ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ అరెస్టు చేసి జైలులో పెట్టాలని కేంద్ర బీజేపీ ప్రభుత్వం తీవ్ర ప్రయత్నాల్లో ఉంది. ఢిల్లీ లిక్కర్ స్కాంలో గతంలో కేజ్రీవాల్
ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ అరెస్టు చేసి జైలులో పెట్టాలని కేంద్ర బీజేపీ ప్రభుత్వం తీవ్ర ప్రయత్నాల్లో ఉంది. ఢిల్లీ లిక్కర్ స్కాంలో గతంలో కేజ్రీవాల్ ను సీబీఐ విచారించగా ఇప్పుడు ఈడీ విచారణకు రావాల్సిందిగా ఆయనను ఆదేశించింది. అయితే ఆయన విచారణకు హాజరుకాలేదు. తనకు జారీ చేసిన సమన్లు చట్టవిరుద్ధమైనవి, రాజకీయంగా ప్రేరేపించబడినవని ఆయన ఆరోపించారు. బీజేపీ ఆదేశాల మేరకే ఈ సమన్లు పంపినట్లు కేజ్రీవాల్ పేర్కొన్నారు.
ఈ నేపథ్యంలో కేజ్రీవాల్ ను అరెస్టు చేయవచ్చనే వార్తలు వస్తున్నాయి. దాంతో ఈ రోజు ఎమ్మెల్యేలతో కేజ్రీవాల్ సమావేశం ఏర్పాటు చేశారు. ఆయనను ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయవద్దని ఈ సమావేశంలో ఆప్ ఎమ్మెల్యేలు కోరారు. జైలు నుంచి ప్రభుత్వాన్ని నడపాలని ఆయనను నేతలు కోరారు.
”బీజేపీ కేజ్రీవాల్ ను అడ్డు తొలగించుకోవాలనుకుంటోంది. మా పార్టీని నాశనం చేయాలని బీజేపీ కుట్ర చేస్తున్నది. ఢిల్లీ ప్రజలు కేజ్రీవాల్‌ను ముఖ్యమంత్రిగా ఎన్నుకున్నారు. కాబట్టి, ఆయనే సీఎంగా ఉండాలి. జైలులో మంత్రివర్గ సమావేశం ఏర్పాటు చేసేందుకు మేము కోర్టు నుంచి అనుమతి తెచ్చుకుంటాం. ” అని ఢిల్లీ మంత్రి అతిశి మార్లేనా పేర్కొన్నారు.