కరోనా మహమ్మారి వల్ల ఉద్యోగాలు, ఉపాది కోల్పోయి దాదాపు 5 కోట్ల మంది పేదరికంలో మగ్గుతుండగా ఇదే కాలంలో 57,951 మంది కొత్తగా కోటీశ్వరులయ్యారు. పల్లెల న
కరోనా మహమ్మారి వల్ల ఉద్యోగాలు, ఉపాది కోల్పోయి దాదాపు 5 కోట్ల మంది పేదరికంలో మగ్గుతుండగా ఇదే కాలంలో 57,951 మంది కొత్తగా కోటీశ్వరులయ్యారు.
పల్లెల నుంచి బతుకుదెరువు కోసం పట్టణాలబాటపట్టిన కోట్లాది మంది పేదలు కరోనా, లాక్ డౌన్ కాలంలో పనులు లేక విలవిలలాడిపోయారు. ఈ మూడేళ్ళలో ఆకలితో, అర్దాకలితో జీవించిన వారి పేదల సంఖ్య బాగా పెరిగింది. ప్రభుత్వం కరోనా కన్నా ముందు లెక్కలు చూపిస్తూ దేశంలో పేదరికం తగ్గిందనే వాదనలు వినిపిస్తోంది.
నేషనల్ మల్టీ డైమెన్షనల్ పావర్టీ ఇండెక్స్ (MPI) ప్రకారం, భారతదేశంలో పేదరికం రేటు 2015-16లో 24.85% నుండి 2019-2021లో 14.96%కి తగ్గింది. అంటే ఈ కాలంలో జనాభాలో 9.89 శాతం మంది పేదరికం నుండి బైటపడ్డారని MPI చెప్తోంది. కాని ప్రస్తుత పరిస్థితులు మరో రకంగా ఉన్నాయి.
కోవిడ్-19 మహమ్మారి కారణంగా 2020లో 5.6 కోట్ల మంది భారతీయులు పేదరికంలో కూరుకుపోయారని ప్రపంచ బ్యాంకు అంచనా వేసింది. ఉద్యోగ నష్టాలు, ఆర్థిక కార్యకలాపాల క్షీణత, సామాజిక భద్రతకు అంతరాయం వంటి అంశాల వల్ల ఈ పరిస్థితి ఏర్పడిందని ప్రపంచబ్యాంకు తెలిపింది.
జూలై 2023లో విడుదల చేసిన తాజా MPI నివేదిక మాత్రం కరోనా మహమ్మారి ప్రభావాన్ని ఇంకా పరిగణనలోకి తీసుకోలేదు.
పెరిగిన పేదరికానికి COVID-19 మహమ్మారి తో పాటు ఉక్రెయిన్‌లో యుద్ధం కూడా ఒక కారణమయ్యింది. ఈ యుద్దం వల్ల ప్రపంచవ్యాప్తంగా ఆహారం, ఇంధన ధరలలో విపరీతమైన పెరుగుదల నమోదయ్యింది.
అంతే కాక వాతావరణ మార్పుల ప్రభావం కూడా పేదరికం పెరగడానికి ఒక కారణం. ఇది పంట నష్టాలకు కారణమవుతుంది. ప్రజలను పల్లెలు వదిలేసి బతకడానికి పట్టణాలకు వలసపోయేలా చేస్తున్నది.
ఇక మరో వైపు ఆశ్చర్యకరంగా ఈ మూడేల్ల కాలంలోనే కొత్తగా 57,951మంది కోటీశ్వరులు పుట్టుకొచ్చారు. ప్రత్యక్ష పన్నుల కేంద్ర మండలి (సీబీడీటీ) గణాంకాల ప్రకారం, ఆర్థిక వ్యవస్థ అస్తవ్యస్తమైన దశలో కూడా రూ. 1 కోటికి పైగా ఆదాయపు పన్ను పరిధిలోకి ప్రవేశించిన వ్యక్తుల సంఖ్యలో అసాధారణ వృద్ధి ఉంది.
సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ టాక్సెస్ CBDT విడుదల చేసిన డేటా ప్రకారం, రూ. 1 కోటి కంటే ఎక్కువ సంపాదిస్తున్న వ్యక్తిగత పన్ను చెల్లింపుదారుల సంఖ్య కోవిడ్‌కు ముందు 2019-20లో 1,11,939 ఉండగా 2022-23లో 1,69,890కి పెరిగింది, ఇది 51% పెరిగింది.
ఏడేళ్ల క్రితం 2016-17లో కేవలం 68,263 మంది ఉన్న కోటీశ్వరులు 1,69,890 మందికి పెరగడం ”నాకు ఆశ్చర్యం కలిగించలేదు,” అని CBDT మాజీ ఛైర్మన్ R ప్రసాద్ చెప్పారు. “మహమ్మారి సమయంలో చాలా కంపెనీలు చాలా లాభదాయకంగా మారాయి., వారి CEO లు, సీనియర్ మేనేజ్‌మెంట్ స్థానాల్లో ఉన్నవారు చాలా ప్రయోజనం పొంది ఉంటారు. మిడిల్ మేనేజ్‌మెంట్ , దిగువన ఉన్నవారు సాధారణంగా సాధారణ ఇంక్రిమెంట్‌లను మాత్రమే పొందుతారు.” అని ఆయన అన్నారు. జీతం, జీతం లేని వ్యక్తుల మధ్య పన్ను చెల్లింపుదారుల విభజన బాగా పెరిగింది. అయితే కోటీశ్వరులైన పన్ను చెల్లింపుదారులలో సగానికి పైగా జీతాలు పొందే వ్యక్తులుగా నిపుణులు చెబుతున్నారు.