యూనిఫామ్ సివిల్ కోడ్ పై 'ఆప్' లో చీలిక? కేంద్ర బీజేపీ సర్కార్ తీసుకరానున్న యూనిఫామ్ సివిల్ కోడ్ (UCC)విషయంలో ఆమ్ ఆద్మీ పార్టీ రెండుగా చీలిపోయిందా ?
యూనిఫామ్ సివిల్ కోడ్ పై ‘ఆప్’ లో చీలిక?
కేంద్ర బీజేపీ సర్కార్ తీసుకరానున్న యూనిఫామ్ సివిల్ కోడ్ (UCC)విషయంలో ఆమ్ ఆద్మీ పార్టీ రెండుగా చీలిపోయిందా ? UCC ని సమర్ధిస్తూ ప్రకటన ఇచ్చిన ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు కేజ్రీవాల్ అభిప్రాయానికి వ్యతిరేకంగా ఆప్ నేత, పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ UCC విషయంలో మోడీ సర్కార్ పై మండిపడ్డారు. UCCని తాము వ్యతిరేకిస్తున్నామని స్పష్టం చేశారు. ఎన్నికల లాభం కోసం మతపరమైన సమస్యలను లేవనెత్తుతున్నారని ఆరోపిస్తూ నరేంద్ర మోడీ ప్రభుత్వాన్ని నిందించారు.
ఆప్ లౌకిక పార్టీ అని, ఏ సామాజిక వర్గానికి చెందిన సామాజిక ఆచారాలతో చెలగాటమాడే ఉద్దేశం తమకు లేదని ఆయన స్పష్టం చేశారు. మాన్ వ్యాఖ్యలు ఇప్పుడు ఈ అంశంపై పార్టీ యొక్క అసలు స్టాండ్ ఏమిటనే ప్రశ్నలను లేవనెత్తుతున్నాయి. అతని వ్యాఖ్యలకు అకాలీదళ్ నుండి తీవ్ర స్పందన వచ్చింది. ఆప్ తన వైఖరిని స్పష్టంగా చెప్పాలని అకాలీదళ్ డిమాండ్ చేసింది.
మంగళవారం భగవంత్ మాన్ మీడియాతో మాట్లాడుతూ, భారతదేశాన్ని పూల గుత్తితో పోల్చారు, విభిన్న రంగుల పువ్వులు ఒక సమాజంలోని వివిధ ఆచారాలను సూచిస్తాయి. “గుత్తిలో ఒకే రంగు ఉండాలని బీజేపీ కోరుకుంటుందా ?” అని ఆయన ప్రశ్నించారు.
అలాగే ప్రతి మతానికి ఒక్కో సంస్కృతి, ఆచార వ్యవహారాలు ఉంటాయని, అందుకే ఏకాభిప్రాయాన్ని పెంపొందించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. “వారు ఈ ఆచార వ్యవహారాలలో ఎందుకు వేలుపెడుతున్నారో నాకు తెలియదు. కమ్యూనిటీలను తెగలుగా విభజించవద్దు’’ అని అన్నారు మాన్.
”యూనిఫాం సివిల్ కోడ్‌ను సమర్ధించే వారు సామాజికంగా అందరూనీ సమానమని చెప్తున్నారు. అందరూ సామాజికంగా సమానంగా ఉన్నారా? లేదు.. అణగారిన వారు చాలా మంది ఉన్నారు, వారికి అవకాశాలు రావడం లేదు, ”అని ఆయన అన్నారు.
2024 సార్వత్రిక ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని భారతీయ జనతా పార్టీ (బిజెపి) ఈ అంశాన్ని లేవనెత్తిందని మన్ ఆరోపించారు. “ఆప్ అటువంటి ఎత్తుగడలకు లొంగదు, ఆప్ లౌకిక పార్టీ, దేశం నంబర్ 1 కావాలని మేము కోరుకుంటున్నాము,” అని ఆయన అన్నారు.
కాగా గత వారం ఆ పార్టీ ఎంపీ సందీప్ పాఠక్ మాట్లాడుతూ, “సూత్రప్రాయంగా, మేము యూనిఫాం సివిల్ కోడ్‌కు మద్దతు ఇస్తున్నాము. రాజ్యాంగంలోని ఆర్టికల్ 44 కూడా దీనికి మద్దతు ఇస్తుంది. అయితే ఈ సమస్య అన్ని మత సంఘాలకు సంబంధించినది కాబట్టి, ఏకాభిప్రాయాన్ని పెంపొందించడానికి విస్తృత స్థాయి సంప్రదింపులు మరియు ప్రయత్నాలు జరగాలి.” అన్నారు.
అయితే అందుకు విరుద్దంగా ఉన్న మాన్ ప్రకటన ఇప్పుడు ఆ పార్టీలోనే ప్రకంపనలు రేపుతున్నాయి. అంతే కాక ఇతర పార్టీల్ అనేతలు కూడా ఆప్ పై విమర్శలు ఎక్కుపెడుతున్నారు.
“పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ UCCపై తన వైఖరిని AAP కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్‌కి చెప్పారా ? ఈ సున్నితమైన సమస్యపై AAP ద్వంద్వ నీతి అవలంభిస్తోంది. పంజాబ్‌లో పార్టీ వ్యతిరేకమని భగవంత్ మాన్ పంజాబీలను మోసం చేస్తున్నప్పటికీ రాజ్యసభలో యూసీసీకి అనుకూలంగా ఓటు వేయాలని ఆప్ కోరడం దిగ్భ్రాంతికరం’’ అని అకాలీదళ్ నాయకుడు దల్జీత్ ఎస్ చీమా వీడియో ప్రకటనతో పాటు ట్వీట్ చేశారు.
పంజాబ్ జనాభాలో 60% సిక్కులు ఉన్నారు. దేశాన్ని హిందుత్వ దేశంగా చేయడం లో భాగంగా సిక్కు చరిత్ర, సంస్కృతిని “వక్రీకరించడానికి” బిజెపి ప్రయత్నిస్తోందని పలువురు సిక్కు నాయకులు, సంస్థలు చాలా కాలంగా ఆరోపిస్తున్నారు.
గత సంవత్సరం, పంజాబ్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్‌లలోని గురుద్వారాలను నియంత్రిస్తున్న శిరోమణి గురుద్వారా పర్బంధక్ కమిటీ (SGPC) కూడా యూనిఫాం సివిల్ కోడ్‌కు వ్యతిరేకంగా ఒక ప్రకటన విడుదల చేసింది. యూసీసీ దేశ ప్రయోజనాలకు విరుద్ధమని ఆ ప్రకటన పేర్కొంది.