HomeTelangana

సీఎం కేసీఆర్ నియోజకవర్గాన్ని మారుస్తున్నారా? గజ్వేల్‌కు గుడ్ బై చెప్తారా?

సీఎం కేసీఆర్ నియోజకవర్గాన్ని మారుస్తున్నారా? గజ్వేల్‌కు గుడ్ బై చెప్తారా?

ఇటీవల పలు అంతర్గత సర్వేలు చేయించిన సీఎం కేసీఆర్.. ఉత్తర తెలంగాణలోని కొన్ని నియోజకవర్గాల్లో పార్టీ కాస్త బలహీనంగా ఉన్నట్లు తెలుసుకున్నారు.

బీజేపీకి బిగ్ షాక్:బీఆరెస్ లోకి దత్తత్రేయ‌ కూతురు?
బీజేపీకి విజయశాంతి రాజీనామా!
హరీష్ రావు వ్యాఖ్యలతో రైతు బంధు డబ్బుల పంపిణీని నిలిపివేసిన ఈసీ

తెలంగాణ రాష్ట్ర సీఎం కేసీఆర్ తన నియోజకవర్గాన్ని మార్చుకుంటున్నారా? బీఆర్ఎస్ బలహీనపడుతున్న ప్రాంతం నుంచి పోటీ చేయాలని నిర్ణయించుకున్నారా? వరుసగా నాలుగుసార్లు గెలిచిన ఎమ్మెల్యేనే పక్కకు తప్పించబోతున్నారా? అంటే అవుననే సమాధానమే వస్తోంది. రాబోయే అసెంబ్లీ ఎన్నికల కచ్చితంగా బీఆర్ఎస్‌కు విషమ పరీక్ష అనుకోవాలి. వరుసగా రెండు సార్లు అధికారంలో ఉండటం.. పార్టీ పేరును టీఆర్ఎస్ నుంచి బీఆర్ఎస్‌గా మార్చడంతో ప్రజల్లో కాస్త వ్యతిరేకత నెలకొన్నది. సీఎం కేసీఆర్, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పైకి 100 సీట్లు గెలుస్తామని చెప్తున్నా.. లోపల మాత్రం కాస్త ఆందోళనగానే ఉన్నారు.

ఇటీవల పలు అంతర్గత సర్వేలు చేయించిన సీఎం కేసీఆర్.. ఉత్తర తెలంగాణలోని కొన్ని నియోజకవర్గాల్లో పార్టీ కాస్త బలహీనంగా ఉన్నట్లు తెలుసుకున్నారు. ముఖ్యంగా ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో బీఆర్ఎస్ పార్టీకి వ్యతిరేక పవనాలు వీస్తున్నట్లు సర్వేల్లో తేలింది. దీంతో స్వయంగా కేసీఆర్ రంగంలోకి దిగాలని నిర్ణయించుకున్నారు. కామారెడ్డి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేయాలని ప్రాథమికంగా నిర్ణయించినట్లు ప్రచారం జరగుతోంది. ప్రస్తుతం గజ్వేల్ నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్న సీఎం కేసీఆర్.. రాబోయే ఎన్నికల్లో కామారెడ్డి నుంచి పోటీ చేస్తారనే చర్చ జరుగుతోంది.

కామారెడ్డి నియోజకవర్గం ఎమ్మెల్యే గంపా గోవర్థన్ ప్రస్తుతం ప్రజా వ్యతిరేకతను ఎదుర్కుంటున్నారు. 2009 నుంచి వరుసగా గెలుస్తూ వస్తున్న గంపా గోవర్థన్‌కు ఈ సారి టికెట్ నిరాకరించే అవకాశం ఉన్నట్లు తెలుస్తున్నది. 2009లో టీడీపీ తరపున పోటీ చేసి గెలిచిన గోవర్థన్.. 2012లో తెలంగాణ కోసం రాజీనామా చేసి.. తిరిగి టీఆర్ఎస్ టికెట్‌పై గెలిచారు. 2014, 2018లో వరుసగా గెలిచారు. అయితే, ఇటీవల నిర్వహించిన సర్వేలో.. గోవర్థన్‌పై తీవ్ర వ్యతిరేకత ఉన్నట్లు తేలింది. దీంతో స్వయంగా కేసీఆర్ రంగంలోకి దిగినట్లు తెలిసింది.

ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోని పలు నియోజకవర్గాల్లో కూడా బీఆర్ఎస్ పార్టీకి వ్యతిరేక పవనాలు వీస్తుండటంతో.. కామారెడ్డి నుంచి కేసీఆర్ పోటీ చేయడం వల్ల కలిసోస్తుందని అంచనా వేస్తున్నారు. ఇప్పటికే గజ్వేల్‌లో వంటేరు ప్రతాప్ రెడ్డికి కేసీఆర్ పూర్తి స్వేచ్ఛను ఇచ్చారు. బీఆర్ఎస్ అభ్యర్థిగా గజ్వేల్ నుంచి వంటేరు పోటీ చేస్తారని.. కేసీఆర్ కామారెడ్డికి మారిపోతారని తెలుస్తున్నది. ఇక్కడి నుంచి పోటీ చేయడం వల్ల రామాయంపేట, ఎల్లారెడ్డి, నిజామాబాద్ రూరల్, జుక్కల్ అసెంబ్లీ నియోజకవర్గాలపై కూడా ప్రభావం చూపే అవకాశం ఉండటం వల్లే సీఎం దీన్ని ఎంచుకున్నట్లు తెలుస్తున్నది.

సీఎం సొంత ఊరు కామారెడ్డి నియోజకవర్గంలోని దోమకొండ మండలం పోపానిపల్లె. మానేరు డ్యాం నిర్మాణ సమయంలో పోపానిపల్లె ముంపునకు గురి కావడంతో కేసీఆర్ కుటుంబం సిద్దిపేట జిల్లా చింతమడకకు వలస వచ్చారు. ఇప్పుడు మరోసారి తన పూర్వీకుల ఊరైన పోపానిపల్లె (ప్రస్తుతం కోనాపూర్) ఉన్న కామారెడ్డి నియోజకవర్గం నుంచి పోటీ చేయడం వల్ల సెంటిమెంట్ కూడా కలిసి వస్తుందని భావిస్తున్నారు.