గత రెండు నెలలుగా తెలంగాణలో హైడ్రా చర్చనీయాంశమైంది. చెరువులు, నీటి వనరులను ఆక్రమించి నిర్మించిన అక్రమ కట్టడాలను కూల్చివేయడానికి కాంగ్రెస్ నేతృత్వంలోని
గత రెండు నెలలుగా తెలంగాణలో హైడ్రా చర్చనీయాంశమైంది. చెరువులు, నీటి వనరులను ఆక్రమించి నిర్మించిన అక్రమ కట్టడాలను కూల్చివేయడానికి కాంగ్రెస్ నేతృత్వంలోని తెలంగాణ ప్రభుత్వం హైడ్రాను ప్రవేశపెట్టింది. ఆగస్ట్‌లో నటుడు నాగార్జున ఎన్-కన్వెన్షన్‌ను కూల్చివేసిన తర్వాత హైడ్రా ను అందరూ పొగిడారు. అప్పట్లో, ప్రజలు దీనిని విప్లవాత్మక చర్యగా పేర్కొన్నారు. హైడ్రాను తెలంగాణలో గేమ్ ఛేంజర్ అని పేర్కొన్నారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఇతర కేబినెట్ మంత్రులు కూడా నీటి వనరులపై అక్రమంగా నిర్మాణాలు చేపట్టిన వారిని విడిచిపెట్టబోమని ప్రతిజ్ఞ చేశారు. అయితే ఒకనెలలోనే హైడ్రా పై పొగడ్తలు కాస్తా తిట్ల రూపం తీసుకున్నాయి. దీనికి కారణం హైడ్రా ఎన్నో ఏళ్ళుగా నివాసముంటున్న పేదల ఇళ్ళను కూల్చడమే. ఇళ్ళు కోల్పోయి రోడ్డున పడ్డ పేదలు రేవంత్ రెడ్డికి పెడుతున్న శాపనార్దాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
మాదాపూర్, కూకట్‌పల్లి, అమీన్‌పూర్‌లో కూల్చివేత డ్రైవ్‌లు హైడ్రాపై భారీ ఎదురుదెబ్బకు దారితీశాయి. సరైన ముందస్తు హెచ్చరికలు లేకుండా చాలా మంది పేదలు ఇళ్లను కోల్పోయారని ఆరోపించారు. ఏళ్ల తరబడి ప్రజలు నివాసముంటున్న ఇళ్లను కూల్చివేయలేదని హైడ్రా చెబుతున్నప్పటికీ, సోషల్ మీడియాలో పేదలు ఏడుస్తున్న వీడియోలు కథ మరో రకంగా ఉందని చెప్తున్నాయి
దీంతో హైడ్రాపై, కాంగ్రెస్ ప్రభుత్వంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తాయి. ప్రజలు రోడ్లపై బైఠాయించి నిరసనలు ప్రారంభించారు. మరోవైపు జరుగుతున్న నిరసనలపై రేవంత్ రెడ్డి మౌనంగా ఉన్నారు. మరోవైపు మంత్రులు భిన్నమైన ప్రకటనలు చేస్తూ కాంగ్రెస్ నేతలకు తమలో తామే స్పష్టత లేదన్నట్లుగా ప్రజలు భావిస్తున్నారు. ప్రతిపక్ష బీఆర్‌ఎస్ పార్టీ సోషల్ మీడియాలో బూటకపు ప్రచారం ద్వారా హైడ్రా గురించి ప్రజలను తప్పుదోవ పట్టిస్తోందని ఒక మంత్రి చెబుతుండగా, అలాంటి వీడియోలను రూపొందించడానికి బీఆర్‌ఎస్ ప్రజలకు డబ్బు ఇస్తోందని మరో మంత్రి పేర్కొన్నారు. మరోవైపు, ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ మాట్లాడుతూ పేదల జోలికి వెళ్లవద్దని, అవసరమైతే ప్రసాద్స్ ఐమాక్స్, జలవిహార్ వంటి నిర్మాణాలపై చర్యలు తీసుకుంటామని ఇప్పటికే అధికారులను హెచ్చరించినట్లు తెలిపారు. కాంగ్రెస్ నేతల ఈ విరుద్ధమైన ప్రకటనలు కాంగ్రెస్ పతనానికి దారితీస్తాయని ప్రజలు నమ్ముతున్నారు. ఇంత భారీ ఎదురుదెబ్బ తగిలిన తర్వాత కనీసం ఇప్పుడైనా ప్రభుత్వం హైడ్రాను పునర్నిర్మించాలని వారు ఆశిస్తున్నారు. లేకుంటే రేవంత్ రెడ్డికి, ఆయన కాంగ్రెస్ ప్రభుత్వానికి పెద్ద ఎదురుదెబ్బ తప్పదని భావిస్తున్నారు.