HomeTelangana

గద్దర్ కన్నుమూత‌

గద్దర్ కన్నుమూత‌

ఒకప్పటి విప్లవ గాయకుడు, ప్రజాగాయకుడిగా పేరుపొందిన గద్దర్ తన 77వ ఏట కొద్ది సేపటి క్రితం మరణించారు. ఇటీవల గుండెపోటు రావడంతో ఆయనను హైదరాబాద్‌లోని అపోలో

గద్దర్ గురించి చంద్రబాబు అంత కలత చెందాడన్న మాటలు నమ్మొచ్చా ?
గుమ్మడి విఠల్ రావు గద్దర్ గా ఎలా మారారు ?
గద్దర్ వెళ్ళిపోయారు…ఆయన పాట మారుమోగుతూనే ఉంది

ఒకప్పటి విప్లవ గాయకుడు, ప్రజాగాయకుడిగా పేరుపొందిన గద్దర్ తన 77వ ఏట కొద్ది సేపటి క్రితం మరణించారు. ఇటీవల గుండెపోటు రావడంతో ఆయనను హైదరాబాద్‌లోని అపోలో ఆసుపత్రిలో చేరారు. చివరికి ఆరోగ్యం విషమించి ఈరోజు తుదిశ్వాస విడిచారు.

1949లో తూప్రాన్‌లో జన్మించిన గద్దర్ అసలు పేరు గుమ్మడి విఠల్ రావు. ఆయన ఇంజనీరింగ్ పూర్తి చేసి ఆ తర్వాత కొంత కాలం బ్యాంకులో పని చేశారు. మంచి గాయకుడైన గద్దర్ ప్రముఖ విప్లవ నాయకుడు కొండప‌ల్లి సీతారామయ్య మార్గదర్శక‌త్వంలో ప్రముఖ‌ దర్శకుడు నర్సింగరావు ప్రోత్సాహంతో జననాట్యమండలి ఏర్పాటు చేశారు. అప్పటి ఆంధ్రప్రదేశ్ లో జననాట్యమండలి పాట ప్రతి పల్లెకూ వెళ్ళింది.
నర్సింగరావు నిర్మించిన మాభూమి మూవీలో గద్దర్ యాదగిరి పాత్ర పోషించి బండెనక బండి గట్టీ అనే పాట పాడారు. ఆ పాట ఆ రోజుల్లో ఆంధ్రప్రదేశ్ ను ఉర్రూతలూగించింది.

భూసంస్కరణలు, పేదరికం, శ్రామిక వర్గ దోపిడీ, కుల వివక్ష, లింగ అసమానత, అణగారిన వర్గాల కోసం అనేక పాటలు స్వర‌పరిచిన గద్దర్ వేలాది సభల్లో పాడారు. ఒకప్పుటి పీపుల్స్ వార్ పార్టీ , దాని అనుబంద సంఘాలైన రాడికల్ విద్యార్థి సంఘం, రాడికల్ యువజన సంఘం, రైతు కూలీ సంఘం, జననాట్యమండలి సభల్లో గద్దర్ ప్రదర్శన లేకుండా ఉండేవి కావు. పీపుల్స్ వార్ పార్టీ అనంతరం మావోయిస్టు పార్టీగా పేరు మార్చుకుంది.

గద్దర్ పై చంద్రబాబు హయాంలో హత్యా ప్రయత్నం కూడా జరిగింది.1997 ఏప్రిల్ 6న కొందరు దుండగులు ఆయనపై తుపాకులతో కాల్పులు జరిపారు. ఆ సమయంలో ఆయన చావు అంచుల వరకూ వెళ్ళి వచ్చారు. ఇప్పటికీ ఆయన వెన్నెముకలో ఒక బుల్లెట్ ఉండిపోయింది. పోలీసులే ఆయనపై కాల్పులు జరిపారని, దానిపై విచారణ జరిపించాలని గద్దర్ కోరినప్పటికీ చంద్రబాబు ప్రభుత్వం పట్టించుకోలేదు.

నక్సలైట్లతో వైఎస్సార్ ప్రభుత్వం చర్చలు జరిపినప్పుడు నక్సలైట్ల తరపున వరవరరావు, కళ్యాణ్ రావులతో పాటు గద్దర్ కూడా చర్చల్లో పాల్గొన్నారు.

తెలంగాణ ఉద్యమం ఊపందుకున్న సమయంలో తెలంగాణ ప్రజా ఫ్రంట్ అనే సంస్థకు అధ్యక్షుడిగా పని చేశారు. అనంతర కాలంలో ఆయన విప్లవ రాజకీయాలకు పూర్తిగా దూరమయ్యారు. ఎన్నికల్లో పోటీ చేస్తానని కూడా ఆయన ఆనేక సార్లు ప్రకటించారు.

గద్దర్ తెలుగు విశ్వవిద్యాలయం నుంచి సాహిత్య పురస్కారం,అంబేద్కర్ అంతర్జాతీయ పురస్కారం, లోకాయత్ అవార్డు, ప్రజా సాహిత్య పురస్కారం గద్దర్ అందుకున్నారు .