HomeNationalCrime

గ్రామంపై దాడి,ప్రజలపై హింస, సామూహిక అత్యాచారాలు: 215 మంది పోలీసు, ఫారెస్ట్, రెవెన్యూ అధికారులకు జైలు శిక్ష‌

గ్రామంపై దాడి,ప్రజలపై హింస, సామూహిక అత్యాచారాలు: 215 మంది పోలీసు, ఫారెస్ట్, రెవెన్యూ అధికారులకు జైలు శిక్ష‌

దేశంలో అనేక చోట్ల పోలీసులు, అర్ద సైనిక బలగాలు చేసిన ఘోరాలు వెలుగులోకి వచ్చినప్పటికీ ఇప్పటి వరకు వారికి శిక్ష పడిన సంఘటనలు తక్కువ. ఒకప్పుడు తెలంగాణ, ఏ

ట్యూషన్ టీచర్ ను పొడిచి చంపిన బాలుడు
‘రేవంత్ అనుచరులు నన్ను బెదిరిస్తున్నారు’
రాహుల్ గా‍ంధీ యాత్రపై కేసు నమోదు

దేశంలో అనేక చోట్ల పోలీసులు, అర్ద సైనిక బలగాలు చేసిన ఘోరాలు వెలుగులోకి వచ్చినప్పటికీ ఇప్పటి వరకు వారికి శిక్ష పడిన సంఘటనలు తక్కువ. ఒకప్పుడు తెలంగాణ, ఏపీలలో, కశ్మీర్ లో, ఈశాన్య రాష్ట్రాలలో స్థానిక పోలీసులే కాక, సీఆర్పీఎఫ్, బీఎస్ ఎఫ్ తదితర బలగాలు ప్రజలపై దాడులు. సామూహిక అత్యాచారాలు చేసిన సంఘటనలెన్నో వెలుగు చూశాయి. విశాఖ జిల్లా వాకపల్లి అనే గిరిజన గ్రామంపై దాడి చేసిన పోలీసులు అక్కడి స్త్రీలపై సామూహిక అత్యాచారాలు చేసిన సంఘటన దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఈ సంఘటనపై కోర్టు కూడా తీవ్రంగా స్పందించి, సామూహిక అత్యాచారాలు జరిగిన విషయం వాస్తవమని తేల్చినప్పటికీ, విచారణ చేసిన పోలీసు అధికారులు కావాలనే విచారణను పక్కదోవపట్టించడం వల్ల ఎవ్వరినీ శిక్షించలేకపోతున్నట్టు కోర్టు నిస్సహాయత వ్యక్తం చేసింది.

కాగా, ఎన్ని సంఘటనలు జరిగినా పోలీసులు, ఇతర అధికారులు శిక్షల నుండి తప్పించుకుంటున్న ఈ దేశంలోమద్రాస్ హైకోర్టు శుక్రవారం నాడు ఓ సంచలన తీర్పునిచ్చింది. 215 మంది పోలీసులు, ఫారెస్ట్ అధికారులు, రెవెన్యూ అధికారులకు జైలు శిక్ష విధించింది.

చందనం చెక్కలు స్మగ్లింగ్ చేస్తున్నారనే ఆరోపణతో, జూన్ 20, 1992నాడు తమిళనాడులోని ధర్మపురి జిల్లా వాచాతి అనే గిరిజన గ్రామంపై పోలీసులు., ఫారెస్ట్ అధికారులు, రెవెన్యూ అధికారులు దాడి చేశారు. పురుషులను అనేక రకాలుగా హింసించారు. 18 మంది మహిళలపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఇళ్ళల్లో ఉన్న ఆహార వస్తువులను కాల్చేశారు. పశువులను చంపేశారు, ఆస్తులను ధ్వంసం చేశారు.

ఈ సంఘటనపై పోలీసులు ఎఫ్ ఐ ఆర్ కూడా నమోదు చేయలేదు. అనేక ఏళ్ళు ఆదివాసీ సంఘాలు చేసిన పోరాటం ఫలితంగా సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు పోలీసులు ఎఫ్ ఐ ఆర్ నమోదు చేశారు కానీ విచారణ మాత్రం జరపలేదు.

చివరకు మళ్ళీ సుప్రీం కోర్టు జోక్యం చేసుకొని 1995లో వాచాతి కేసుపై ఆగ్రహం వ్యక్తం చేయడంతో 1995లో సిబిఐ విచారణ జరిపి, అప్పటి ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ ఎం హరికృష్ణన్, ఇతర సీనియర్ అధికారులతో సహా 269 మంది నిందితులపై ఛార్జిషీట్ దాఖలు చేశారు.

ఈ కేసుపై విచారణ జరిపిన ధర్మపురిలోని సెషన్స్ కోర్టు 2011లో ఈ కేసుకు సంబంధించి నలుగురు ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ అధికారులు, 84 మంది పోలీసులు, ఐదుగురు రెవెన్యూ శాఖ అధికారులతో సహా 126 మంది అటవీ సిబ్బందిని దోషులుగా నిర్ధారించింది. 269 మంది నిందితులలో, 54 మంది విచారణ సమయంలో మరణించారు. మిగిలిన 215 మందికి 1 నుండి 10 సంవత్సరాల వరకు జైలు శిక్ష విధించింది కోర్టు.

అయితే ఈ తీర్పుపై దోషులు హైకోర్టును ఆశ్రయించారు. ఇన్ని రోజుల తర్వాత ఈ కేసుపై హైకోర్టు శుక్రవారం నాడు తీర్పు వెలువరించింది.

వాచాతి గ్రామంపై జరిగిన దాడిలో లైంగిక వేధింపులతో సహా దురాగతాలకు పాల్పడిన 215 మంది – అటవీ, పోలీసు, రెవెన్యూ శాఖల అధికారులందరూ అంటే 215 మందిని దోషులుగా నిర్ధారించిన మద్రాస్ హైకోర్టు శుక్రవారం అన్ని అప్పీళ్లను కొట్టివేసింది. సెషన్స్ కోర్టు తీర్పును సమర్థించింది.

బాధితులు , ప్రాసిక్యూషన్ సాక్షులందరి సాక్ష్యాలు సమర్ధవంతంగా, ఖచ్చితంగా ఉన్నాయని ఈ కోర్టు తేల్చింది. ప్రాసిక్యూషన్ తన సాక్ష్యం ద్వారా ఈ కేసును రుజువు చేసిందని జస్టిస్ పి వెల్మురుగన్ తన ఉత్తర్వులో పేర్కొన్నారు.

సెషన్స్ కోర్టు తీర్పును సమర్థిస్తూ, మిగిలిన శిక్షా కాలాన్ని అనుభవించడానికి నిందితులందరినీ తక్షణమే కస్టడీకి ఇవ్వాలని సెషన్స్ కోర్టును హైకోర్టు శుక్రవారం ఆదేశించింది.

2016లో డివిజన్ బెంచ్ ఆదేశాల మేరకు అత్యాచార బాధితురాలికి రూ. 10 లక్షల పరిహారం వెంటనే విడుదల చేయాలని, నేరానికి పాల్పడిన పురుషుల నుంచి 50% మొత్తాన్ని వసూలు చేయాలని జస్టిస్ వేల్మురుగన్ తమిళనాడు ప్రభుత్వాన్ని ఆదేశించారు.

నిందితులను రక్షించినందుకు అప్పటి జిల్లా కలెక్టర్, సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్, జిల్లా అటవీ అధికారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోర్టు రాష్ట్రప్రభుత్వాన్ని ఆదేశించింది.

జస్టిస్ వెల్మురుగన్ తన ఉత్తర్వుల్లో ఇలా అన్నారు: “సాక్షుల సాక్ష్యాలను బట్టి, జిల్లా కలెక్టర్, జిల్లా అటవీ అధికారి, పోలీసు సూపరింటెండెంట్‌తో సహా అధికారులందరికీ నిజమైన నిందితులు ఎవరో తెలిసినప్పటికీ, వారిపై ఎలాంటి చర్యలు తీసుకోలేదు.అసలు నిందితులను కాపాడేందుకు అమాయక గ్రామస్తులను బలి చేశారు. అందువల్ల, అప్పీలుదారులందరూ నేరం చేశారని ప్రాసిక్యూషన్ రుజువు చేసిందని ఈ కోర్టు నిర్ధారణకు వచ్చింది.” అని కోర్టు తన తీర్పులో పేర్కొంది.

18 మంది అత్యాచార బాధితులకు లేదా వారి కుటుంబ సభ్యులకు స్వయం ఉపాధి లేదా శాశ్వత ఉద్యోగాలు కల్పించాలని న్యాయమూర్తి రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించారు. ఈ సంఘటన తర్వాత ‘వచ్చినాతి’ గ్రామంలో జీవనోపాధి, జీవన ప్రమాణాలు మెరుగుపరిచేందుకు తీసుకున్న సంక్షేమ కార్యక్రమాలపై కోర్టుకు నివేదించాలని ప్రభుత్వాన్ని ఆదేశించారు.