దేశంలో స్వాతంత్య్రం వచ్చిన నాటి పరిస్థితులు నేడు లేవు. నాటి ప్రజాస్వామ్యం కూడా నేడు లేకుండా పోయింది. రాజ్యాంగం పట్ల, విభిన్న అభిప్రాయాలపట్ల గౌరవం చూప
దేశంలో స్వాతంత్య్రం వచ్చిన నాటి పరిస్థితులు నేడు లేవు. నాటి ప్రజాస్వామ్యం కూడా నేడు లేకుండా పోయింది. రాజ్యాంగం పట్ల, విభిన్న అభిప్రాయాలపట్ల గౌరవం చూపించే ఆ నాయకులు నేడు లేరు. ప్రస్తుతం దేశంలో తమకు వ్యతిరేకంగా మాట్లాడితే, రాస్తే పాక్ ఏజెంట్లు అని, చైనా అనుకూలురని, దేశద్రోహులని ముద్రలు వేసి హింసలపాలు చేస్తున్న పాలన సాగుతోంది.
ముఖ్యంగా తమకు లొంగని, స్వతంత్ర గొంతు వినిపించే జర్నలిస్టులపై కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం చేస్తున్న దాడులు రోజు రోజుకు పెరిగిపోతూ ఉన్నాయి. ఒక్క బీజేపీ ప్రభుత్వమే కాదు పలు ఇతర పార్టీలప్రభుత్వాలు కూడా ఇదే బాటన నడుస్తున్నాయి. బీజేపీ దారి వేస్తూ ఉంటే ఆ దారిలో పలు జాతీయ, ప్రాంతీయ పార్టీల ప్రభుత్వాలు నడుస్తున్నాయి.
స్వతంత్ర జర్నలిస్టులు నడిపిస్తున్న న్యూస్ క్లిక్ వెబ్ సైట్ పై దాడులు, న్యూస్‌క్లిక్ ఎడిటర్ ప్రబీర్ పుర్కాయస్థ, పోర్టల్ హెచ్‌ఆర్ విభాగం అధిపతి అమిత్ చక్రవర్తిలను ఉగ్రవాద ఆరోపణలపై అరెస్టు చేయడం స్వతంత్ర జర్నలిజంపై మోడీ ప్రభుత్వ చేస్తున్న దాడికి కొనసాగింపు. ఈ మధ్య కాలంలో తెలంగాణలో ఇండింపెండెంట్ జర్నలిస్టు, సీనియర్ జర్నలిస్టు, వీక్షణం పత్రిక్ ఎడిటర్ ఎన్. వేణుగోపాల్ పై తెలంగాణ ప్రభుత్వం యూఎపీఏ కేసు నమోదు చేసింది. ఆయన అనేక సంవత్సరాలుగా పాలకులు చేస్తున్న అగడాలను, తప్పులను నిలదీస్తున్నారు. ఇవే విషయాలపై అనేక చోట్ల మాట్లాడుతున్నారు. రాస్తున్నారు. ఆయనపై కేసు నమోదు చేయడానికి ఇదొక్కటే కారణం
ఇక న్యూస్ క్లిక్ వెబ్ సైట్ జర్నలిస్టులపై దాడులకు సంబంధించి…అక్టోబరు 3వ తేదీ సాయంత్రం, తెల్లవారుజామున జర్నలిస్టుల ఇళ్లపై నాటకీయ దాడులు జరిగిన తర్వాత అరెస్టులు జరిగాయి. డజన్ల కొద్దీ జర్నలిస్టుల ఎలక్ట్రానిక్ పరికరాలు – ల్యాప్‌టాప్లు, టెలిఫోన్‌లు – పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.పోలీసులు టార్గెట్ చేసిన వారిలో అప్పుడప్పుడు వెబ్ సైట్ కు వార్తలు, వ్యాసాలు అందించే వారు కూడా ఉన్నారు. న్యూస్‌క్లిక్‌తో సంబంధం ఉన్న రచయితలు, పాత్రికేయులు, చరిత్రకారులు , శాస్త్రవేత్తలు అందరిపై దాడి చేశారు. చివరకు న్యూస్ పోర్టల్ కార్యాలయానికి తాళం వేశారు. ఢిల్లీ పోలీసుల ప్రత్యేక విభాగం మొత్తం 46 మందిని ప్రశ్నించింది.
పత్రికా స్వేచ్ఛ కోసం నిలబడే వారికి భారతదేశంలో ఇది చీకటి సంవత్సరం. ప్రపంచ పత్రికా స్వేచ్ఛ సూచికలో 180 దేశాల్లో భారతదేశం ర్యాంక్161. 2015 నుండి పత్రికా స్వేచ్చ దారుణంగా పతనం అవుతున్నది.
డిజిటల్ , స్వతంత్ర మీడియా చుట్టూ ఉచ్చు బిగించే ప్రయత్నం తీవ్రంగా జరుగుతున్నది. దాదాపు ఒక దశాబ్దం పాటు ప్రధాని ఒక్క పత్రికా సమావేశానికి హాజరుకాకపోవడం, పెరుగుతున్న అధికారిక సంస్కృతి మన ప్రజాస్వామ్యంపై తిరోగమన ప్రభావాన్ని చూపాయి. ద్వేషపూరిత ప్రసంగాలపై సుప్రీం కోర్టు కఠిన నిబంధనలు ఉన్నప్పటికీ, ద్వేషాన్ని ప్రేరేపిస్తున్న – టీవీ వార్తా ఛానెళ్ళు పూర్తి స్వేచ్ఛగా తమ కార్యక్రమాలని నిర్వహింస్తూ ప్రజా క్షేత్రాన్ని విషపూరితం చేస్తూ సమాజంలో హింసను ప్రేరేపిస్తోంది.
మొత్తం మీడియా సంస్థపై ‘రైడ్’ చేయడం, సరైన ప్రక్రియ లేకుండా జర్నలిస్టుల ఎలక్ట్రానిక్ పరికరాలను లాక్కోవడం స్వతంత్ర జర్నలిజానికి చెడ్డ రోజులే కాదు ప్రజాస్వామ్య పతనానికి గుర్తు కూడా. పెరుగుతున్న నిరంకుశ పాలనలో స్వతంత్ర జర్నలిస్టులు ఎన్ని కష్టాలు అనుభవిస్తున్నారనే దాని గురించి భారతీయులందరూ అప్రమత్తంగా ఉండాలి. ఎందుకంటే ఆ తర్వాత ఏర్పడే చీకటి చివరికి వారి నీడను కూడా కనపడకుండా చేస్తుంది. ప్రజాస్వామ్యంపై, రాజ్యాంగంపై, స్వతంత్ర జర్నలిజంపై అణిచివేత చివరి స్థాయికి చేరింది. ఇప్పటికైనా అలారం గంటలు బిగ్గరగా మోగడం మీకు వినబడకపోతే, మీరు చెవిటివారైనా కావాలి లేదా అలా నటిస్తూనైనా ఉండాలి.