బీఆరెస్, బీజేపీల మధ్య రహస్య బంధం ఉందని కాంగ్రెస్ చాలా కాలంగా ఆరోపణలు చేస్తూ ఉంది. ఆ ఆరోపణలు ఇటు బీఆరెస్, అటు బీజేపీ ఖండిస్తూ వస్తోంది. అయితే మంగళవార
బీఆరెస్, బీజేపీల మధ్య రహస్య బంధం ఉందని కాంగ్రెస్ చాలా కాలంగా ఆరోపణలు చేస్తూ ఉంది. ఆ ఆరోపణలు ఇటు బీఆరెస్, అటు బీజేపీ ఖండిస్తూ వస్తోంది. అయితే మంగళవారం నాడు నిజామాబాద్ లో జరిగిన బీజేపీ బహిరంగ సభలో ప్రధాని మోడీ మాట్లాడిన మాటలు కాంగ్రెస్ ఆరోపణలకు ఊతం ఇచ్చే విధంగా ఉన్నాయి.
ఇంతకూ మోడీ ఏమన్నారు.
”ఇంతకుముందు చెప్పని రహస్యం ఇవాళ చెబుతున్నాను, GHMC ఎన్నికల తర్వ్ఫాత కేసీఆర్ నన్ను కలిసి ఎన్డీయేలో చేరుతానని చెప్పారు. కేటీఆర్‌ను ఆశీర్వదించాలని కోరారు. అయితే ఇది రాజరికం కాదని, బీఆర్ఎస్‌తో పొత్తు పెట్టుకునేది లేదని తేల్చి చెప్పాను. ” అని మోడీ అన్నారు.
మోడీ మాట్లాడిన మాటలు రాష్ట్ర రాజకీయాల్లో సంచలనం సృష్టిస్తున్నాయి. తమకు బీఆరెస్ కు ఒప్పందం ఏమీ లేదని మోడీ మాటలు తేల్చేశాయని బీజేపీ నాయకులు చెప్తుండగా, మోడీ మాట్లాడిన మాటలు పచ్చి అబద్దాలని బీఆరెస్ మండిపడుతోంది. కాగా మోడీ మాటలతో బీజేపీ, బీఆరెస్ మధ్య ఉన్న రహస్య బంధం బైటపడిందని కాంగ్రెస్ అంటోంది.
”తనను ఆశీర్వదించాలని తన తండ్రి, సీఎం కేసీఆర్ చెప్పారని ప్రధాని మోదీ అబద్ధాలు చెప్పారు. తాను ముఖ్యమంత్రి కావడానికి ఆయన అనుమతి అక్కరలేదు. ఏడు పదుల వయస్సులో ప్రధాని అబద్ధాలు చెబుతున్నారన్నారు. ఈ అబద్ధాలతో ఆయన తన పదవి గౌరవాన్ని తగ్గించుకున్నారు. నిజామాబాద్ సభలో ఆయన చెప్పినవన్నీ అబద్ధాలే. ఆయన యాక్టింగ్‌కు ఆస్కార్ తప్పకుండా వస్తుంది. ఆయన స్క్రిప్ట్ రాస్తే సినిమాలు తప్పకుండా విజయం సాధిస్తాయి.” అని మంత్రి కేటీఆర్ వ్యాఖ్యానించారు.
మరో వైపు మోడీ వ్యాఖ్యలపై పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి స్పంధిస్తూ, ”మోడీ నోట తన చీకటి మిత్రుడి మాట బయటకు వచ్చింది. ఇప్పటికైనా ముసుగు తొలగి, నిజం బయటకు వచ్చింది. మోడీ-కేసీఆర్‌ది ఫెవికాల్ బంధమని కాంగ్రెస్ చెప్పిందే నిజమైంది. నిజామాబాద్ గడ్డపై మరోసారి ఈ బంధం బయటపడింది. బీజేపీ, బీఆర్ఎస్ చీకటి మిత్రులని, ఢిల్లీలో దోస్తీ చేస్తూనే గల్లీలో కుస్తీ పడుతున్నారు. కేసీఆర్ ఎన్డీయేలో చేరాలని ప్రయత్నం చేసింది నిజమే… అలాగే వారిద్దరు మిత్రులేనన్నది అంతకంటే నిజం. నిప్పులాంటి నిజం ఎప్పటికైనా బయటపడక తప్పది.” అని రేవంత్ రెడ్డి అన్నారు.
కాగా, త్వరలో తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ప్రధాని మోడీ బైటపెట్టిన ఈ రహస్యం రాష్ట్ర రాజకీయాల్లో అనేక మార్పులకు కారణం కానుంది. మోడీ చెప్పిన మాటలు నిజమా, అబద్దమా అనే విషయం పక్కనపెడితే , ఇప్పుడు బీఆరెస్ నాయకులు ఎన్ని మాటలు చెప్పినా ప్రజలపై మోడీ మాటల ప్రభావం ఉంటుందన్నది నిజం.
ఈ అంశానికి సంబంధించి గతంలో ఏ చర్చలూ జరగకుండా, ఎవ్వరూ మాట్లాడకుండా సడేన్ గా మోడీ ఈ మాటలు మాట్లాడినట్టైతే పెద్దగా ప్రభావం ఉండకపోవచ్చు కానీ బీఆరెస్, బీజేపీల మధ్య రహస్య ఒప్పందం ఉందని కాంగ్రెస్ ఎప్పటి నుంచో ఆరోపణలు చేస్తున్న నేపథ్యంలో అవే మాటలు మోడీ కూడా మరో విధంగా చెప్పడంతో ఖచ్చితంగా ఈ అంశంపై తెలంగాణ ప్రజల్లో చర్చ జరుగనుంది. ఈ చర్చ ఇటు బీఆరెస్ కూ, అటు బీజేపీకి కూడా నష్టం చేసే వకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు.