ఆటోమోటివ్, విద్యుత్తు వాహనాల తయారీలో ఉపయోగించే మ్యాగ్నెటిక్, సెన్సర్లు, చిప్ ల తయారీలో దిగ్గజ సంస్థ అల్లెగ్రో మైక్రోసిస్టమ్స్ హైదరాబాద్ లో పరిశోధన, అ
ఆటోమోటివ్, విద్యుత్తు వాహనాల తయారీలో ఉపయోగించే మ్యాగ్నెటిక్, సెన్సర్లు, చిప్ ల తయారీలో దిగ్గజ సంస్థ అల్లెగ్రో మైక్రోసిస్టమ్స్ హైదరాబాద్ లో పరిశోధన, అభివృద్ధి (ఆర్ అండ్ డి) విభాగాన్ని ఏర్పాటు చేసేందుకు ముందుకొచ్చిందని ఐటీ, పరిశ్రమల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు వెల్లడించారు. శుక్రవారం నాడు అల్లెగ్రో కంపెనీ ప్రతినిధులతో ఎంఓయూ పూర్తి అయిన అనంతరం సచివాలయంలో మీడియా సమావేశంలో ఆయన ప్రసంగించారు.
ఈ సంస్థ పరిశోధన కేంద్రం ఏర్పాటు వల్ల 500 మంది ప్రతిభావంతులకు ఉద్యోగాలు లభిస్తాయని మంత్రి తెలిపారు. తెలంగాణాలో ఉన్న పారిశ్రామిక అనుకూల వాతావరణానికి సంతృప్తి చెందిన తర్వాత హైదరాబాద్ ను ఎంచుకున్నట్టు అల్లెగ్రో యాజమాన్యం తెలపడం హర్షదాయకమని శ్రీధర్ బాబు అన్నారు. అభివృద్ధి, పరిశోధన కేంద్రం ఏర్పాటులో ప్రభుత్వం అన్ని విధాల సహకరిస్తుందని ఆయన హామీ ఇచ్చారు. అల్లెగ్రో రాకతో రాష్ట్రంలో సెమీకండక్టర్ చిప్ ల తయారీ పరిశ్రమకు ఊతం లభిస్తుందని ఆయన పేర్కొన్నారు.
విద్యుత్తు వాహనాల సిగ్నల్ డిజైన్, వెరిఫికేషన్, వ్యాలిడేషన్ తో పాటు రోబోటిక్ ఆటోమేషన్ లో కూడా అల్లెగ్రా చిప్ లను రూపొందిస్తుందని వెల్లడించారు. బిఎండబ్ల్యు విద్యుత్తు కార్ల తయారీ సంస్థతో పాటు ఇవి రంగంలో బ్యాటరీల నిర్వహణ, పవర్ చిప్ ల తయారీలో ఈ సంస్థ అగ్రగామిగా ఉందని శ్రీధర్ బాబు తెలిపారు. కార్యక్రమంలో అల్లెగ్రో మైక్రోసిస్టమ్స్ సిఇఓ వినీత్ నర్గోల్వాలా, సీనియర్ విపి సుమన్ నారాయణ్, మరో సీనియర్ విపి మ్యాక్స్ గ్లోవర్ లు పాల్గొన్నారు.