మీడియా సెంటర్ ప్రారంభం పార్లమెంట్ ఎన్నికల షెడ్యూల్ వెలువడిన నేపథ్యంలో కరీంనగర్ కలెక్టరేట్ జిల్లా ట్రైనింగ్ సెంటర్లో ఏర్పాటు చేసిన మీడియా సెంటర్, మ
మీడియా సెంటర్ ప్రారంభం
పార్లమెంట్ ఎన్నికల షెడ్యూల్ వెలువడిన నేపథ్యంలో కరీంనగర్ కలెక్టరేట్ జిల్లా ట్రైనింగ్ సెంటర్లో ఏర్పాటు చేసిన మీడియా సెంటర్, మీడియా సర్టిఫికేషన్ అండ్ మానిటరింగ్ సెల్ (ఎంసీఎంసీ)ను జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ పమేలా సత్పతి బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మీడియా కోసం అందుబాటులో ఉన్న సదుపాయాలు, ఎంసీఎంసీ పనితీరుకు సంబంధించిన ఏర్పాట్లను పరిశీలించారు. ఎలక్ట్రానిక్, సోషల్ మీడియా విభాగాలను పర్యవేక్షించారు. అనంతరం జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి మాట్లాడుతూ పార్లమెంటు ఎన్నికలకు సంబంధించిన సమాచారాన్ని ఎప్పటికప్పుడు ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులకు అందించేందుకే మీడియా సెంటర్ ను ఏర్పాటు చేశామని పేర్కొన్నారు. ఎలక్షన్ కమిషన్ ఆదేశాల ప్రకారం మీడియా సర్టిఫికేషన్ అండ్ మానిటరింగ్ సెల్ ను ఏర్పాటు చేశామని తెలిపారు. పెయిడ్ న్యూస్ ను గుర్తించడంతో పాటు ప్రచురణ, ముందస్తు అనుమతి లేకుండా ప్రకటనలు ప్రసారం చేస్తే తగిన చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. ఎవరైనా ఎన్నికల ప్రవర్తన నియమావళి అతిక్రమిస్తే కఠిన చర్యలు ఉంటాయని తెలిపారు. అలాగే సోషల్ మీడియాలో వచ్చే పోస్టులపై ప్రత్యేక దృష్టి సారించా లని సూచించారు. సోషల్ మీడి యాలో అభ్యర్థులు, రాజకీయ పార్టీల ప్రకటనల వంటి వాటిని సకాలంలో ఆమోదిస్తూ అనుమతి ఇవ్వాలని పేర్కొన్నారు.
శాటిలైట్ ఛానెల్స్ లో వచ్చే వార్తలను పూర్తిస్థాయిలో రికార్డు చేయాలని సూచించారు. వార్తా పత్రికలు, ఈ-పేపర్లు, టెలివిజన్ ఛానెల్‌లు, స్థానిక కేబుల్ నెట్‌వర్క్‌లు, సోషల్ మీడియా, మూవీ హౌస్‌లు, సంక్షిప్త సందేశాలు, ఇతర ఆడియో-వీడియో విజువల్ మీడియాతో సహా ప్రకటనలను ఎంసీఎంసీ నుంచి ముందస్తు అనుమతి పొందిన తర్వాతే విడుదల చేయాల్సి ఉంటుందని కలెక్టర్ వెల్లడించారు. స్వేచ్ఛాయుత వాతావరణంలో ఎన్నికలు జరిగేలా మీడియా కీలక పాత్ర పోషించాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు ప్రఫుల్ దేశాయ్, లక్ష్మి కిరణ్, డిఆర్ఓ పవన్ కుమార్, సమాచార, పౌర సంబంధాల శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ లక్ష్మణ్ కుమార్, ఫీల్డ్ పబ్లిసిటీ ఆఫీసర్ ఎస్ శ్రీధర్, ఏపీఆర్ఓ వీరాంజనేయులు, డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇన్ఫర్మేషన్ ఇంజనీర్ కొండయ్య, కలెక్టరేట్ ఏవో సుధాకర్, డీఐఓ శివ రాములు, అధికారులు ఉష, సిబ్బంది శ్రీధర్, రాజ్ కుమార్ రాంబాబు,శ్రీధర్ చిట్టెమ్మ తదితరులు పాల్గొన్నారు.