HomeTelangana

కాంగ్రెస్ బలంగా ఉన్న చోటే బీజేపీ కార్యక్రమాలు.. ఇది దేనికి సంకేతం?

కాంగ్రెస్ బలంగా ఉన్న చోటే బీజేపీ కార్యక్రమాలు.. ఇది దేనికి సంకేతం?

బీజేపీ వ్యూహంపై రాజకీయ విశ్లేషకులు అనేక అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ మూడు ఉమ్మడి జిల్లాల్లో త్రిముఖ పోరు జరిగితే అది బీఆర్ఎస్‌కు అనుకూలంగా మారుతుందని అంచనా వేస్తున్నారు.

సీక్రెట్ ఆపరేషన్ మొదలు పెట్టిన బీజేపీ.. చేరికల కోసం తీవ్ర కసరత్తు!
ఈటలపై పైచేయి సాధించిన బండి సంజయ్…వేములవాడలో టెన్షన్ టెన్షన్
తెలంగాణలో బీజేపీ, జనసేన పొత్తు ఖరారైనట్టేనా ?

తెలంగాణ బీజేపీ పరిస్థితి ఏంటో అందరికీ తెలిసిన విషయమే. అధికార బీఆర్ఎస్‌కు తామే ప్రత్యామ్నాయం అని పదే పదే చెప్పుకునే ఈ పార్టీకి.. ఇప్పటికీ చాలా నియోజకవర్గాల్లో పోటీ చేసేందుకు అభ్యర్థులు కూడా దొరకడం లేదు. రాష్ట్ర బీజేపీలో అసంతృప్త నాయకులు పెరిగిపోవడంతో తాత్కాలిక సర్ధుబాటుగా బండి సంజయ్‌ని మార్చి కిషన్ రెడ్డికి బాధ్యతలు అప్పగించారు. అప్పటి నుంచి బీజేపీ వైఖరిపై పలువురికి అనుమానాలు మొదలయ్యాయి. రాష్ట్రంలోని బీఆర్ఎస్, కేసీఆర్‌కు బీజేపీ లోపాయికారి మద్దతు ఇస్తున్నదనే ప్రచారం మరింత ఊపందుకున్నది.

అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతుండటంతో బీజేపీని క్షేత్ర స్థాయిలో బలోపేతం చేయడంతో పాటు, కార్యకర్తల్లో ఉత్సాహం నింపాలని రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి నిర్ణయించారు. జిల్లాల వారీగా పర్యటనలు చేయాలని బీజేపీ అధ్యక్షుడు డిసైడ్ అయ్యారు. రాష్ట్ర అధ్యక్షుడి హోదాలో పాలమూరు జిల్లా నుంచి పర్యటన ప్రారంభించేందుకు ఆయన సిద్ధమయ్యారు. ఉమ్మడి పాలమూరు, నల్గొండ జిల్లాల్లో కిషన్ రెడ్డి పర్యటన ఉండబోతున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి.

రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రస్తుతం ఉమ్మడి నల్గొండ, ఖమ్మం, పాలమూరు జిల్లాల్లో బలంగా ఉన్నది. ఉత్తర తెలంగాణ జిల్లాలతో పోలిస్తే.. దక్షిణ తెలంగాణలోనే కాంగ్రెస్ పార్టీకి ఎక్కువ సీట్లు వచ్చే అవకాశం ఉన్నట్లు పలు సర్వేల్లో తేలింది. ఈ మూడు ఉమ్మడి జిల్లాల్లో బీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్యే పోటీ ఉంటుందని కూడా అంచనాలు ఉన్నాయి. కానీ అనూహ్యంగా బీజేపీ ఇక్కడ బలోపేతం కావడానికి కార్యక్రమాలు ప్రారంభించింది. ఈ మూడు జిల్లాల్లో కాస్త బలమైన అభ్యర్థులను బరిలోకి దింపడానికి వ్యూహం సిద్ధం చేస్తోంది.

బీజేపీ వ్యూహంపై రాజకీయ విశ్లేషకులు అనేక అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ మూడు ఉమ్మడి జిల్లాల్లో త్రిముఖ పోరు జరిగితే అది బీఆర్ఎస్‌కు అనుకూలంగా మారుతుందని అంచనా వేస్తున్నారు. ప్రభుత్వ వ్యతిరేక ఓటును బీజేపీ చీలిస్తే.. అది అంతిమంగా బీఆర్ఎస్‌కు అనుకూలిస్తుంది. కేంద్రంలోని బీజేపీకి బీఆర్ఎస్ బీ టీమ్‌గా పలువురు పేర్కొంటారు. ఇదే క్రమంలో రాష్ట్రంలో బీఆర్ఎస్‌కు అనుకూలంగా బీజేపీ వ్యవహరిస్తోందనే ఆరోపణలకు ఈ వ్యూహం బలం చేకూరుస్తోంది. బీఆర్ఎస్ బలంగా ఉండే జీహెచ్ఎంసీ, ఉత్తర తెలంగాణ జిల్లాల నుంచి కాకుండా కాంగ్రెస్ పార్టీ బలంగా ఉండే జిల్లాల్లో బీజేపీ కార్యక్రమాలు చేపట్టడంపై అనేక అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

కాగా, ఈ విషయంపై బీజేపీ నాయకులు మాత్రం మరో విధంగా స్పందిస్తున్నారు. జి. కిషన్ రెడ్డికి పాలమూరు జిల్లా సెంటిమెంట్ ఉందని చెబుతున్నారు. గతంలో అధ్యక్షుడిగా పని చేసినప్పుడు కూడా పాలమూరు నుంచే పలు కార్యక్రమాలు ప్రారంభించే వారని.. ఇదే క్రమంలో ఇప్పుడు కూడా అదే జిల్లా నుంచి పర్యటన ప్రారంభిస్తున్నట్లు చెబుతున్నారు.