ఆ రెండు పార్టీలు తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయడం లేదు, ఆ రెండు పార్టీలకు తెలంగాణ రాజకీయాల్లో పెద్ద పాత్రే లేదు. నిజం చెప్పాలంటే స్థానం కూడా లే
ఆ రెండు పార్టీలు తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయడం లేదు, ఆ రెండు పార్టీలకు తెలంగాణ రాజకీయాల్లో పెద్ద పాత్రే లేదు. నిజం చెప్పాలంటే స్థానం కూడా లేదు. అయినా ఆ రెండు పార్టీల ఫ్యాన్స్ ప్రస్తుతం తెలంగాణ ఎన్నికల రాజకీయాల్లో చక్రం తిప్పే ప్రయత్నం చేస్తున్నారు.
ఏపీ రాజకీయాల్లో ఉప్పు నిప్పులా ఉన్న ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబులు ప్రస్తుతం తమ యుద్ద రంగాన్ని తెలంగాణకు మార్చారు. తెలంగాణ కొద్ది రోజుల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో తెలంగాణలో జీవిస్తున్న ఆంధ్రప్రదేశ్ కు చెందిన ఆ ఇద్దరి సామాజిక వర్గాలు రెండు పక్షాల వైపు మోహరించి ఢీ అంటే ఢీ అంటున్నాయి.
తెలంగాణ యుద్ద రంగంలో ఒకరు బీఆరెస్ పక్షాన నిలవగా మరొకరు కాంగ్రెస్ పక్షాన నిలిచారు. నాయకులెవ్వరూ బహిరంగంగా ఏమీ ప్రకటనలు చేయనప్పటికీ ఆయా సామాజిక వర్గాల ప్రజలు మాత్రం బహిరంగంగానే యుద్దం చేస్తున్నారు.
ఈ సారి ఎలాగైనా కేసీఆర్ ను ఓడించి కాంగ్రెస్ ను గద్దెనెక్కించాలన్న పట్టుదలతో ఏపీనుంచి వలసవచ్చిన, తెలంగాణలకు చెందిన కమ్మ సామాజిక వర్గం నడుం భిగించగా, మరో వైపు హైదరాబాద్ లో ఉంటున్న ఏపీ కి చెందిన వైఎస్ జగన్ సామాజిక వర్గం బీఆరెస్ ను మళ్ళీ గద్దెనెక్కించాలన్న పట్టుదలతో ఉన్నారు.
సోషల్ మీడియాలో అసలు బీఆరెస్, కాంగ్రెస్ టీంల కన్నా ఈ రెండు సామాజిక వర్గాల ప్రజల యుద్దమే ఎక్కువయ్యింది. కేసీఆర్ పై విమర్శలతో, సెటైర్లతో బాబు ఫ్యాన్స్, కాంగ్రెస్ పై, ముఖ్యంగా రేవంత్ రెడ్డిపై విమర్శలతో జగన్ ఫ్యాన్స్ వేలాది మీమ్స్, ఇమేజ్ లు, టెక్స్ట్ పోస్ట్ చేస్తున్నారు.
తెలంగాణలో కమ్మ సామాజిక వర్గానికి పెద్ద దిక్కైన తుమ్మల నాగేశ్వర్ రావు, కాంగ్రెస్ లో చేరడం, కమ్మ సామాజిక వర్గ ప్రతినిధులు ఢిల్లీకి వెళ్ళగా కాంగ్రెస్ అధిష్టానం వారికి ఆగమేఘాల మీద అపాయింట్ మెంట్ ఇవ్వడమే కాక వాళ్ళ ప్రతిపాదనలను ఓపికా వినడమే కాక కొన్నింటికి సానుకూలంగా స్పందించడం ప్రస్తుతం తెలంగాణలో కాంగ్రెస్ కమ్మ సామాజిక వర్గ దోస్తానాకు అద్దం పడుతోంది. అంతే కాదు చంద్రబాబుకు అనుంగు శిష్యుడని పేరు గాంచిన రేవంత్ రెడ్డి తెలంగాణ కాంగ్రెస్ కు అధ్యక్షుడవడం, ఆయన అధ్యక్షుడయ్యాక కాంగ్రెస్ అనూహ్యంగా పుంజుకోవడం, రేపు కాంగ్రెస్ గెలిస్తే ఆయనే ముఖ్యమంత్రి అవుఅతారనే ప్రచారం చంద్రబాబు శిష్యులు కాంగ్రెస వైపు మళ్ళడానికి మరో కారణమని భావిస్తున్నారు.
ఇక ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తో, మంత్రి కేటీఆర్ తో మంచి సంబంధాలున్నాయి. అదొకటే కాక తనను జైలుకు పంపిన కాంగ్రెస్ అంటే జగన్ కు ఉన్న కసి, ఆయన ప్రధాన శత్రువైన చంద్రబాబు కాంగ్రెస్ కు రహస్యంగా మద్దతు పలకడం జగన్ కేసీఆర్ కు జైకొట్టడానికి కారణమయ్యింది. అంతే కాక తెలంగాణలో బీఆరెస్ గెలిచినా పర్వాలేదు కానీ కాంగ్రెస్ గెలవొద్దనే పట్టుదలతో ఉన్న భారతీయ జనతా పార్టీ జాతీయ నాయకులు, తెలంగాణలో బీఆరెస్ కు మద్దతు ఇవ్వవలసిందిగా జగన్ కు సూచన లాంటి ఆదేశాలిచ్చినట్టు తెలుస్తోంది.
పైకి ఎవ్వరు ఎన్ని మాట్లాడుకున్నా బీఆరెస్, బీజేపీ ల మధ్య రహస్య ఒప్పందాలున్నాయన్న ప్రచారం తీవ్రంగానే ఉంది. అంతే కాదు ఏపీలో చంద్రబాబును జగన్ అరెస్టు చేయించడానికి కేంద్ర బీజేపీ నేతల మద్దతు కూడా ఉందనే అభిప్రాయం కూడా వ్యాప్తిలో ఉంది. ఈ నేపథ్యంలో తెలంగాణలో బీఆరెస్ ను ఓడించాలని బాబు సామాజిక వర్గం, మళ్ళీ కేసీఆర్ నే గెలిపించాలని జగన్ ఫ్యాన్స్ ప్రయత్నిస్తోంది.
ఈ రెండు వర్గాలు తెలంగాణ ఎన్నికల ఫలితాలను నిర్దేశించలేకపోయినప్పటికీ కొన్ని స్థానాల్లో తీవ్ర ప్రభావం మాత్రం చూపగలరు. ముఖ్యంగా ఉమ్మడి ఖమ్మం జిల్లా, ఉమ్మడి నల్గొండజిల్లాలో కొన్ని నియోజకవర్గాలు, ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోని పలు నియోజకవర్గాలు హైదరాబాద్ లలో ఆయా వర్గాల ప్రభావం ఎక్కువగానే ఉంది. దీంతో ఏపీలోని ప్రత్యుర్థులు తెలంగాణ ఎన్నికల్లో చూయించబోయే ప్రభావం గురించి పలువురు అభ్యర్థులు, ఆయా పార్టీల గరనేతలు లెక్కలు వేసుకుంటున్నారు.
అసలే ఏపీలో ఒకరిపై ఒకరు ఉప్పు నిప్పై మండుతున్న ఆ రెండు సామాజిక వర్గాలు తమ తమ బలాలను ఇప్పుడు తెలంగాణ ఎన్నికల్లో చూయించాలని భావిస్తున్నారు. అయితే నిజంగానే ఎన్నికల ఫలితాలు ఈ వర్గాలు మార్చగలరా ? తెలంగాణ ఓటర్ మధిలో ఏముంది? అనేది మాత్రం ఫలితాల తర్వాతే తేలుతుంది.