తెలంగాణ మంత్రి కొండా సురేఖ జుగుస్సాకరమైన , బట్ట కాల్చి మీదేసే దుర్మార్గ దోరణి పట్ల సర్వత్రా వ్యతిరేకత వ్యక్తమవుతోంది. కేటీఆర్ ను విమర్శించే పేరుతో పల
తెలంగాణ మంత్రి కొండా సురేఖ జుగుస్సాకరమైన , బట్ట కాల్చి మీదేసే దుర్మార్గ దోరణి పట్ల సర్వత్రా వ్యతిరేకత వ్యక్తమవుతోంది. కేటీఆర్ ను విమర్శించే పేరుతో పలువురు హీరోయిన్లను తమ తగువులోకి లాగిన తీరు, ప్రజలకు సురేఖ పై ఉన్న సింపతీ కాస్తా వ్యతిరేకతగా మారింది. కేటీఆర్ పై ఎన్ని విమర్శలు చేసినా ఒకరిని ఒకరు ఎన్ని తిట్లు తిట్టుకున్నా అది రాజకీయనాయకులకు అలవాటే కాబట్టి జనం పట్టించుకోకపోయేవారు. కానీ అసలు వివాదంతో సంబంధం లేని సమంతను, నాగార్జున కుటుంబాన్ని, హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ ను ఇందులోకి లాగారు. వారి విషయంలో కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలకు ఎవరి వైపు నుంచి సమర్థింపు రాలేదు. పైగా అసహ్యం వేసింది. చివరికి ఆమె తన మాటలను ఉపసంహరించుకున్నట్టు ప్రకటించారు కానీ ఆమె మాటలను మాత్రం ఎవ్వరూ మర్చిపోరు.
ఇక సురేఖ చేసిన పనికి టాలీవుడ్ మొత్తం తిరగబడింది. చిరంజీవి, నాగార్జున, అమల, నాగ చైతన్య, అఖిల్, అల్లు అర్జున్, ఎన్టీఆర్, నాని, ఖుష్బు, హేమ, ప్రకాశ్ రాజ్, మంచు విష్ణు…. ఇలా ఒక్కరేమిటి టాలీవుడ్ మొత్తం ఉడికి పోయింది. నిజంగా ఇది మంచి పరిణామం. అయితే టాలీవుడ్ లో కాస్టింగ్ కౌచ్ జరుగుతోందని పలువురు సినీ తారలు బహిరంగంగా నోరు విప్పినా, రాష్ట్ర ప్రభుత్వం వేసిన కమిటీ ముందు అనేక మంది సినీ పెద్దల గుట్టు విప్పినా ఈ టాలీవుడ్ పెద్దలు ఎందుకు నోరు విప్పలేదు? సురేఖ మాటలకే ఇంత కోపం వచ్చిన వారికి టాలీవుడ్ పెద్దలు చేసిన దుర్మార్గ పనులకు కోపం ఎందుకు రాలేదు?