ప్రత్యేక తెలంగాణ ఏర్పాటుకు బహిరంగంగా మద్దతు ఇచ్చి, రహస్యంగా అందుజు వ్యతిరేకంగా పని చేసిన తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు సడెన్ గా తెలంగ
ప్రత్యేక తెలంగాణ ఏర్పాటుకు బహిరంగంగా మద్దతు ఇచ్చి, రహస్యంగా అందుజు వ్యతిరేకంగా పని చేసిన తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు సడెన్ గా తెలంగాణపై పొగడ్తలు గుప్పించడం వెనక కారణమేంటి ? ఓటుకు నోటు వ్యవహారంలో రాత్రికి రాత్రి హైదరాబాద్ ను వదిలి వెళ్ళిపోయిన బాబుకు తెలంగాణపై ప్రేమ కలగడానికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పై ఉన్న కోపం కారణమా లేక కేసీఆర్ తో ఎలాగైనా సంధి చేసుకోవాలనే ప్లాన్ ఉందా ?
నిన్న ఆంధ్రప్రదేశ్ లోని మంగళగిరిలో జరిగిన తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యవర్గ సమావేశంలో పార్టీ కార్యకర్తలను ఉద్దేశించి బాబు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విధానాల వల్ల తెలంగాణ అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతోందని, వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్ అన్ని రంగాల్లో వెనుకబడి ఉందన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో ఒక రైతు ఎకరం భూమి అమ్మితే హైదరాబాద్‌లో నాలుగైదు ఎకరాలు కొనే పరిస్థితి ఉండేదని, ఇప్పుడు పరిస్థితి తారుమారయ్యిందని, హైదరాబాద్‌లో ఎకరం అమ్మితే ఏపీలో 100 ఎకరాలు కొనుగోలు చేయవచ్చని అన్నారు.
ఏ రాష్ట్రంలో అభివృద్ధి జరిగినా భూమి విలువ ఆటోమేటిక్‌గా పెరుగుతుందని అన్నారు. సాగునీటికి నీరు అందుబాటులో ఉంటే, ప్రాంతంతో పాటు, భూమి విలువ కూడా పెరుగుతుంది. పరిశ్రమలు, రోడ్లు వస్తే విలువ పెరుగుతుందన్నారు.
తెలంగాణలో జరుగుతున్న అభివృద్ధిని ఆంధ్రప్రదేశ్‌తో పోల్చిన నాయుడు, ఆంధ్రప్రదేశ్‌తో పోలిస్తే తెలంగాణ చాలా అభివృద్ధి చెందిందని, అందుకే భూముల విలువ పెరిగిందని అన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం అవలంభిస్తున్న రైతు వ్యతిరేక విధానాల వల్ల భూముల విలువ భారీగా పడిపోయిందని ఆరోపించారు.
తెలంగాణ అభివృద్ధి గురించి, తెలంగాణ అభివృద్ధి జరిగిన తీరు గురించి బాబు మాట్లాడటం ఇదే మొదటిసారి కాదు. ఇటీవల కూడా ఆయన ఇక్కడి భూముల ధరలపై మాట్లాడుతూ, ముఖ్యమంత్రి కేసీఆర్ గొప్ప నాయకత్వం, సమర్ధవంతమైన పాలన వల్లే తెలంగాణలో భూముల విలువ పెరిగిందన్నారు.
మరో వైపు తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి చంద్రబాబు శిష్యుడని, రేవంత్ ను ఆయనే నడిపిస్తున్నాడని ఎప్పుడూ ఆరోపణలు చేసే బీఆరెస్ నాయకులు, కార్యకర్తలు చంద్రబాబు కేసీఆర్ ను పొగుడుతూ మాట్లాడిన మాటలను మాత్రం సోషల్ మీడియాలో షేర్లు చేస్తున్నారు. వారి పత్రికలో మొదటి పేజీలో వేసుకొని మరీ ప్రచారం చేసుకుంటున్నారు.