బీజేపీని ఓడించడమే లక్ష్యంగా విపక్షాలు ఏర్పాటు చేసిన ఇండియన్ నేషనల్ డెవలప్‌మెంటల్ ఇన్‌క్లూజివ్ అలయన్స్ (I.N.D.I.A) కూటమి ముంబై లో జరిగిన సమావేశాల్లో క
బీజేపీని ఓడించడమే లక్ష్యంగా విపక్షాలు ఏర్పాటు చేసిన ఇండియన్ నేషనల్ డెవలప్‌మెంటల్ ఇన్‌క్లూజివ్ అలయన్స్ (I.N.D.I.A) కూటమి ముంబై లో జరిగిన సమావేశాల్లో కీలక నిర్ణయాలు తీసుకుంది. 13 మంది సభ్యులతో కేంద్ర సమన్వయ కమిటీని ఏర్పాటు చేసింది. రానున్న లోక్ సభ ఎన్నికల్లో ఉమ్మడిగా పోటీ చేయాలని, భాగస్వామ్య పార్టీల మధ్య సీట్ల పంపకాలపై చర్చలను తక్షణమే ప్రారంభించాలని నిర్ణయించింది.
నిన్న ఈ రోజు సమావేశాలు జరిగిన అనంతరం ఈ రోజు (శుక్రవారం) కోఆర్డినేషన్ కమిటీ సభ్యుల పేర్లను ప్రకటించాయి. కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్, ఎన్సీపీ అధినేత శరద్ పవార్, తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్, టీఎంసీ ప్రధాన కార్యదర్శి అభిషేక్ బెనర్జీ, శివసేన ఎంపీ సంజయ్ రౌత్, బీహార్ డిప్యూటీ సీఎం తేజస్వీ యాదవ్, జేడీ(యూ) నేత లల్లన్ సింగ్, ఆప్ ఎంపీ రాఘవ్ చద్దా, జార్ఖండ్ సీఎం. హేమంత్ సోరెన్, SP నాయకుడు జాదవ్ అలీ ఖాన్, CPI నాయకుడు D రాజా, నేషనల్ కాన్ఫరెన్స్ (NC) నాయకుడు, జమ్మూ & కాశ్మీర్ మాజీ CM ఒమర్ అబ్దుల్లా, PDP చీఫ్, J&K మాజీ CM మెహబూబా ముఫ్తీ 13 మంది సభ్యుల ప్యానెల్‌లో సభ్యులుగా ఉన్నారు. ఎన్నికల ముందు పొత్తుల పని తీరును క్రమబద్ధీకరించేందుకు కమిటీ నిర్ణయాలు తీసుకుంటుంది.
సీపీఐ(ఎం) నుంచి మరో సభ్యుడు ప్యానెల్‌లో చేరనున్నారు.
ఈ కమిటీ జాతీయ ఎజెండా, ఉమ్మడి ప్రచార అంశాలు, ఉమ్మడి కార్యక్రమ రూపురేఖలను నిర్ణయిస్తుంది. అయితే ఈ కూటమి తన కన్వీనర్‌ను ఎన్నుకోలేదు.
2024 లోక్‌సభ ఎన్నికల్లో అధికార పార్టీ బీజేపీతో హోరాహోరీగా పోరాడేందుకు కూటమి మధ్య సహకారం కోసం కాంక్రీట్ రోడ్‌మ్యాప్, నిర్మాణాన్ని రూపొందించడానికి భారత కూటమి నేతలు గురువారం అనధికారిక చర్చలు జరిపారు.
ఇదిలావుండగా, శుక్రవారం ప్రతిపక్షాల సమావేశం ప్రారంభం కావడానికి ముందు, ‘ఒక దేశం, ఒకే ఎన్నికలు’ అనే అంశంపై ప్యానెల్‌ను ఏర్పాటు చేయాలన్న కేంద్రం నిర్ణయాన్ని ఇండియా కూటమి నేతలు తప్పుబట్టారు. తమ ఐక్యతకు బీజేపీ భయపడుతోందని, సార్వత్రిక ఎన్నికలను ముందస్తుగా నిర్వహించాలనేది కేవలం ‘కుట్ర’ మాత్రమేనని వారు అన్నారు.
అంతకుముందు గురువారం, భారతీయ జనతా పార్టీ విపక్షాలపై విరుచుకుపడింది. ఇండియా కూటమిని “స్వార్థ కూటమి”గా బిజెపి విమర్శించింది. ఆ కూటమిలో ఉన్న పార్టీలు వారి కుటుంబాల ప్రయోజనాలను ప్రోత్సహిస్తోందని, వారిని కాపాడుతుందని బిజెపి నాయకుడు సంబిత్ పాత్ర ఆరోపించారు.
”ఈరోజు ముంబైలో ‘ఘమండియా ఘట్ బంధన్’ సమావేశం జరగబోతోంది. ఈ పార్టీలు 20 లక్షల కోట్ల కుంభకోణాలు, అవినీతి చేశాయి. ఇది స్వార్థపూరిత కూటమి.. అవినీతి నుంచి గరిష్ట లాభం పొందడమే వారి ఎజెండా.” అని పాత్రా అన్నారు.
జుడేగా భారత్, జీతేగా ఇండియా’ నినాదంతో ప్రచార కార్యక్రమాలను నిర్వహించాలని ఇండియా కూటమి నిర్ణయించింది. భాగస్వామ్య పార్టీల కమ్యూనికేషన్స్, మీడియా స్ట్రాటజీలను సమన్వయం చేసుకోవాలని, ఈ ప్రచార కార్యక్రమాలను స్థానిక భాషల్లో నిర్వహించాలని నిర్ణయించింది. దేశవ్యాప్తంగా బహిరంగ సభలను నిర్వహించాలని నిర్ణయించింది.