కాసినో కింగ్ చీకోటి ప్రవీణ్ పై కేసులు చుట్టుముడుతుండటంతో వాటి నుంచి బైటపడేందుకు ఆయన బీజేపీలో చేరాలనుకున్నారు. ఆయనపై మనీలాండరింగ్ కేసుతో పాటు వివిధ ప
కాసినో కింగ్ చీకోటి ప్రవీణ్ పై కేసులు చుట్టుముడుతుండటంతో వాటి నుంచి బైటపడేందుకు ఆయన బీజేపీలో చేరాలనుకున్నారు. ఆయనపై మనీలాండరింగ్ కేసుతో పాటు వివిధ పోలీసు స్టేషన్లలో పలు క్రిమినల్ కేసులు నమోదయ్యాయి. ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ విచారణను ఆయన ఎదుర్కొంటున్నారు. అలాగే, బోనాల పండుగ సందర్భంగా అక్రమ ఆయుధాలతో ప్రయివేటు సెక్యూరిటీ గార్డులను నియమించుకున్నందుకు హైదరాబాద్ లోని ఛత్రినాక పోలీసులు చీకోటిపై కేసు నమోదు చేశారు.
అందుకే ఆయన బీజేపీలో చేరాలనుకున్నారు. అందుకు ఆయనకు రాజకీయ అనుభవం ఏమీ లేకపోయినా ఎన్నికల్లో ఎంతైనా ఖర్చుపెట్టగల డబ్బుంది. దాంతో ఆయన అనేక ప్రయత్నాలు చేసికొద్ది రోజుల క్రితం బీజేపీలో చేరడానికి రంగం సిద్దం చేసుకున్నాడు. అయితే ఆయన అక్రమ కార్యకలాపాలవల్ల పార్టీకి చెడ్డపేరు వస్తుందని భావించిన ఆ పార్టీ తెలంగాణ అధ్యక్షుడు కిషన్ రెడ్డి చీకోటి చేరికను అడ్డుకున్నారు.
బీజేపీలో చేరడానికి డేట్ ఫిక్స్ అయ్యి, మంది మార్బలం, మేలతాళాలతో బీజేపీ కార్యాలయానికి చేరుకున్న చీకోటికి అక్కడ తీవ్ర అవమానం ఎదురయ్యింది. ఆఫీస్ లో ఆయనను చేర్చుకోవడానికి ఒక్కరు కూడా కనిపించలేదు. చీకోటి వస్తున్నాడని తెలిసి కిషన్ రెడ్డితో సహా అందరూ అక్కడి నుంచి జారుకున్నారు. దాంతో చీకోటి అవమానంతో రగిలిపోయాడు. మళ్ళీ ఏదో ఓ రోజు తానేంటో నిరూపిస్తానని, బీజేపీలో చేరితీరుతానని ప్రతినబూనాడు. ఆయన చెప్పినట్టే ఈ రోజు ఆయన బీజేపీలో చేరిపోయాడు.
చీకోటి చేరికను కిషన్ రెడ్డి ఎంత వ్యతిరేకించినప్పటికీ ఆ పార్టీ అధిష్టానం మాత్రం చీకోటికే జైకొట్టింది. చీకోటి వద్ద ఉన్న డబ్బు రాబోయే ఎన్నికలకు ఎంతో అవసరమని భావించి బీజేపీ నాయకులు ఎట్టి పరిస్థితుల్లోనైనా చీకోటి ప్రవీణ్ ను పార్టీలో చేర్చుకోవాల్సిందే అని పార్టీ రాష్ట్ర శాఖకు ఆల్టిమేటం జారీ చేసినట్టు సమాచారం.చీకోటిని చేర్చుకోవాలని కేంద్ర హోం మంత్రి అమిత్ షా రాష్ట్ర నాయకులను ఆదేశించినట్టు సమాచారం. దాంతో లైన్ క్లియర్ అయిన చీకోటి ఈ రోజు బీజేపీ హైదరాబాద్ నగర శాఖ కార్యాలయంలో బీజేపీలో చేరారు. అయితే ఈ రోజు కూడా కిషన్ రెడ్డి మొహం చాటేశారు. దాంతో బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ చీకోటికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
పార్టీలో చేరిపోయారు కాబట్టి ఇక టికట్ కోసం ప్రయత్నించడమే తరువాయి. హైదరాబాద్ నగర పరిథిలో ఏదో ఒక నియోజకవర్గం నుండి పోటీ చేయాలని చీకోటి అనుకుంటున్నాడు. కిషన్ రెడ్డికి ఇష్టమున్నా లేకపోయినా అధిష్టానానికి ఇష్టుడైనా మనిషి కాబట్టి టికట్ రావడం కూడా సులభమే అని చీకోటి అనుచరులు భావిస్తున్నారు.
అయితే జైలుకు కాకుండా అసెంబ్లీకి పోవాలన్న ఈ కాసినో కింగ్ కోరిక నెరవేరుతుందా లేదా అనేది త్వరలోనే తేలిపోతుంది.