HomePoliticsNational

ఎన్డీయే Vs ఇండియా.. బీజేపీకి దేశభక్తితోనే చెక్ పెట్టబోతున్న కాంగ్రెస్!

ఎన్డీయే Vs ఇండియా.. బీజేపీకి దేశభక్తితోనే చెక్ పెట్టబోతున్న కాంగ్రెస్!

తొమ్మిదిన్నర ఏళ్లుగా బీజేపీని సరిగ్గా ఎదుర్కోలేక పోతున్నామని భావించిన విపక్షాలు.. ఈ సారి మాత్రం గట్టి కౌంటర్ ఇవ్వబోతున్నాయి.

‘కవితకు ఈడీ నోటీసులు పెద్ద డ్రామా’
Telangana: రాబోయే ఎన్నికల్లో రజాకార్ల సర్కార్ ఓడిపోతుంది, బీజేపీ అధికారంలోకి వస్తుంది -అమిత్ షా
మీ పిలుపు కోసం నిలువెల్ల చెవులై… కేసీఆర్ ను ఒదిలేసినట్టేనా ?

2014లో బీజేపీ ఆధ్వర్యంలోని ఎన్డీయే కూటమి కేంద్రంలో అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి.. అంతకు ముందు దేశాన్ని ఏలిన యూపీఏ కూటమి ఒక్కసారిగా డీలా పడిపోయింది. కాంగ్రెస్‌తో పాటు ఆ పార్టీకి మద్దతు ఇస్తున్న ప్రతీ పొలిటికల్ పార్టీని చీల్చుతూ, ప్రభుత్వాలను కూల్చుతూ.. బీజేపీ దేశంలో తామే బలవంతులం అని చాటి చెప్పుకున్నది. 2014లో యూపీఏ కూటమి ఓటమి పాలైన తర్వాత.. దానికి నాయకత్వం వహించిన కాంగ్రెస్‌లో కూడా అనేక పరిణామాలు చోటు చేసుకున్నాయి. సోనియా గాంధీ తప్పుకొని రాహుల్‌కు పగ్గాలు అప్పగించడం.. రాహుల్‌ను ఎన్డీయే.. ముఖ్యంగా బీజేపీ ఒక పప్పూలాగా ముద్రవేయడంలో సక్సెస్ అయ్యాయి. అంతే కాకుండా యూపీఏ కూటమిని కకలావికలం చేయడంలో బీజేపీ పూర్తిగా విజయవంతం అయ్యింది.

బీజేపీ (ఎన్డీయే కూటమి) కొడుతున్న దెబ్బలకు యూపీఏ కనీసం కోలుకోలేక పోయింది. 2019 సార్వత్రిక ఎన్నికల సమయంలో ఎలాంటి నినాదంతో ముందుకు వెళ్లాలనే ఆలోచనే చేయలేకపోయింది. అప్పటికే దేశ ప్రజలు డీమానిటైజేషన్ వంటి షాక్ తగిలి ఉన్నా.. యూపీఏ కూటమి దాన్ని క్యాష్ చేసుకోలేక పోయింది. 2019 తర్వాత ప్రధాని మోడీని మరింత బలమైన వ్యక్తిగా బీజేపీ, ఆర్ఎస్ఎస్, ఎన్డీయే ప్రొజెక్ట్ చేసింది. అదే సమయంలో పలు రాష్ట్రాల్లో ఏర్పడిన బీజేపీయేతర ప్రభుత్వాలను చీల్చి.. కొత్తగా ప్రభుత్వాలను బీజేపీ ఏర్పాటు చేసింది. మరోవైపు ఐటీ, ఈడీ, సీబీఐ రైడ్స్ అంటూ కొన్ని పార్టీల నాయకులను తమ అదుపులోకి తెచ్చుకున్నది.

2019 ఎన్నికల్లో ఎన్డీయే కూటమిలోని చిన్న పార్టీలు దెబ్బతిన్నా.. బీజేపీ స్వయంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే స్థాయికి ఎదిగింది. దీంతో ఆ తర్వాత కూటమిలోని మిగిలిన రాజకీయ పార్టీలను పట్టించుకోవడం మానేసింది. ముఖ్యంగా బీహార్‌లోని జేడీయూను ఇబ్బంది పెట్టడంతో నితీశ్ కుమార్ ఎన్డీయే నుంచి బయటకు వచ్చారు. మరి కొన్ని పార్టీలు కూడా బీజేపీపై బహిరంగంగా వ్యతిరేకత చూపకపోయినా.. మోడీ ప్రభుత్వానికి దూరంగా ఉంటూ వస్తున్నాయి.

కాంగ్రెస్ పార్టీనీ, రాహుల్ గాంధీని మొదటి నుంచి డీఫేమ్ చేస్తూ వచ్చిన బీజేపీ.. భారత్ జోడో యాత్ర తర్వాత పునరాలోచనలో పడింది. దేశవ్యాప్తంగా రాహుల్‌కు ఫేమ్ రావడం, కాంగ్రెస్ అధ్యక్ష బాధ్యతలు నెహ్రూ-గాంధీయేతర వ్యక్తికి కట్టబెట్టడంతో ప్రజలు గమనిస్తూ వచ్చారు. అదే సమయంలో బీజేపీ ప్రభుత్వ హయాంలో పెరిగిన ధరలు, సామాన్యడు పడుతున్న ఇబ్బందులు విస్తృతంగా ప్రచారంలోకి వచ్చాయి. బీజేపీ.. ఈడీ, సీబీఐ, ఐటీ వంటి కేంద్ర సంస్థలను అడ్డు పెట్టుకొని చేసిన అరాచకాలను కూడా అందరూ గమనించారు. ఇవన్నీ బీజేపీ, మోడీ, ఎన్డీయేకు పెద్ద మైనస్‌గా మారాయి.

కాంగ్రెస్ ఆధ్వర్యంలోని యూపీఏ.. కాస్త చెల్లాచెదురు అయినా.. కొత్తగా మరో కూటమిని కూడగట్టడానికి చాలా కాలంగా చేస్తున్న ప్రయత్నాలు సఫలం అయ్యాయి. తెలుగు రాష్ట్రాలకు చెందిన వైసీపీ, టీడీపీ, బీఆర్ఎస్ తప్ప.. మిగిలిన ప్రాంతీయ పార్టీలన్నీ.. కాంగ్రెస్ లేదా బీజేపీ కూటమిలో చేరడానికి సిద్ధమయ్యాయి. కాంగ్రెస్ పార్టీ చేసిన ప్రయత్నాలు ఫలించి.. చివరకు ఇండియా అనే పేరుతో కొత్త కూటమిని ఏర్పాటు చేశారు. డెమోక్రటిక్, ప్రోగ్రెసీవ్ అనే పేర్లు వాడకుండా.. డెవలప్‌మెంట్ అనే పేరుతో ఇండియా కూటమిని రూపొందించారు.

ఎన్డీఏ ప్రభుత్వం ఎక్కడైతే విఫలం అయ్యిందో.. అక్కడి నుంచే తమ ప్రస్థానం ప్రారంభించాలని ఇండియా కూటమి నిర్ణయించింది. బెంగళూరులో సోమ, మంగళవారాల్లో కీలకంగా చర్చించిన విషయాల్లో.. దేశ ప్రజల దృష్టిని ఆకర్షించింది ఈ పేరే అని ఇప్పటికే సోషల్ మీడియాలో చర్చ జరుగుతున్నది. బీజేపీ ఆధ్వర్యంలోని ఎన్డీయే ప్రభుత్వం.. దేశ సంపదను దోచేస్తోంది. కానీ.. ఇప్పుడు కొత్తగా వచ్చిన ఇండియా కూటమి తిరిగి అభివృద్ధిపై దృష్టి పెట్టనున్నదని చెప్తోంది. ఇండియా కూటమిలో ఏ పార్టీకూడా ఎక్కువ, తక్కువ అనే విభేదాలు రాకుండా.. ఒక సమన్వయ కమిటీని కూడా ఏర్పాటు చేసింది. దీని బాధ్యులు, సభ్యులను త్వరలోనే ప్రకటించనున్నారు.

మొత్తానికి.. గత తొమ్మిదిన్నర ఏళ్లుగా బీజేపీని సరిగ్గా ఎదుర్కోలేక పోతున్నామని భావించిన విపక్షాలు.. ఈ సారి మాత్రం గట్టి కౌంటర్ ఇవ్వబోతున్నాయి. హిందుత్వ, దేశభక్తి అనే రెండు మాటలతో ఇన్నాళ్లూ నెట్టుకొని వచ్చిన బీజేపీకి.. ఇండియా అనే పదం పెద్ద అడ్డంకిగా మారనున్నదని ఇప్పటికే చర్చ జరుగుతోంది. మొత్తానికి ఇటీవల కాలంలో బీజేపీ పైకి విపక్షాలు వదిలిన బ్రహ్మాస్త్రంగా దీన్ని అందరూ మెచ్చుకుంటుండటం గమనార్హం.