HomeTelanganaPolitics

బీఆర్ఎస్‌లో మొదలైన ముసలం.. వాళ్లకు టికెట్లు ఇవ్వొద్దంటూ ఫిర్యాదులు!

బీఆర్ఎస్‌లో మొదలైన ముసలం.. వాళ్లకు టికెట్లు ఇవ్వొద్దంటూ ఫిర్యాదులు!

బీఆర్ఎస్ నేతలు ఫిర్యాదు చేసిన సిట్టింగ్‌లపై సీఎం కేసీఆర్‌కు గానీ, మంత్రి కేటీఆర్‌కు గానీ ఎలాంటి వ్యతిరేకత లేదు. వారికి మరోసారి టికెట్ గ్యారెంటీ అనే వార్తలు వినిపిస్తున్నాయి.

పాపం కృష్ణ మాదిగ…అంతన్నారింతన్నారు….అద్దాల మేడన్నారు… చివరకు తుస్సుమనిపించిన మోడీ
చంద్రబాబు, పవన్ కళ్యాణ్ లు శతృవులయ్యారా ?
‘బీజేపీ నాయకులు ఫోన్ చేస్తే చెప్పుతో కొడతా’

తెలంగాణలో భారత్ రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) ముచ్చటగా మూడోసారి అధికారంలోకి రావాలని లక్ష్యంగా పెట్టుకుంది. అసెంబ్లీ ఎన్నికలకు మరో మూడు నెలలే సమయం ఉండటంతో సీఎం కేసీఆర్ తన వ్యూహాలకు పదును పెడుతున్నారు. ఈ సారి 100 మార్క్ దాటాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ కూడా ప్రతీ సభలో, మీడియా సమావేశాల్లో తప్పకుండా 100 మార్క్ దాటుతామని ధీమాగా చెప్తున్నారు. ప్రజల్లో బీఆర్ఎస్, సీఎం కేసీఆర్ పట్ల పూర్తి నమ్మకం ఉందని.. 9 ఏళ్లలోనే రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపించామని చెబుతున్నారు. మరోసారి అవకాశం ఇస్తే.. తెలంగాణను అన్ని రంగాల్లో దేశంలోనే నెంబర్ 1 స్టేట్‌‌గా మారుస్తామని చెబుతున్నారు.

ఇదంతా బాగానే ఉన్నా.. రాష్ట్ర వ్యాప్తంగా పలువురు సిట్టింగ్ ఎమ్మెల్యేలపై ప్రజలు ఆగ్రహంగా ఉన్నారు. ముఖ్యంగా అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యేలపై పూర్తి అసంతృప్తిగా ఉన్నారు. గతంలో బీఆర్ఎస్ ఎల్పీ సమావేశంలో కొంత మంది ఎమ్మెల్యేలకు పార్టీ అధ్యక్షుడు, సీఎం కేసీఆర్ క్లాస్ తీసుకున్నట్లు కూడా వార్తలు వచ్చాయి. పని తీరు మార్చుకోకుంటే టికెట్లు రావడం కష్టమే అని స్పష్టం చేశారు. హైదరాబాద్‌లో కాకుండా ఎవరి నియోజకవర్గాల్లో వాళ్లు తిరగాలని కూడా ఆదేశించారు. అయినా సరే కొంత మంది ప్రజల్లోకి వెళ్లడం లేదనే వార్తలు వస్తున్నాయి.

రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో దాదాపు 30 నుంచి 40 మంది సిట్టింగులకు టికెట్లు ఇచ్చే పరిస్థితి లేదని తెలుస్తున్నది. వీళ్లకు ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉందని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ చేయించుకున్న సర్వేల్లో తేలింది. దీంతో వారి స్థానంలో ప్రత్యామ్నాయాలు వెదికే పనిలో పడ్డారు. 2018 ఎన్నికల సమయంలో ముందస్తుకు పూర్తి ఆత్మవిశ్వాసంతో కేసీఆర్ ఎన్నికలకు వెళ్లారు. కానీ, ఈ సారి అంత ధైర్యం చేయలేకపోతున్నట్లు తెలుస్తున్నది. అందుకే ప్రజల్లో వ్యతిరేకత ఉన్న సిట్టింగులకు టికెట్లు నిరాకరించే అవకాశం ఉన్నట్లు సమాచారం.

ఇదిలా ఉండగా.. సొంత పార్టీలోనే అసమ్మతి కేసీఆర్‌కు మరో తలనొప్పిగా మారింది. పలు నియోజకవర్గాల్లో సిట్టింగ్ ఎమ్మెల్యేలను మార్చాలంటూ పలు నియోజకవర్గాల్లో స్వయంగా సొంత పార్టీ నాయకులే పట్టుబడుతున్నారు. ఆ సిట్టింగ్ ఎమ్మెల్యేలకు టికెట్లు ఇస్తే తాము సహకరించబోమని ఏకంగా పార్టీ అగ్ర నాయకత్వానికి, మంత్రులకు ఫిర్యాదు చేస్తుండటం గమనార్హం. ఇటీవలే మహబూబాబాద్ నియోజకవర్గం ఎమ్మెల్యే శంకర్ నాయక్‌కు వ్యతిరేకంగా స్థానిక బీఆర్ఎస్ నేతలు తిరుగుబాటు చేసిన సంగతి తెలిసిందే. ఇటీవల కేటీఆర్ అక్కడ పర్యటించిన సమయంలో కూడా.. శంకర్ నాయక్‌ను పట్టించుకోలేదు. దీంతో ఆయనకు ఈ సారి టికెట్ దక్కడం కష్టమే అనే వ్యాఖ్యలు వినిపిస్తున్నారు.

తాజాగా వర్దన్నపేట, పరకాల, వరంగల్ ఈస్ట్ నియోజకవర్గాల్లో కూడా బీఆర్ఎస్ నేతలు సిట్టింగ్ ఎమ్మెల్యేలపై తిరుగుబావుటా ఎగురవేశారు. వర్దన్నపేట ఎమ్మెల్యే ఆరూరి రమేశ్, రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్, వరంగల్ ఈస్ట్ ఎమ్మెల్యే నన్నపనేని నరేందర్, పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డిపై స్థానిక బీఆర్ఎస్ నేతలు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. వీళ్ల స్థానంలో తమకు ఛాన్స్ ఇవ్వాలని కొందరు, వేరే వారికి టికెట్ ఇవ్వాలని మరి కొందరు అధిష్టానానికి ఫిర్యాదు చేసినట్లు తెలిసింది. కాగా, బీఆర్ఎస్ నేతలు ఫిర్యాదు చేసిన సిట్టింగ్‌లపై సీఎం కేసీఆర్‌కు గానీ, మంత్రి కేటీఆర్‌కు గానీ ఎలాంటి వ్యతిరేకత లేదు. వారికి మరోసారి టికెట్ గ్యారెంటీ అనే వార్తలు వినిపిస్తున్నాయి. కానీ, అకస్మాతుగా స్థానిక బీఆర్ఎస్ నేతలు తిరుగుబాటు చేయడంతో అధిష్టానం ఆచితూచి అడుగులు వేస్తోంది.