభుత్వం ఒత్తిడి కి పోరాడుతూ విశాల ప్రజా ఉద్యమాన్ని నిర్మించాలని మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ అధికార ప్రతినిధి అభయ్ ప్రజలకు పిలుపునిచ్చారు. త్రిభాషా సూత్రాన్ని అంగీకరించి అమలు చేయాలని తమిళనాడు ప్రభుత్వాన్ని కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ఒత్తిడి తేవడం ప్రజాస్వామికమని ఆయన తన ప్రకటనలు తెలిపారు

(ప్రకటన యధాతధం)

త్రిభాషా సూత్రాన్ని అనుసరించి తమిళనాడులో పాఠశాల విద్యలో హిందీని మూడో భాషగా బోధించడానికి డీఎంకే ప్రభుత్వం, అక్కడి పౌరసమాజం అంగీకరించడం లేదు. దీంతో సర్వశిక్షా అభియాన్ కింద ఆ రాష్ట్రానికి ఇవ్వాల్సిన 2 వేల కోట్ల రూపాయల నిధుల్ని ఇవ్వకుండా కేంద్రప్రభుత్వం ఆపివేసింది. ఇది ఆ రాష్ట్ర ప్రభుత్వాన్ని బెదిరించే నియంతృత్వ చర్యే. దీంతో, తమిళభాషకు, రాష్ట్రానికి, ప్రజలకు నష్టం కలిగించే చర్యలను అనుమతించబోమనీ, కేంద్రం సర్వశిక్షా అభియాన్ నిధుల్ని ఇవ్వనప్పటికీ లొంగేది లేదనీ తాము ద్విభాషా సూత్రానికే కట్టుబడి ఉంటామనీ, హిందీని బలవంతంగా రుద్దితే ఊరుకోబోమని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎం.కే. స్టాలిన్ స్పష్టం చేసాడు. ఇదే సందర్భంగా, ఇతర రాష్ట్రాల ప్రజలనుద్దేశించి హిందీ కారణంగా గత వందేళ్లల్లో 25 భాషలు కనుమరగయ్యాయనీ, తమిళనాడుకు అలాంటి స్థితి రాకూడదనే హిందీ భాషను బలవంతంగా రుద్దడాన్ని ప్రతిఘటిస్తున్నామనీ, జాతిని, సంస్కృతిని నాశనం చేయడానికి భాషలపై దాడి చేస్తున్నారని స్టాలిన్ కేంద్రప్రభుత్వ నియంతృత్వ పోకడలను విమర్శించాడు. దీంతో దక్షిణాది రాష్ట్రాలపై బీజేపీ కేంద్రప్రభుత్వం బలవంతంగా హిందీని రుద్దడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

2025, జనవరి 6న యూజీసీ రాష్ట్ర విశ్వవిద్యాలయాల ఉపకులపతుల (వైస్ ఛాన్సలర్ల) నియామక అంశంపై, ఉన్నత విద్యకు సంబంధించిన కొన్ని అంశాలపై కొన్ని నూతన మార్గదర్శకాలను / నిబంధనలను ప్రతిపాదించింది. ఈ నిబంధనల ప్రకారం-రాష్ట్ర విశ్వవిద్యాలయాలకు పరిశ్రమల అధిపతులను, ప్రభుత్వ ఉన్నతాధికారులను (బ్యురాక్రాట్స్ ను), బయటి వ్యక్తులను నియమించవచ్చు. ప్రస్తుతం మూడు సంవత్సరాలుగా ఉన్న ఉపకులపతుల పదవి కాలాన్ని ఐదు సంవత్సరాలకు పెంచింది. ప్రస్తుతం ఉపకులపతులను ఎంపిక చేసే సెర్చ్ కమ్ సెలెక్షన్ కమిటీల నియామకంలో కీలకపాత్రను పోషిస్తున్న రాష్ట్ర ఉన్నత విద్యాశాఖకు ఇకపై ఈ ప్రక్రియలో ఏ రకమైన పాత్ర ఉండదు. అంటే రాష్ట్ర ప్రభుత్వాలతో సంబంధం లేకుండానే రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాల ఉపకులపతుల నియామక అధికారం గవర్నర్ల చేతుల్లోకి వెళుతుంది. ఉన్నత గ్రేడ్ సంపాదించలేని విశ్వవిద్యాలయాలకు ప్రోత్సాహకాలు ఉండవు. అండర్ గ్రాడ్యుయేట్ స్థాయిలోని బీఏ, బీకాం, బీఎస్సీ లాంటి కోర్సుల ప్రవేశానికి ప్రవేశ పరీక్షలు నిర్వహించాలన్న ప్రతిపాదన అమలవుతే పేద విద్యార్థులు ఉన్నత విద్యకు దూరమవుతారు. ఆన్ లైన్ కరస్పాండెంట్ కోర్సులకు అనుమతులు ఇవ్వరాదనే నిబంధన అమలవుతే లక్షలాది విద్యార్థులకు నష్టం జరుగుతుంది.

యూజీసీ నూతన ప్రతిపాదనలను తమిళనాడు రాష్ట్ర అసెంబ్లీ వ్యతిరేకిస్తూ తీర్మానం చేసింది. కర్నాటకలో జరిగిన బీజేపీయేతర రాష్ట్ర ప్రభుత్వాల విద్యాశాఖ మంత్రుల సమావేశం యూజీసీ రెగ్యులేషన్స్ 2020 లోని 15 అంశాల అమలును నిలిపివేయాలని కోరుతూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ కు తీర్మానాన్ని పంపింది. ఇటీవల కేరళ రాష్ట్రంలోని తిరువనంతపురంలో జరిగిన దక్షిణాది రాష్ట్ర విద్యాశాఖ మంత్రుల సమావేశం యూజీసీ నూతన ప్రతిపాదనలను తీవ్రంగా వ్యతిరేకించింది. యూజీసీ నూతన నిబంధనల ముసాయిదాను విరమించుకోవాలని తెలంగాణ విద్యా కమిషన్ కేంద్ర విద్యాశాఖ మంత్రికి తీర్మానాన్ని పంపింది.

త్రిభాషా సూత్రం పేరుతో దక్షిణాది రాష్ట్రాలపై, హిందీయేతర రాష్ట్రాలపై హిందీని బలవంతంగా రుద్దడం గానీ, యూజీసీ నూతన నిబంధనలు గానీ ఇవి విడివిడి ఘటనలు కావు. ఇవి, బ్రాహ్మణీయ హిందుత్వ ఫాసిస్టు ఆర్ఎస్ఎస్-బీజేపీ కేంద్రప్రభుత్వం నిర్మించ తలపెట్టిన ‘హిందూరాష్ట్ర (హిందూదేశం) నిర్మాణంలో భాగం. 2014లో కేంద్రంలో అధికారంలోకి వచ్చినప్పటి నుండి బీజేపీ ప్రభుత్వం ఈ ప్రజావ్యతిరేక, పీడిత సాంఘిక సముదాయాల వ్యతిరేక, పీడిత జాతుల వ్యతిరేక దుష్టపథకం అమలు కోసం అనేక మోసకారి విధానాలను, పథకాలను రూపొందించి, దౌర్జన్యంగా అమలుచేస్తూ వస్తోంది. అందులో భాగంగానే అది వన్ నేషన్ (ఒకే దేశం)-వన్ రేషన్ కార్డు-వన్ పవర్ గ్రిడ్-వన్ టాక్స్ (జీఎస్టీ)-వన్ పోలీస్-వన్ లాంగ్వేజ్ (హిందీని రుద్దడం) -వన్ సివిల్ కోడ్ (కామన్ సివిల్ కోడ్)- వన్ ఎలక్షన్ (ఒకే ఎన్నిక)-ఏక్ భారత్-శ్రేష్ట్ భారత్ పేరుతో అది నినాదాల్ని, విధానాలను రూపొందించింది. చివరికి హిందూమతాధారిత దేశంగా (హిందూ థియోక్రటిక్ స్టేట్) దేశాన్ని మార్చనున్నారు. అంటే దేశ రాజ్యాంగాన్ని మార్చివేసి దానిస్థానంలో ఆధునిక మనుస్మృతిని నిలబెడతారు. ఈ నిజాన్ని మరుగు పర్చడానికే 2047 నాటికి ‘వికసిత్ భారత్’ (అభివృద్ధి చెందిన దేశం)ను నిర్మిస్తామని మోసపూరిత నినాదాలు ఇస్తున్నారు.

దేశాన్ని ‘హిందూరాష్ట్ర’గా మార్చడమంటే 1857 నుండి మొదలై కొనసాగుతున్న ప్రజాస్వామిక విప్లవంలో భాగంగా సామ్రాజ్యవాదులకు, దానికి ఊడిగం చేసే దళారీ పెట్టుబడిదార్లకు, భూస్వామ్య వర్గాలకు వ్యతిరేకంగా పోరాడి దేశంలోని పీడిత ప్రజలు, పీడిత సాంఘిక సముదాయాలు (మహిళలు, దళితులు, ఆదివాసీలు, మతమైనారిటీలు), పీడితజాతులు సాధించుకున్న అన్నిరకాల హక్కుల్ని, అధికారాల్ని కోల్పోవడమే. అందులో భాగమే త్రిభాషా సూత్రం పేరుతో హిందీయేతర రాష్ట్రాలపై, ముఖ్యంగా దక్షిణాది రాష్ట్రాలపై హిందీని రుద్దడం, యూజీసీ నూతన నిబంధనలు, డీలిమిటేషన్ వగైరాలు. వీటన్నింటి ద్వారా బ్రాహ్మణీయ హిందుత్వ ఫాసిస్టు ఆర్ఎస్ఎస్-బీజేపీలు హిందూ మెజారిటేరియన్ స్టేట్ ను (దేశంలో హిందువులు మెజారిటి అనే పేరుతో వారికే దేశంపై అధికారం ఉండాలని చెపుతూ, మతమైనారిటీలకు అధికారాన్ని నిరాకరించడం). హిందువులు కాని మతమైనారిటీల పట్ల మతాధారిత వివక్షతను రాజ్యాంగబద్దం చేసే వివక్షపూరిత రాజ్యాన్ని (అపార్టీడ్ స్టేట్ ను), స్థానిక సంస్థలకు, రాష్ట్రాలకు అధికారాలను నిరాకరించి కేంద్రప్రభుత్వం చేతుల్లోనే అన్నిరకాల అధికారాలను కేంద్రీకృతం చేసే నియంతృత్వ కేంద్రీకృతరాజ్యాన్ని (ఆటోక్రటిక్ యూనిటరీ స్టేట్ ను) నిర్మించనున్నారు. అందుకే ‘హిందూరాష్ట్ర’ అంటే అది కేవలం సామ్రాజ్యవాదుల, దళారీ నిరంకుశ పెట్టుబడిదార్ల, భూస్వాముల దోపిడీ ప్రయోజనాలను కాపాడడానికి ఉద్దేశించినదే. అది దేశంలోని ప్రజలందరికీ వ్యతిరేకం, అది మహిళ, దళిత, ఆదివాసీ, మతమైనారిటీలకు వ్యతిరేకం, పీడిత జాతులన్నింటికి వ్యతిరేకం. అది సమాఖ్య (ఫెడరల్) వ్యవస్థకు వ్యతిరేకం. అందుకే హిందూరాష్ట్ర నిర్మాణాన్ని అడ్డుకోవడంలో భాగంగా త్రిభాషా సూత్రాన్ని హిందూయేతర రాష్ట్రాలపై, ముఖ్యంగా దక్షిణాది రాష్ట్రాలపై రుద్దడానికి వ్యతిరేకంగా ప్రజా ఉద్యమాల్ని నిర్మించాలి. యూజీసీ నూతన నిబంధనల రద్దును డిమాండ్ చేస్తూ ప్రజా ఉద్యమాన్ని నిర్మించాలి.

బ్రిటిష్ వ్యతిరేక స్వాతంత్ర్యోద్యమ కాలం నుండి భారతదేశ ప్రజలు సామ్రాజ్యవాదులకు, దళారీ నిరంకుశ పెట్టుబడిదార్లకు, భూస్వామ్య వర్గాలకు వ్యతిరేకంగా అనేక పోరాటాలు చేసిన ఫలితంగా, రాజ్యాంగంలో భారత దోపిడీ పాలకవర్గాలు కొన్ని ప్రజానుకూల అంశాలను పొందుపర్చక తప్పలేదు. అలాగే 1947, ఆగస్టు 15 నాటి అధికార మార్పిడి అనంతరం ప్రజలు చేసిన అనేక పోరాటాల ఫలితంగా కొన్ని ప్రజానుకూల చట్టాలు రూపొందాయి. కేంద్రంలో, రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న పార్టీలు అన్నీ వాటి దోపిడీ వర్గానుకూల స్వభావం రీత్యా వీటిని చిత్తశుద్ధితో అమలు చేయలేదు. వాటిని నీరుకారుస్తూ వచ్చాయి. అయితే 2014 నుండి కేంద్రంలో అధికారంలోకి వచ్చిన బీజేపీ మాత్రం ‘హిందూరాష్ట్ర’ ఏర్పాటు దుష్టపథకంలో భాగంగా రాజ్యాంగంలోని, చట్టాల్లోని ప్రజానుకూల అంశాలన్నింటిని భూస్థాపితం చేయడానికి పూనుకుంది. అందుకే రాజ్యాంగంలోని, చట్టాల్లోని ప్రజానుకూల అంశాల పరిరక్షణకు (8 గంటల పనిదినం, కౌలుదార్ల రక్షణ చట్టాలు, వెట్టిచాకిరి నిర్మూలన, ఆదివాసుల హక్కులను గుర్తించే 5వ షెడ్యూల్, గ్రామసభ, అటవీ హక్కుల చట్టం (ఎస్ఆర్ఎ), 6వ షెడ్యూల్: ఎస్.సీ., ఎస్.టీ., ఓబీసీలకు, మహిళలకు రిజర్వేషన్లు వగైరా) ఉద్యమించాల్సిన అవసరం ఉంది. అందులో భాగంగానే విద్యా, వైద్యం తదితర రంగాల్లో ప్రజల అధికారాలను కాపాడే, రాష్ట్రాల అధికారాలను కాపాడే సమాఖ్య (ఫెడరల్) వ్యవస్థ పరిరక్షణ కోసం ఉద్యమించాల్సిందిగా యావత్తు దేశ ప్రజానీకానికి విజ్ఞప్తి చేస్తున్నాం. ‘హిందూరాష్ట్ర’ ఏర్పాటుకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా విశాల ప్రజా ఉద్యమాన్ని నిర్మించాల్సిందిగా యావత్తు ప్రజానీకానికి పిలుపునిస్తున్నాం.

ఈ సందర్భంగా, దోపిడీ వర్గాలు తమ ప్రయోజనాల పరిరక్షణ కోసమే భారత రాజ్యాంగాన్ని రూపొందించుకున్నాయనే వాస్తవాన్ని, దోపిడీవర్గ రాజకీయ పార్టీలు ఏవైనా ప్రజల సమస్యలపై వీధుల్లోకి వచ్చినా అవి తమ రాజకీయ లబ్దికోసమేననే వాస్తవాన్ని మరువకూడదని ప్రజలకు గుర్తింపచేస్తున్నాం. వాటిని నమ్మి తమ పోరాటాన్ని మధ్యలో వదిలిపెట్టకుండా లక్ష్యసాధన కోసం దీర్ఘకాలిక పోరాటాలకు సిద్ధం కావాలని, నూతన ప్రజాస్వామిక విప్లవ విజయం కోసం పోరాడాలని ప్రజలకు పిలుపునిస్తున్నాం.

త్రిభాషా సూత్రం పేరుతో దక్షిణాది రాష్ట్రాలపై హిందీని రుద్దడానికి వ్యతిరేకంగా, యూజీసీ నూతన నిబంధనలకు వ్యతిరేకంగా నిరసన తెలియజేస్తున్న దక్షిణాది రాష్ట్రప్రభుత్వాల, వాటి పార్టీల వైఖరిని సమర్థిస్తున్నాం. ఇదే సందర్భంగా బీజేపీయేతర పార్టీలన్నింటికి, ప్రభుత్వాలన్నింటికి మేము ఒక విషయాన్ని స్పష్టం చేస్తున్నాం. కేవలం హిందీని వ్యతిరేకించే, యూజీసీ నిబంధనలను వ్యతిరేకించే, డీలిమిటేషన్ ను వ్యతిరేకించే మేరకే తమ నిరసనల్ని పరిమితం చేయకుండా ఆర్ఎస్ఎస్-బీజేపీల దుష్ట లక్ష్యమైన ‘విపక్ష్ ముక్త్’ (ప్రతిపక్షరహిత) భారత్ నిర్మాణానికి- ‘హిందూరాష్ట్ర ఏర్పాటుకు వ్యతిరేకంగా ప్రజలతో కలిసి ఉద్యమించాలని పిలుపునిస్తున్నాం. ‘మావోయిస్ట్ ముక్త్ భారత్’ పేరుతో బీజేపీ కేంద్రప్రభుత్వం కొనసాగిస్తున్న ‘కగార్’ దాడి అక్కడికే ఆగదు. అది, కార్పొరేటీకరణ-సైనికీకరణ-హిందుత్వ విధానాలను వ్యతిరేకించే ప్రతిపక్ష పార్టీలన్నింటిని ఆర్ఎస్ఎస్-బీజేపీలు అర్బన్ నక్సల్స్ గా, దేశద్రోహులుగా చిత్రీకరించి దాడిచేసి విపక్ష్ ముక్త్ భారత్ ను-హిందూరాష్ట్రను ఏర్పాటు చేసే వరకు కొనసాగుతుంది. అందుకే ‘కగార్’ దాడులను వ్యతిరేకించాల్సిందిగా కోరుతున్నాం.

అభయ్

అధికార ప్రతినిధి.

కేంద్ర కమిటీ

భారత కమ్యూనిస్టు పార్టీ (మావోయిస్టు)