భాష సరిగ్గా రాకపోతే ఇవ్వాళ్ళరేపు గూగుల్ ను అడిగినా చెప్తుంది. అయితే మన రాజకీయ నాయకులకు అంత ఓపిక కూడా ఉండదు. ఫ్యాన్స్ రాసే రాతలను తప్పులతో సహా నెత్తిన
భాష సరిగ్గా రాకపోతే ఇవ్వాళ్ళరేపు గూగుల్ ను అడిగినా చెప్తుంది. అయితే మన రాజకీయ నాయకులకు అంత ఓపిక కూడా ఉండదు. ఫ్యాన్స్ రాసే రాతలను తప్పులతో సహా నెత్తినపెట్టుకోవడం నేతలకు అలవాటుగా మారింది. ఆంధ్రప్రదేశ్ లో ముఖ్యమంత్రికి స్వాగతం పలుకుతూ ఓ మంత్రి ఏర్పాటు చేసిన ఫ్లెక్సీని చూసి జనం నవ్వుకుంటున్నారు.
ఏపీలోని రాజధాని (?)ప్రాంతంలోని కృష్ణాయపాలెంలో ఈ రోజు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పేదల ఇళ్ళ నిర్మాణాలకు శంకుస్థాపన చేశారు. ఉదయం 9:30 గంటలకు హెలీకాప్టర్‌లో తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరి కృష్ణాయపాలెం హౌసింగ్ లే అవుట్‌కు జగన్ చేరుకోన్నారు. అక్కడ పేదల ఇళ్ళ నిర్మాణాలకు ముఖ్యమంత్రి శంకుస్థాపన చేశారు.
ఈ సందర్భంగా ఆయనకు స్వాగతం పలుకుతూ మంత్రి ఆది మూలపు సురేష్ భారీ ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. జగన్ ఎంటర్ కాగానే కనపడే విధంగా కట్టిన ఓ ఫ్లెక్సీలో ”పేదలను ‘పేద్దోళ్ళు’గా చేస్తూ మీరు తీసుకున్న నిర్ణయం ‘చార్రితాత్మకం’ ” అంటూ ఫ్లెక్సీలో ముద్రించారు.
చారిత్రాత్మకం రాయాలసిన చోట ‘చార్రితాత్మకం’ పెద్దోళ్ళు అని రాయాల్సిన చోట ‘పేద్దోళ్ళు’ అని రాసిన ఈ ఫ్లెక్సీ చూసి స్థానిక జనాలు నవ్వుకోవడమే కాదు ఫోటోలు తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అవి వైరల్ గా మారి నెటిజనులు వ్యంగ్యంగా స్పంధిస్తున్నారు.
వైఎస్ జగన్ ఈ కార్యక్రమం అయిపోయిన తర్వాత వెంకటపాలెం లో బహిరంగ సభలో పాల్గొంటారు. ఆ బహిరంగ సభ కోసం వైసీపీ శ్రేణులు గుంటూరు , విజయవాడ , పెదకాకాని, మంగళగిరి , తాడేపల్లి, దుగ్గిరాల నుంచి పెద్ద ఎత్తున జనాలను తరలిస్తున్నారు. అందుకు వారు ప్రైవేటు కళాశాలల బస్సులను వినియోగిస్తున్నారు. విద్యార్ధులకు పరీక్షలు ఉన్నాయని బస్సులు ఇవ్వలేమని కళాశాలల యాజమాన్యాలు చెప్పినప్పటికీ బస్సులు ఇవ్వాల్సిందేనని యాజమాన్యాలపై ఒత్తిడి తీసుకువచ్చారని ఆరోపణలు వస్తున్నాయి.