తెలంగాణ రాష్ట్ర హైకోర్టులో ఇవాళ (19.07.2023) చారిత్రాత్మక తీర్పు వెలువడింది. హైదరాబాద్కు చెందిన సందేపాగు రూప, డేవిడ్ దంపతులు తమ కుమారుడు ఇవాన్ రూడేకి
తెలంగాణ రాష్ట్ర హైకోర్టులో ఇవాళ (19.07.2023) చారిత్రాత్మక తీర్పు వెలువడింది. హైదరాబాద్కు చెందిన సందేపాగు రూప, డేవిడ్ దంపతులు తమ కుమారుడు ఇవాన్ రూడేకి పుట్టుకతో కులరహిత, మతరహిత సర్టిఫికేట్ ను ఇవ్వాలని తెలంగాణ హైకోర్టులో 2019 ఆగస్టు 28న నమోదు చేసిన రిట్ పిటిషన్ పైన్పై ఇవాళ జస్టిస్ లలిత కన్నెగంటి కీలకమైన తీర్పును వెలువరించారు. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 25 ప్రకారం ఒక వ్యక్తి తనకు నచ్చిన మతాన్ని విశ్వసించే స్వేచ్చ ఉన్నట్లుగానే తమకు నమ్మకం లేని మతాన్ని విశ్వసించని హక్కు కూడా ఉంటుంది. ఇది భావప్రకటన స్వేచ్ఛలో భాగం కాబట్టి పిటిషనర్లు కోరినట్లుగా ‘బర్త్ సర్టిఫికేట్’ లో కుల రహిత, మత రహిత’ కాలాన్ని పొందపరచాలని, దీని కోసం చర్యలు తీసుకోవాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు తెలిపింది.
వివరాల్లోకి వెళితే 2019, మార్చి 23న జన్మించిన తమ కొడుకు ‘ఇవాన్ రూడే’ బర్త్ సర్టిఫికెట్ కోసం దంపతులు వనపర్తి జిల్లా కొత్తకోట మున్సిపాలిటీకి వెళ్లారు (బాబూ జన్మించిన ప్రాంతం). జనన నమోదు ఫారం లోని కుటుంబ ‘మతం’ అనే కలామ్ నింపితే తప్ప బర్త్ సర్టిఫికెట్ ఇవ్వడం కుదరదని చెప్పడంతో, కులాంతర, మతాంతర వివాహం చేసుకున్న వీళ్ళు మతాన్ని, కులాన్ని విశ్వసించడం లేదు కాబట్టి అందులో ఉన్న ‘కుటుంబ మతం’ అనే కాలామ్ నింపడానికి నిరాకరించారు. ఆ కాలమ్ నింపితే తప్ప బర్త్ సర్టిఫికెట్ ఇవ్వడం కుదరని మున్సిపాలిటీ అధికారులు చెప్పడంతో వాళ్ళు జిల్లా కలెక్టర్ తో సహా పై అధికారులను ఆశ్రయించారు. తాము కోరిన పద్ధతుల్లో బర్త్ సర్టిఫికెట్ ఇవ్వకపోవడంతో వాళ్ళు ఎట్టకేలకు హైకోర్టులో 2019, ఆగస్టు 28న పిల్ ను దాఖలుచేశారు.
గతంలో విచారణ చేపట్టిన జస్టిస్ శ్రీ రాఘవేంద్ర సింగ్ చౌహాన్, జస్టిస్ ఎ. అభిషేక్ రెడ్డిల తో కూడిన ధర్మాసనం వీళ్ళ డిమాండ్ పైన కౌంటర్ దాఖలు చేయమని కోరుతూ జనన మరణ ధ్రువీకరణ అధికారులకు (Register, Census), రాష్ట్ర ప్రభుత్వ కార్యదర్శికి, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ కార్యదర్శికి, కొత్తకోట మున్సిపాలిటీ అధికారులకు నోటీసులు పంపింది. తదుపరి విచారణను నాలుగు వారాల గడువు విధించింది. అయితే సంవత్సరాలు గడుస్తున్న ప్రతివాదులు కౌంటర్ దాఖలు చేయకపోగా, మరింత సమయాన్ని కోరుతూ వాయిదా వేస్తూ వచ్చారు.
5 సంవత్సరాల లోపు బర్త్ సర్టిఫికేట్ తీసుకోవాలని ప్రభుత్వ నియమాలు ఉన్న నేపథ్యంలో, బర్త్ సర్టిఫికేట్ లేని కారణంగా ఆధార్ కార్టు ఇవ్వకపోవడం అలాగే స్కూల్లో చేర్చుకోవడానికి విద్యాసంస్థలు నిరాకరించడంతో అత్యవసరంగా తీర్పు ఇవ్వాలని పిటిషనర్ల తరపున న్యాయవాదులు ఎస్. వెంకన్న, డి. సురేష్ కుమార్ లు కోర్టు దృష్టికి తీసుకెళ్లడంతో కోర్టు ఎట్టకేలకు తీర్పువెలువరించింది.
తీర్పుపట్ల దంపతులు హర్షం….
తాము కోరినట్లుగా జస్టిస్ లలిత కన్నెగంటి తీర్పు ఇవ్వడం పట్ల డేవిడ్, రూప దంపతులు హర్షం వ్యక్తం చేశారు. మూడు సంవత్సరాల తమ పోరాటం ఫలించినందుకు ఆనందం వ్యక్తం చేశారు. చారిత్రాత్మకమైన ఈ తీర్పు ఎంతో మందికి దారి చూపుతుందని ఆశాభావాన్ని వ్యక్తం చేశారు.
ఈ దేశంలో కుల,మతాలకు అతీతంగా జీవిస్తున్న వాళ్ళు ఎందరో ఉన్నారని, వీటికి వ్యతిరేకంగా సుదీర్ఘ పోరాట చరిత్ర కూడా ఉందని, మతాన్ని, కులాన్ని వదులు కుంటామని ఎవరైనా ముందుకు వస్తే వ్యక్తిగత స్థాయిల్లో ఏదో సర్దుబాటు చేస్తూ పరిష్కారం చూపుతున్నారే తప్ప చట్టం చేయడానికి మాత్రం ప్రభుత్వం వెనుకడుగు వేస్తున్న తరుణంలో శాశ్వత పరిష్కారాన్ని చూపుతూ తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పు చారిత్రాత్మకమైనదన్నారు.
తమిళనాడు కు చెందిన న్యాయవాది ‘ఎం. స్నేహ’ తనకు ఇచ్చే సర్టిఫికెట్ లో No Caste — No religion అనే అప్షన్ ఉండాలని ప్రయత్నిస్తే ఎట్టకేలకు స్థానిక కలెక్టర్ ఆమెకు సర్టిఫికెట్ అందజేశారు కానీ ఆన్లైన్ లో ఏదైనా దరఖాస్తు చేసుకోవాలన్నా మళ్ళీ సమస్యను ఎదుర్కోవాల్సి వచ్చింది. అలాగే హైదరాబాద్ కు చెందిన డి.వి. రామకృష్ణ రావు, ఎస్. క్లారెన్స్ కృపాళిని దంపతులు కూడా ఇదే డిమాండ్ పై కోర్టును ఆశ్రయించారు. తమ పిల్లల అడ్మిషన్ సందర్భంగా మతం అనే కాలమ్ నింపితే తప్ప అడ్మిషన్ ఇవ్వమని స్కూల్ యాజమాన్యం చెప్పడంతో వాళ్ళు కోర్టును ఆశ్రయించారు. మతం చెప్పడానికి నిరాకరించిన కారణంగా అడ్మిషన్ ఇవ్వకపోవడం సరైనది కాదని కోర్టు చివాట్లు పెట్టడంతో స్కూల్ యాజమాన్యం ఎట్టకేలకు అడ్మిషన్ ఇచ్చింది. కానీ ఆన్లైన్ వ్యవహారాల్లో మతం, కులం అనే కాలం ఇప్పటికీ వెంటాడుతూనే ఉంది కాబట్టి శాశ్వత పరిష్కారం చూపేలా చర్యలు తీసుకునేలా కోర్టు ఆదేశించాలని కోరారు.
మతాన్ని నమ్మే హక్కు ఎలాగైతే ఉందో, వాటిని నమ్మకుండా ఉండే హక్కు కూడా రాజ్యాంగమే కల్పించింది కాబట్టి తమ లాంటి వాళ్ల డిమాండు పరిగణలోకి తీసుకొని జస్టిస్ లలిత కన్నెగంటి ఇచ్చిన తీర్పు తమలాంటి వాళ్లకు న్యాయం చేస్తుందని ఆశాభావాన్ని వ్యక్తం చేశారు.