HomeTelanganaPolitics

ఈ మూవీ తెలంగాణలో బీజేపీకి ఓట్లను రాలుస్తుందా ?

ఈ మూవీ తెలంగాణలో బీజేపీకి ఓట్లను రాలుస్తుందా ?

ఈ మధ్య కాలంలో బీజేపీ భావజాలానికి అనుకూలంగా మూవీలు రావడం పెరిగిపోయింది. అందులో కొన్ని అర్దసత్యాలను చూపిస్తే మరి కొన్ని పూర్తి అసత్యాలతో నిండి ఉంటున్నా

కేసీఆర్ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చబోతున్నాడు -బండి సంజయ్ సంచలన ఆరోపణ‌
బీజేపీలోకి క్యాసినో కింగ్ చీకోటి ప్రవీణ్ ?
బీజేపీకి భయపడే పాతబస్తీకి పరిమితమైన ఎంఐఎం.బీఆర్ఎస్ ను గెలిపించేందుకే మజ్లిస్

ఈ మధ్య కాలంలో బీజేపీ భావజాలానికి అనుకూలంగా మూవీలు రావడం పెరిగిపోయింది. అందులో కొన్ని అర్దసత్యాలను చూపిస్తే మరి కొన్ని పూర్తి అసత్యాలతో నిండి ఉంటున్నాయి. ఆ కోవలోకి చెందినవే కశ్మీర్ ఫైల్స్, కేరళ స్టోరీ సినిమాలు ఇప్పుడు తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు దగ్గరపడుతున్న నేపథ్యంలో తమ ఓట్ల రాజకీయాల కోసం బీజేపీ నాయకులు ‘రజాకార్ – ద సైలెంట్ జెనోసైడ్ ఆఫ్ హైదరాబాద్’ అనే మూవీని రిలీజ్ చేయబోతున్నారు.

‘రజాకార్ – ద సైలెంట్ జెనోసైడ్ ఆఫ్ హైదరాబాద్’ సినిమా పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమం శనివారం హైదరాబాద్ లో జరిగింది. ఈ కార్యక్రమంలో తెలంగాణ మాజీ చీఫ్, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కుమార్, మాజీ ఎంపీ ఏపీ జితేందర్ రెడ్డి, మహారాష్ట్ర మాజీ గవర్నర్ సీ విద్యాసాగర్ రావు తదితర‌ భారతీయ జనతా పార్టీ (బీజేపీ) సీనియర్ నేతలు పాల్గొన్నారు.
యాట సత్యనారాయణ రచన, దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని ‘సమర్‌వీర్‌ క్రియేషన్స్‌’ బ్యానర్‌పై బీజేపీ నాయకుడు గూడూరు నారాయణరావు నిర్మించారు.

ఈ చిత్రాన్ని తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో విడుదల చేసేందుకు నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు. ఈ సందర్భంగా దర్శకుడు మాట్లాడుతూ.. సినిమా మత ఘర్షణల చరిత్ర కాదన్నారు. “ఇది ఎవరి మధ్య అసంతృప్తిని నాటడానికి రూపొందించబడింది కాదు” అని ఆయన అన్నారు.
చిత్ర నిర్మాతలను అభినందిస్తూ, బండి సంజయ్ మాట్లాడుతూ, నిర్మాత ‘పాత‌ బస్తీ ఫైల్స్’ (ఓల్డ్ సిటీని తెలుగులో పాత‌ బస్తీ అంటారు) తీయాలని కోరుకుంటున్నాను అన్నారు.
నిజాంలు అనేక దురాగతాలకు కారణమని చిత్ర నిర్మాతలు పేర్కొన్నప్పుడు, బండి ఇలా అన్నారు: “కొందరు చార్మినార్, ఉస్మానియా ఆసుపత్రి , ఉస్మానియా విశ్వవిద్యాలయాన్ని చూపించి నిజాం-రజాకార్ల పాలనను స్వర్ణ కాలం అని పిలుస్తారు. ఆ రాక్షసుడిని (చివరి నిజాం) మంచి నాగరికత గల వ్యక్తిగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నారు. ఓటు బ్యాంకు రాజకీయాల వల్ల వారు అసలు చరిత్ర చూపించరు అని ఆయన అన్నారు.

ముఖ్యంగా, చార్మినార్‌ను 1591లో కుతుబ్ షాహీ రాజవంశానికి చెందిన సుల్తాన్ మహమ్మద్ కులీ కుతుబ్ షా నిర్మించగా, ఉస్మానియా హాస్పిటల్ (1919లో నిర్మించబడింది), ఉస్మానియా యూనివర్సిటీ (1918లో నిర్మించబడింది) అసఫ్ జాహీ వంశ పాలకులచే స్థాపించబడ్డాయి. కుతుబ్ షాహీలకు రజాకార్లతో ఎలాంటి సంబంధం లేదు.

సెప్టెంబరు 17ని ‘తెలంగాణ విమోచన దినం’గా ప్రచారం చేసేందుకు బీజేపీ చేస్తున్న ప్రయత్నాన్ని కూడా ఈ కార్యక్రమంలో చాలాసార్లు ప్రస్తావించారు.

అయితే, హైదరాబాద్ స్టేట్ లో రజాకార్లు చేసిన అకృత్యాలపై ఎవరికీ ఎలాంటి అనుమానాలు లేవు. దాదాపు సంవత్సరం పైగా వారు పల్లెల్లో అనేక దురాగతాలకు ఒడిగట్టారు. అనేక మంది కమ్యూనిస్టులను ఊచకోత కోశారు. వారికి సహకరిస్తున్నారనే పేరుతో అనేక మందు ప్రజలను కూడా హత్యలు చేశారు. చిత్ర హింసలపాలు చేశారు. హైదరాబాద్ స్టేట్ చరిత్రకు సంబంధించి ఇది పేజీ మాత్రమే. అనేక ఏళ్ళ నిజాం పరిపాలనలో, నిజాం మద్దతుతో గ్రామాల్లో భూస్వాములు, జమీందార్లు, జాగేదార్లు ప్రజలపై పాల్పడ్డ అకృత్యాలు, చేసిన దోపిడి, అరాచకాలు చెప్పడానికి ఎన్ని గంటలైనా సరిపోవు, రాయడానికి ఎన్ని పేజీలైనా సరిపోవు. ఆ భూస్వాముల అకృత్యాల‌ను ఎదిరించడానికే తెలంగాణ రైతాంగ పోరాటం ప్రారంభమైంది.

ఇప్పుడు బీజేపీ వాళ్ళు తీస్తున్న మూవీలో సంవత్సరమో, సంవత్సరంన్నరో రజాకార్లు చేసిన అరాచకాలపై మాత్రమే చర్చ‌ చేసి. గ్రామాల్లో భూస్వాములు చేసిన అరాచకాలను మరుగున పర్చేందుకు ఎందుకు ప్రయత్నిస్తున్నట్టు? అంతే కాదు. పటేల్ సైన్యం హైదరాబాద్ రాష్ట్రాన్ని స్వాధీనం చేసుకున్న తర్వాత భారత సైన్యం చేసిన అకృత్యాలు, కమ్యూనిస్టుల, వారి సానుభీతిపరుల, ముస్లి‍ ప్రజల హత్యలపై భారత కోకిల స్వాతంత్ర్య సమరయోధురాలు సరోజినీ నాయుడి కుమారుడు జయసూర్య నిజనిర్దారణ జరిపి కేంద్ర ప్రభుత్వానికి ఇచ్చిన రిపోర్ట్, ఆ రిపోర్ట్ ను పట్టించుకోని నెహ్రూ ప్రభుత్వం గురించి బీజేపీ నాయకుల రాజాకార్ మూవీలో చూపిస్తారా ? లేక దేశంలో ముస్లింలకు వ్యతిరేకంగా హిందువులను రెచ్చగొట్టే, ప్రజల మధ్య విషభీజాలు నాటే కుట్రలో ఈ మూవీ కూడా భాగమేనా ? ఈ మూవీ వల్ల తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో తమకు హిందువుల ఓట్లు జలజలమని రాలుతాయన్న బీజేపీ కలలు నిజమవుతాయా ? ఎన్నో న్యాయమైన పోరాటాలకు పురిటి గడ్డ అయిన ఈ తెలంగాణ గడ్డ నడక ఎటువైపు సాగుతుంది ?