తెలంగాణ రాష్ట్రంలో మూడురోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో రాష్ట్రంలోని అనేక ప్రాంతాల్లో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.ఈ నేపథ్యంలో ప్రగతి భవన్ నుం
తెలంగాణ రాష్ట్రంలో మూడురోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో రాష్ట్రంలోని అనేక ప్రాంతాల్లో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.ఈ నేపథ్యంలో ప్రగతి భవన్ నుంచి సీఎం కేసీఆర్ ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తున్నారు
కాగా, భూపాలపల్లి జిల్లా మోరంచపల్లి ఆ చుట్టు పక్కల ప్రాంతాలలో భారీ వర్షంతో మోరంచపల్లి గ్రామం పూర్తిగా నీట మునిగిపోయింది. కొన్ని చోట్ల 62 , 47 సెం. మీల వర్షపాతాలు నమోదయ్యాయి.
మోరంచపల్లి గ్రామంలో సహాయక చర్యల కోసం హెలికాప్టర్ ను తరలించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశించారు. ఆయా ప్రాంతాల్లో వరదల్లో చిక్కుకపోయిన ప్రజలను రక్షించడం, ఇతర సహాయక చర్యల కోసం సికింద్రబాద్ కంటోన్మెంట్ మిలట్రీ అధికారులతో చీఫ్ సెక్రటరీ శాంతా కుమారి సంప్రదింపులు జరుపుతున్నారు.
సహాయక చర్యల్లో సాధారణ హెలికాప్టర్ల సేవలు వినియోగించుకోవడం కష్టం అవుతుండటంతో సైన్యంతో ప్రభుత్వం సంప్రదింపులు జరుపుతోంది.
ఇప్పటికే నేషనల్ డిజాస్టర్ రిలీఫ్ ఫోర్స్ [NDRF బృందాలు] మోరంచపల్లికి తరలి వెళ్ళాయి.
ప్రధాన కార్యదర్శి ఎప్పటికప్పుడు జిల్లా అధికారులతో సంప్రదిస్తూ పరిస్థితిని సీఎం కేసీఆర్ కు నివేదిస్తున్నారు.
రాష్ట్ర వ్యాప్తంగా వరద ముంపు ప్రాంతాల్లో నిరంతరం అప్రమత్తంగా ఉండాలని అధికారులకు సీఎం కేసీఆర్ ఆదేశం జారీ చేశారు.
కాగా, మునుపెన్నడూ లేని రీతిలో తెలంగాణాలో రికార్డు స్థాయిలో వర్షపాతం నమోదయ్యింది. తెలంగాణ చరిత్రలో అత్యంత భారీ వర్షపాతాలు నమోదు అవుతున్నాయి.
ములుగు జిల్లా వాజేడులో గత 2013 జులై 19 తరవాత తిరిగి గడచిన 24 గంటలలో 51.5 సెం. మీల వర్షం పడింది.
గత 24 గంటలలో ములుగు జిల్లా వెంకటాపూర్ మండలం లక్ష్మీదేవిపేటలో 64 సెం. మీల వర్షం పడింది.
గత 24 గంటలలో రాష్ట్రంలోని 35 ప్రాంతాల్లో 20 సెం.మీ పైన వర్షపాతం నమోదయ్యింది. 200ల కేంద్రాల్లో 10 సెం. మీల పైగా వర్షం పడింది.
మరో వైపు భారీ వర్షపాతాలపై వాతావరణ శాఖ విస్మయాన్ని వ్యక్తంచేసింది. ఈ వర్షాలపై అధ్యయనం చేసేందుకు ఉపక్రమించింది.